Wednesday, January 22, 2025

అమరత్వం కోసం ఆరాటం

- Advertisement -
- Advertisement -

ఒకవైపు ప్రపంచం అమరత్వం దిశగా అడుగులేస్తోంది. మరో వైపున మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోతోంది. జన్యు మార్పిడి, జీవితకాలమంతా మితంగా తక్కువ క్యాలరీలతో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శరీరానికి అవసరమైన వ్యాయా మం చేయడం వంటి పద్ధతులను అనుసరించడంతో జీవిత చక్రంలోని వివిధ దశల నిడివిని పెంచవచ్చని, శిశు దశను, బాల్యాన్ని, కౌమారాన్ని, యవ్వనాన్ని, పెద్దరికాన్ని, వృద్ధాప్యాన్ని ఆయా దశలలో జీవిత కాలాన్ని సాగదీయవచ్చని అమెరికా, రష్యా దేశాల్లోని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలా మనిషి 120 నుండి 150 సంవత్సరాల వయసు వరకు జీవించవచ్చని నిర్ధారించారు. 100 సంవత్సరాల పైబడి జీవించి ఉన్న స్త్రీ పురుషుల వివరాలను నమోదు చేస్తున్న ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఫ్రాన్స్‌కి చెందిన జీన్ కాల్మెంట్ అనే మహిళ ఇప్పటి వరకు జీవించిన వారిలో అత్యధిక వయస్సు గల వ్యక్తిగా రికార్డుల్లో నమోదయింది. ఆమె 1997లో తన 122 సంవత్సరాల వయస్సులో మరణించారు.

సిలికాన్ వ్యాలీలో అమరత్వం అనేది భౌతిక లక్ష్యంగా పెట్టుకొని ప్రముఖమైన సాంకేతిక సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇందుకోసం శాస్త్రీయంగా ప్రయోగాలు జరిపే వెంచర్లకు నిధులను సమకూర్చాయి. ఫేస్ బుక్ మొదటి పెట్టుబడిదారు, పే పాల్ కంపెనీ సహ -వ్యవస్థాపకుడు 47 ఏళ్ళ పీటర్ థియెల్ 120 సంవత్సరాలు వయసు వచ్చే వరకు బతికుండాలనే ఆశతో మానవ పెరుగుదల హార్మోన్ (హ్యూమన్ గ్రోత్ హార్మోన్) తీసుకుంటున్నానని బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఇది పని చేస్తుందో లేదో తెలియదు. హాని కలిగించదన్న హామీ కూడా లేదు. ఆదిమ మానవుడిలాగా చేపలు, మాంసం, పళ్ళు తింటానాని చెప్పాడు. చక్కెర, పాలు, పిండి పదార్ధాలు, కంపెనీల్లో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానేసానన్నాడు. రెడ్‌వైన్ తాగుతాను, రోజు కాసేపు పరుగులు తీస్తాను అన్నాడు.

ఆబ్రే డి గ్రేస్ సెన్స్ ఫౌండేషన్‌కు మానవ జీవిత కాలాన్ని విస్తరించడానికి చేసే పరిశోధనల నిమిత్తం ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల డాలర్ల విరాళం ఇస్తున్నాడు. మరణాన్ని చేరుకోవడానికి మూడు ప్రధాన మార్గాలని ‘మీరు దానిని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా దానితో పోరాడవచ్చు. మన సమాజంలో మృత్యువుని తిరస్కరించే లేదా అంగీకరించే వ్యక్తులే అధికం, నేను మాత్రం దానితో పోరాడటానికే ఇష్టపడతాను’ అన్నాడు. గూగుల్ సహ -వ్యవస్థాపకుడు, 41 సంవత్సరాల సెర్గీ బ్రైన్ తన కొత్త బయోటెక్ కంపెనీ కాలికోను ప్రారంభించాడు. మన జీవితంలో ఛేదించలేని గొప్ప రహస్యాలలో ఒకటైన వృద్ధాప్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నాడు. బయో ఫార్మాస్యూటికల్ సంస్థ అబ్ వీతో చేతులు కలిపి 1.5 బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా కుమ్మరించాడు. బ్రైన్ ఆసక్తికి కారణం -అతనికి జన్యుపరంగా పక్షవాతం సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకొన్నాడు. బ్రైన్ భార్య ‘23 అండ్ మి’ అనే పర్సనల్ జెనోమిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు.

