Tuesday, December 24, 2024

కశ్మీరీ యాపిల్‌పై ట్రాఫిక్ పంజా

- Advertisement -
- Advertisement -

అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో యాపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం; అది ఒకప్పటి మాట. ఇప్పుడు తుపాకీ నీడలో బిక్కుబిక్కుమంటున్న బతుకులు. ఆ బతుకులపైన ట్రాఫిక్ రూపంలో రాజ్యం ఉగ్ర పంజా విసిరింది. ట్రాఫిక్‌లో కాసేపు ఇరుక్కుపోతే విసుగెత్తిపోతాం. గంటసేపు ట్రాఫిక్ ఆగిపోతే మనకు ఊపిరాడదు. వారం రోజులపైగా ట్రాఫిక్ ఆగిపోతే!? ఎప్పుడూ లేని ఆ నరకయాతనను ఇప్పుడు కశ్మీర్ యాపిల్ రైతులు అనుభవిస్తున్నారు. జమ్ము, శ్రీనగర్ మధ్య జాతీయ రహదారిలో మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఎనిమిది వేల యాపిల్ పండ్ల ట్రక్కులు వారం రోజులుగా అలా నిలిచిపోయాయి. యాపిల్ రైతులు లబోదిబో మంటున్నారు. ఇక సాధారణ ప్రయాణీకులు, ముఖ్యంగా పిల్ల పాపలు అల్లాడిపోతున్నారు. సరుకుల రవాణా కూడా ఆగిపోయింది. ట్రాఫిక్ దానంతట అది ఆగిపోలేదు. అధికార యంత్రాంగమే ఆపి వేసింది. కార్పొరేట్ శక్తులకు భూములు అమ్మనందుకు, తమ చేతికి ఏ శ్రమా లేకుండా అధికార యంత్రాంగం ద్వారా రైతుల కడుపు పైన ఇలా ఒక్క దెబ్బ కొట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, 800 ట్రక్కుల్లో ఉన్న 56 లక్షల యాపిల్ పండ్ల పెట్టెలు జాతీయ రహదారి మధ్యలో ఆగిపోయాయి. ఆ దెబ్బకు 640 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లి, కశ్మీర్‌లో 75 లక్షల యాపిల్ రైతు కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి.
కశ్మీర్ యాపిల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల్లో కూడా కశ్మీర్ యాపిల్ అంటే ప్రసిద్ధి కనుక, ఇక్కడ నుంచి వివిధ దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. కశ్మీర్‌లో 2014లో కురిసిన భారీ వర్షాలకు ఇతర రైతులతో పాటు యాపిల్ రైతులు కూడా అతలాకుతలమైపోయారు. ఆ భారీ నష్టం నుంచి ఇంకా కోలుకోనే లేదు. ఈ ఏడాది తగిన వర్షాలు పడి, వాతావరణం అనుకూలించి యాపిల్ పంట దిగుబడి బాగా పెరిగింది. కాస్త ఊపిరి పీల్చుకుందామనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ రూపం లో దెబ్బపడింది. యాపిల్ ట్రక్కులు జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో వారం రోజులపైగా నిలిచిపోవడంతో ఇటు యాపిల్ పండించే చిన్న, మధ్య తరగతి రైతులే కాకుండా, అటు మండీ వ్యాపారులు, ట్రక్కుల యజమానులు, డ్రైవర్లు కూడా భారీగా నష్టపోతున్నారు. ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయిందంటే భారీ వర్షాలకు కొండచెరియలు విరిగి రోడ్డుపైన పడడం వల్లనో, జాతీయ రహదారి మరమ్మతుల వల్లనో, పునర్నిర్మాణం వల్లనో ట్రిఫిక్‌ను మళ్ళించడం వల్ల ఆగిపోయిందని అధికారులు సాకులు చెపుతున్నారు. ఇవే కారణాలైతే ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది!? పాలనా యంత్రాంగం ఏం చేస్తోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్‌లో యాపిల్ ట్రక్కులు ఆగిపోయిన విషయాన్ని యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్‌ఎఫ్‌ఐ) నాయకులు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులను ఆదేశించామని లెఫ్టినెంట్ గవర్నర్ ఎఎఫ్‌ఎఫ్‌ఐ నాయకులకు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం. ట్రాఫిక్ అంగుళం కూడా కదలలేదు.
