ప్రాణహితలో వరదనీటి పరవళ్లు
ఈ సీజన్‌లో తొలిసారిమేడిగడ్డ వద్ద 36గేట్లు ఎత్తివేత
మనతెలంగాణ/హైదరాబాద్: పరివాహక ప్రాంతంలోని ఉపనదులతో గోదావరి నది జీవం పోసుకుంటోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నదికి ఉన్న ప్రధాన ఉపనదుల్లో ఒకటిగా ఉన్న ప్రాణహిత నది మేడిగడ్డ వద్ద గోదావరిలో కలుస్తోంది. ప్రాణహిత నది ద్వారా మేడిగడ్డ బ్యారేజిలో 1.16లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది.ఈ ఏడాది వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యాక ఇంత పెద్ద మొత్తంలో వరద నీటి చేరిక ఇదే కావటంతో మేడిగడ్డ బ్యారేజి 36గేట్లు ఎత్తివేశారు. లక్షా10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజిలో నీటినిలువ 14.13టిఎంసీలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్ నుంచి ఏడు మోటార్లను ప్రారంభించి వరదనీటిని అన్నారం బ్యారేజికి తరలిస్తున్నారు. బుధవారం నాటికి సరస్వతి బ్యారేజిలో నీటి నిలువ 8.02 టిఎంసీలకు చేరుకుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ క్రమేపి పెరుగుతూ వస్తోంది.జలాశయంలోకి 4905క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రిజర్వాయర్‌లో నీటి నిలువ 22.08టిఎంసీలకు చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 8829క్యూసెక్కలు నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 13.78టిఎంసీలకు చేరింది.ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టులోకి 5.36టిఎంసీల నీరు చేరుకుంది. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి 750క్యూసెక్కుల నీరు చేరుతుండగా, లోయర్ మానేరు జలాశయంలోకి 250క్యూసెక్కుల నీరు చేరుతోంది. మంజీరానదిలో నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ నుంచి సింగురు జలాశయంలోకి 790క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టులో నీటినిలువ 18.17టిఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సింగూరు ప్రాజెక్టులోకి 2.24టిఎంసీల నీరు చేరుకుంది.