ఒరాకిల్ కంప్యూటర్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు డెబ్బయ్యేళ్ళ లారీ ఎల్లిసన్ వృద్ధాప్యాన్ని జయించే పరిశోధనలకు మద్దతుగా 1997లోనే ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్‌ను సృష్టించాడు. అందుకోసం ఇప్పటికే 335 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేశాడు. ‘అక్కడ ఇప్పటిదాకా సజీవంగా ఉన్న వ్యక్తి, ఉన్నటుండి క్షణాల్లో ఎలా అదృశ్యమవుతాడు?’ అంటూ మృత్యువు పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కాలికో కంపెనీ ఆవిర్భావంతో తన వంతు పనిని పూర్తి చేశానని, ఈ పరిశోధనలను ముందుకు తీసుకొనిపోవడానికి అవసరమైన డాటా ను సృష్టించగలిగానని భావిస్తున్నాడు.

శాన్ డియాగోకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, మానవ జన్యువులపై అనేక పరిశోధనలు చేసిన బిలియనీర్, క్రెయిగ్ వెంటర్ 2014లో జన్యుశాస్త్రం, స్టెమ్ సెల్ థెరపీలలో అభివృద్ధిని ఉపయోగించి ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడానికి, ‘హ్యూమన్ లాంగ్విటీ’ అనే కంపెనీ పెట్టాడు. మరణాన్ని ఓడించాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ‘మన మెదడు, మన మనస్తత్వాలు అమరత్వం కోసం సిద్ధం గా ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలియదు’. కానీ, మనిషి తన చివరి దశలో నొప్పితో, కష్టాలతో, తీవ్ర వ్యాధులతో పోరాటం లేకుండా వందేళ్లు హాయిగా జీవించగలిగితే అటువంటి కృషికి తన ఆత్మను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానంటాడు.

‘న్యూ మీడియా స్టార్స్’ అనే ఆన్‌లైన్ మీడియా సంస్థను స్థాపించి ఇంటర్‌నెట్ రారాజు అయిన ముప్పై ఏళ్లు పైబడిన యువకుడు, రష్యన్ మల్టీ- మిలియనీర్, డిమిత్రి ఇత్స్కోవ్ దృష్టి పథంలో -‘మీ మెదడు చాలా తక్కువ- ధర కలిగిన డిజిటల్ కాపీగా, అదే మీ జీవిత అవతారంగా మారిపోతుంది. దానికి వయసుతో నిమిత్తం లేదు’. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అత్యంత అధునాతన నాన్-బయోలాజికల్ వాహకానికి బదిలీ చేయడానికి, మనిషి జీవిత కాలాన్ని పొడిగించడానికి, ఆ క్రమంలో అమరత్వాన్ని సాధించేందుకు అవసరమైన సాంకేతికతలను రూపొందించడం లక్ష్యంగా అతని సంస్థ పని చేస్తోంది. 2045 కల్లా ఈ లక్ష్యాన్ని సాధిస్తానంటున్న డిమిత్రి సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యక్తి కాకపోయినా, అతని ఆలోచనలు మాత్రం ఆ చుట్టూనే తిరుగుతుంటాయి. గూగుల్‌లో ఇంజినీరింగ్ డైరెక్టర్, ప్రముఖ ఫ్యూచరిస్ట్ రే కుర్జ్‌వీల్ ఆలోచనల ప్రేరణతో ముందుకు సాగుతున్నాడు.