ఈ పరిస్థితిని నిరసిస్తూ యాపిల్ మండీల వ్యాపారులు గత ఆది, సోమ వారాలలో బంద్‌ను పాటించాయి. ఫలితంగా శ్రీనగర్, సోపూర్, షోపియాన్, పుల్‌వామా, కుల్‌గం, పచ్చర్, అనంతనాగ్, హింద్‌వారా, బారాముల్లా, గుండుర్‌బాల్ వంటి పది మండీలు మూసివేశారు. ఇది యాపిల్ పంట దిగుబడికి వచ్చిన కాలం. ఎగుమతి చేయడానికి ఒక్కొక్క బాక్సులో 20 కిలోల యాపిల్ పళ్ళు పెడతారు. ఒక్క ట్రక్కుకు 1200 బాక్సులు పడతాయి. మూడు వందల కిలోమీటర్ల మేర ఎనిమిది వేల ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోతే, ఆ యాపిల్స్ ఎందుకైనా పనికి వస్తాయా!? ఒకవేళ పనికి వచ్చాయే అనుకుందాం, ఇన్ని ట్రక్కుల యాపిల్ పండ్లు ఒక్కసారిగా మండీలకు వెళితే అక్కడ బడా వ్యాపారులు మండీలకు దిగుబడి పెరిగిందని తగిన ధర ఇవ్వరు. గిట్టుబాటు కాని ధరలకు వారు అమ్మనూ లేరు, వెనక్కి తీసుకు వెళ్ళనూ లేరు. అడకత్తెరలో పోక చెక్కలాగా యాపిల్ రైతులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. మార్కెట్‌కు సరుకు సకాలానికి చేరకపోవడం వల్ల కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరత సృష్టించి దేశంలోని ఇతర ప్రాంతాల్లో యాపిల్ ధరలను విపరీతంగా పెంచేస్తాయి. పేద, మధ్య తరగతి రైతులు శీతల గిడ్డంగుల్లో పంట దిగుబడిని నిలువ చేసుకోలేరు. వచ్చిన పంట వచ్చినట్టు అమ్ముకుంటే తప్ప నిలదొక్కుకోవడం సాధ్యం కాదు. ఈ ట్రాఫిక్ తగ్గి మండీలకు ఒక్క సారిగా యాపిల్ వెళితే వాటి ధర దారుణంగా పడిపోతుంది. యాపిల్ కిలో 60 రూపాయల చొప్పునైనా తమ దగ్గర కొనందే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. యాపిల్ కనీస మద్దతుధర ఇచ్చే ఏర్పాటు అధికార యంత్రాంగం వద్ద లేదు. యాపిల్ ధర మర్కెట్‌లో డిమాండ్, సరఫరాల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంది. కార్పొరేట్ శక్తులు దీన్ని ఆసరా చేసుకుని యాపిల్ రైతులను దెబ్బ తీయడానికి, తద్వారా వారి భూములను కారు చవకగా కొనేయడానికి కాచుక్కూర్చున్నాయి. దానికి ట్రాఫిక్ సమస్యను ప్రయోగించాయి. కశ్మీరీ యాపిల్ రైతులు అసలు ఎవరు!? స్వాతంత్య్రం వచ్చినప్పుడు 1947లో పాకిస్థాన్ నుంచి సాయుధ మూకలు కశ్మీర్‌లోకి చొచ్చుకు వస్తున్నప్పుడు వారిని నిలువరించడానికి ప్రాణాలను సైతం తెగించి పోరాడిన కశ్మీరీల వారసులు, వారి మనుమలు, ముని మనుమలు ఈ రైతులు. కశ్మీర్ మన భూభాగం అనుకుంటున్నప్పుడు అక్కడ నివసించే యాపిల్ రైతులు మన భారతీయులు కాకుండా ఎట్లా పోతారు!? వారిపైన ఈ ట్రాఫిక్ పంజా విసరడమేమిటి? ఎనిమిదేళ్ళ క్రితం మోడీ, అమిత్ షా ద్వయం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పబ్లిక్ రంగ సంస్థలన్నిటినీ అమ్మకానికి పెట్టేశారు. బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి, ఓడ రేవులు, బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు గనులతో పాటు చివరికి రక్షణ రంగం కూడా ఆదానీ, అంబానీల చేతుల్లోకి ఒకటొకటిగా వెళ్ళిపోతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న దేశ సంపద చాలదన్నట్టు ఈ కొర్పొరేట్ శక్తుల కన్ను ఇప్పుడు కశ్మీర్‌పై పడింది. మూడేళ్ళ క్రితం వరకు మిగతా దేశం కంటే జమ్ము కశ్మీర్ ప్రజలు కొంత భిన్నమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించే రాజ్యాంగంలోని 370 వ అధికారణాన్ని, 35 ఏ సెక్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తుల కోసమే రద్దు చేసినట్టుంది. అప్పటి నుంచి ఈ కొర్పొరేట్ శక్తుల కన్ను కశ్మీర్‌పైన పడింది. అక్కడి భూములపైన పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ భూములను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి యాపిల్ రైతులు ససేమిరా అంటున్నారు.
కశ్మీరీ రైతులకు అయాచితంగా వచ్చే ఎక్కువ డబ్బుపైన ఆశలేదు. కన్న తల్లి లాంటి నేలను నమ్ముకున్నారు. తమ శ్రమశక్తిపైన తాము బతకగలమన్న ఆత్మవిశ్వాసం వారి గుండెల్లో బలంగా ఉంది. కశ్మీరీ రైతులను ఎలా లొంగ దీసుకోవాలి? వారికి నయానా భయనా చెపితే వినేలా లేరు. యాపిల్ పంట చేతికొచ్చి మండీలకు తరలించే సమయంలో అధికార యంత్రాంగమే ట్రాఫిక్‌ను నిలుపుదల చేసింది. ఒక్క ఏడాది పంట దెబ్బ తింటే రైతు కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది!? అదే ఇప్పుడు జరగబోతోంది. యాపిల్ పంట ఇక గిట్టుబాటు కాదని భూములు అయినకాడికి కార్పొరేట్ శక్తులకు అమ్ముకునే పరిస్థితిని తెచ్చిపెడుతున్నారు. లక్ష 44 వేల 825 హెక్టార్లలోని యాపిల్ పంట, 1.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి, ఆరు వందల కోట్ల రూపాయల ఎగుమతులు ఈ ట్రాఫిక్ వల్ల ఏం కావాలి!? జమ్ము, శ్రీనగర్ మధ్య తాజాగా గురువారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు ట్రక్కులనే కాదు, సాధారణ ట్రిఫిక్‌ను కూడా అధికార యంత్రాంగం నిలిపివేసింది. కశ్మీరునంతా పారామిలిటరీ దళాలు, సైన్యంతో ప్రభుత్వం నింపి వేసింది. రోడ్డు నిర్మాణం, మరమ్మతులు, కొండచరియలు విరిగిపడడం వల్లనే ఈ ట్రాఫిక్ స్తంభన జరిగితే, అక్కడే ఉన్న పారామిలిటరీ దళాలను, సైన్యాన్ని ట్రాఫిక్ పునరుద్ధరణకు ఎందుకు ఉపయోగించకూడదు!? చొరబాట్ల పేరుతో, ఉగ్రవాదం పేరుతో కశ్మీరీల ప్రాణాలను తీయడానికి బదులు వారి సేవలను ప్రకృతి విపత్తుల సమయంలో ఎందుకు వినియోగించుకోవడం లేదు!? సమాధానం తెలిసిందే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల సేవలో రాజ్య యంత్రాంగం తరిస్తోందనేది.

Huge Traffic Jam in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News