Wednesday, January 22, 2025

కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి

- Advertisement -
- Advertisement -

Human development set back 5 years by Covid-19

కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
మానవాభివృద్ధి సూచిక లో మొత్తం 191 దేశాల్లో 132 స్థానంలో భారత్
ఐరాస అభివృద్ధి కార్యక్రమం తాజా నివేదిక

వాషింగ్టన్ : గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వెల్లడించింది. ప్రపంచంలో “అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు” అనే పేరుతో తాజా నివేదిక విడుదల చేసింది. కరోనా కారణంగా మానవాభివృద్ధి సూచిక వరుసగా రెండేళ్లు (2020.2021 ఏడాది) క్షీణించి పోయిందని, యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో ఆయుర్దాయం , విద్యా స్థాయిలు , జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించింది. ప్రపంచ ఆయుర్దాయం 2019లో 73 ఏళ్లు ఉండగా అది 2021 నాటికి 71.4 కు పడిపోయిందని తెలిపింది. యూఎన్‌డీపీ ఏర్పడిన గత 30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ అభిప్రాయపడింది. మానవాభివృద్ధి క్షీణించడం అంటే మన ఆయుర్దాయం తగ్గడం, ఉన్నతమైన విద్యను కోల్పోవడం, మన ఆదాయాలు తగ్గిపోవడమేనని యూఎన్‌డీపీ చీఫ్ ఆచిమ్ స్టైనర్ అభిప్రాయ పడ్డారు.

గతంలో ఎన్నో విపత్తులను, ఎన్నో సంక్షోభాలను ప్రపంచం చూసినప్పటికీ ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితులు మాత్రం మానవాభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం దేశాలు ఈ గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నాయన్నారు. ఈ సంక్షోభాలను కొన్ని దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా , దక్షిణాసియా , కరేబియన్ ప్రాంతం లోని కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేక పోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేశాయని నివేదిక పేర్కొంది.

మానవాభివృద్ధి సూచికలో 132 స్థానంలో భారత్

మానవాభివృద్ధి సూచికలో మొత్తం 191 దేశాల్లో భారత్ 132 వ స్థానంలో నిలిచింది. మధ్యస్థ మానవాభివృధ్ధి కేటగిరిలో భారత మానవాభివృద్ధి సూచిక విలువ దేశంలో 0.633 స్థానాలను పొందగా, 2020 మానవ అభివృద్ధి సూచిక నివేదిక లోని 0.645 విలువ కన్నా ఇది తక్కువగా సూచిక పేర్కొంది. ప్రపంచ పరిణామాల విధంగా భారత్‌లో మానవ అభివృద్ధి సూచిక విలువ 2019 నాటి 0.645 నుంచి 2021లో 0.633కు దిగజారిందని పేర్కొంది. పర్యవసానంగా మానవ ఆయుప్రమాణం 69.7 సంవత్సరాల నుంచి 67.2 సంవత్సరాలకు తగ్గిందని వివరించింది. ప్రపంచ స్థాయిలో పురోగతి అన్నది తారుమారు కావడంతో భారత్‌లో కూడా అది ప్రతిబింబిస్తోందని యుఎన్‌డిపి ప్రతినిధి షోకోనోడా పేర్కొన్నారు. స్త్రీ, పురుషుల మధ్య గత తేడాను భారత్ కొంతవరకు నిర్మూలించగలిగిందని, పర్యావరణానికి నష్టం కలగకుండా ప్రయత్నించిందని, సమీకృత ప్రగతి, సామాజిక భద్రత, లింగవివక్ష ఆధార విధానాలు, పునరుత్థాన ఇంధన వనరుల వినియోగం తదితర అంశాల్లో వెనుకబడకుండా భారత్ ముందుకు సాగిందని చెప్పారు. దక్షిణాసియా సరాసరి మానవాభివృద్ధి కన్నా భారత్ మానవాభివృద్ధి విలువ అధిగమించడం కొనసాగుతోందని పేర్కొన్నారు. 1990 నుంచి భారత్ మానవాభివృద్ధి సూచిక విలుక నిదానంగా ప్రపంచ సరాసరి స్థాయిని చేరుకుంటోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News