ఎదో ఒక రోజున శాస్త్రవేత్తలు మానవ అంతర్గత స్పృహను డౌన్‌లోడ్ చేయడాన్ని కనుగొంటారని, అలా కనుగొన్నాక మనకు మన శరీరాలతో అవసరమే ఉండదని కుర్జ్‌వీల్ అంచనా. అయితే యుఎన్ డిపి ఇటీవల విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక మనిషి ఆశల మీద నీళ్లు చల్లింది, పూర్తి విరుద్ధమైన ఫలితాలను ప్రకటించింది. అనిశ్చిత కాలం, అస్థిర జీవితాలు మారుతున్న ప్రపంచం లో మన భవిష్యత్తును రూపొందిస్తున్నాయని పేర్కొంది.కొవిడ్- 19, ఉక్రెయిన్‌లో యుద్ధం, వాతావరణంలో నెలకొంటున్న ప్రమాదకరమైన మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి అనేక సంక్షోభాల నేపథ్యంలో ప్రతి పది దేశాలలో తొమ్మిది దేశాలు మానవాభివృద్ధిలో వెనుకబడ్డాయి. మొదటిసారిగా మానవాభివృద్ధి వరుసగా రెండేళ్లపాటు క్షీణించింది, 90 శాతం దేశాలు 2020 లేదా 2021లో తమ మానవాభివృద్ధి సూచికల విలువలో క్షీణతను నమోదు చేశాయి.
మానవాభివృద్ధి సూచిక (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్) స్థూల దేశీయోత్పత్తికి (జిడిపి) ప్రత్యామ్నాయ కొలబద్దగా 1990లో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యుఎన్‌డిపి) ద్వారా ప్రారంభమైంది.

భారతదేశం, పాకిస్థాన్ దేశాల నుండి ఇద్దరు ప్రముఖ ఆర్థికవేత్తలు అమర్త్య సేన్, మహబూబ్ ఉల్ హక్ ఈ సూచికలను తయారు చేశారు. వృద్ధి ప్రక్రియలో మానవ అభివృద్ధిని కేంద్రీకరించవలసిన అవసరాన్ని ఇవి ఉద్ఘాటిస్తాయి.అంతర్జాతీయ సంస్థలు మానవాభివృద్ధి పురోగతిని మూడు కీలకమైన కోణాల నుంచి పరిశీలిస్తాయి. ప్రజల శక్తి సామర్ధ్యాలే దేశాభివృద్ధికి నిజమైన గీటురాళ్ళుగా, మనిషికి మంచి ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు, ఉన్నతమైన విద్య, జ్ఞానం, జీవన ప్రమాణాలు కలిగి ఉంటేనే నిజమైన వృద్ధి సాధించినట్టుగా పేర్కొంటారు.వీటి పరిశీలనకు నాలుగు సూచికలను కొలమానంగా తీసుకొంటారు. 1. పుట్టినప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం అంచనా, 2. సగటున పాఠశాల విద్యను అభ్యసించిన సంవత్సరాలు, 3. పాఠశాల విద్య సగటున ఎన్ని సంవత్సరాలు సాగించవచ్చని అంచనా, 4. సగటు తలసరి జాతీయ ఆదాయం.

ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయా లేదా అని గమనంలోకి తీసుకొంటాయి ఈ సూచికలు. వీటి ఆధారంగా ప్రతి దేశంలోనూ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి వాటికి ర్యాంకులు నిర్ణయించి ప్రతి ఏడాది మానవాభివృద్ధి నివేదికలను విడుదల చేస్తారు. ఇది ప్రారంభమైన తరువాత ఒక్క 2012 సంవత్సరం మినహాయిస్తే 2022 వరకు వరుసగా అన్ని నివేదికలు విడుదలైనాయి. మానవాభివృద్ధి నివేదిక 2021- 2022లో 2021 సంవత్సరానికి సంబంధించిన సమాచారంతో 190 దేశాలను చాలా ఉన్నతమైన వృద్ధి, అధిక వృద్ధి, మధ్యస్థ వృద్ధి, తక్కువ వృద్ధి సాధించిన నాలుగు సమూహాలుగా విభజించి ర్యాంకులను ఇచ్చింది. ఆయుర్దాయం అనేది ఒక దేశంలో నిర్దిష్ట జనాభా సగటున ఏ వయసులో మరణిస్తారో తెలియజేస్తుంది. సాధారణంగా పుట్టినప్పటి నుంచి పదేళ్ల వయసు తేడాతో అంటే 1-10, 11-20, 21-30 విధానంలో జనాభాలో ప్రతి సమూహం వారికి జీవిత కాలాన్ని అంచనా వేస్తారు. అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ దేశాలు మొదలుకొని చిన్న సార్వభౌమ దేశాలైన అండోరా, శాన్ మారినో వరకు 225 దేశాల/ప్రాంతాల జనాభాకు వారి ఆయుర్దాయం రేటు అంచనాలు అందుబాటులో ఉన్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా తక్కువ ఆయుర్దాయం కలిగి ఉందంటే ఆ దేశాల్లో వృద్ధులు లేరని కాదు అర్ధం. పేద దేశాల్లో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండటంవల్ల సగటు ఆయుర్దాయం తగ్గుతుంది. గుండె జబ్బులు, పోషకాహార లోపం, ట్రామా, అంటువ్యాధులు, మద్యపానం, రోడ్డు ప్రమాదాల కారణంగా యువత ముందస్తు మరణాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు ఆయా దేశాల జనాభా సగటు ఆయుర్దాయాన్ని తగ్గిస్తున్నాయి. ఈ ముందస్తు మరణాలను నివారించినట్లయితే జనాభా సగటు ఆయుర్దాయం పెరుగుతుంది. కాలుష్య రహిత పర్యావరణం, మంచి సామాజిక ఆర్ధిక స్థితిగతులు దీర్ఘాయువును ప్రోత్సహిస్తాయని అనేక అధ్యనాలు తెలియచేశాయి. మంచినీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అధిక స్థాయిలో అందుబాటులో ఉన్న జనాభానే ఎక్కువ కాలం జీవించగలుగుతోంది. ఆర్థికాభివృద్ధిలో వెనుకబాటు తనం, హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధి సంక్రమణ కారణంగా ఆఫ్రికాలో జనాభా ఎక్కువ మరణాల రేటుతో అధ్వానమైన ఆయుర్దాయం కలిగి ఉంది.

కానీ, ఎక్కువ ఆయుర్దాయాన్ని సాధించిన మొదటి మూడు దేశాల కంటే (హాంగ్ కాంగ్ 85.5, జపాన్ 84.8, ఆస్ట్రేలియా 84.5) అధిక ఆదాయం కలిగిన అమెరికా సిలికాన్ వ్యాలీ కలలకు దూరంగా 77.2 సంవత్సరాల ఆయుర్దాయంతో చాలా వెనుకపడింది. ఇది మొదటి శ్రేణిలోని 66 దేశాల జనాభా సగటు 78.5 కంటే తక్కువ స్థాయిలో వాటిలో 41వ దేశంగా ఉండటం గమనార్హం. ఆదాయాలను ఆయుర్దాయాలను పోల్చి చూసేటప్పుడు ఆదాయానికి మించి లోతుగా పరిశీలించడం అవసరమని ఇప్పటి నివేదిక పేర్కొంది. 2021లో గణనీయమైన ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ ఆరోగ్య సంక్షోభం తీవ్రమైందని మూడింట రెండు వంతుల దేశాలు సగటు ఆయుర్దాయాలలో మరింత తరుగుదలను నమోదు చేశాయని ఈ నివేదిక ప్రకటించింది. ఆర్థిక వనరుల పరిమాణం మానవాభివృద్ధిని ప్రభావితం చేసే కీలకమైన అంశం అయినప్పటికీ వనరుల పంపిణీ, కేటాయింపులు సరిగా జరగకపోతే పరిస్థితులు ఇలాగే విషమిస్తాయని, మానవ అభివృద్ధి స్థాయిని నిర్ణయించడంలో సమ వాటా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ నివేదిక తేటతెల్లం చేసింది.

పరుచూరు జమున
9704111390

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News