Thursday, January 23, 2025

ప్రమాదంలో జీవవైవిధ్యం

- Advertisement -
- Advertisement -

ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో మానవునితో పాటు సజీవులైన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పరస్పరం తేడాలతో ఉంటూ , వివిధ రూపాలలో, వివిధ జీవన విధానాలతో నిర్దిష్ట ఆవాసాల్లో నివసిస్తూ ఉంటాయి. జీవులలో గల ఈ రకమైన తేడాలనే జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) అని పిలుస్తాము. ఒక అవాస ప్రాంతంలో సజీవులు ఇతర నిర్జీవులైన గాలి, నీరు, భూమి, రాయి, ఉష్ణోగ్రత, శీతోష్ణస్థితి తదితర అంశాలతో పరస్పరం భాగస్వాములవుతూ ఒక దానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల ప్రకృతి సమతుల్యత కాపాడబడుతున్నది. అనాది నుండి ప్రకృతిని రక్షించడం, ప్రకృతి వనరులను పొదుపు చేయడం, ప్రకృతితో కలిసి సామరస్యంగా జీవించడం అనేవి మన సంస్కృతిలో భాగంగా ఉంటోంది. నాటి నుండే ప్రజలు చెట్లను, జంతువులను, అగ్ని, నీటిని, గాలిని గ్రామ దేవతలకు సింబాలిక్‌గా భావించి పూజించి ఆవరణ వ్యవస్థలను సంరక్షించేవారు.

కానీ నేడు అభివృద్ధి ఆధునికత, సాంకేతికతల పేరుతో మానవుడు మితిమీరిన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిలోని వివిధ రకాలైన జీవుల వినాశనానికి పాల్పడుతున్నాడు. తద్వారా భూమిపై జీవవైవిధ్యం సంక్షోభంలో కొట్టుమిట్టాడుచున్నది. ఈక్రమంలో భూమిపై సమస్త జీవుల సంరక్షణ, ప్రజలలో జీవవైవిధ్య అవగాహనా కార్యక్రమాల అమలుకు ప్రతి సంవత్సరం మే 22 న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ) నిర్వహించాలని 1990 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. అందుకనుగుణంగా ఆనాటి నుండి ప్రపంచదేశాలు జీవవైవిధ్య సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. గత సంవత్సరం ‘సకల జీవుల ఉమ్మడి భాగస్వామ్య భవితవ్యమును నిర్మిద్దాం’ అనే ప్రధాన ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవమును నిర్వహించారు .

ఈ సంవత్సరం 2023మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను పురస్కరించుకొని ఒప్పందం నుండి కార్యాచరణ వరకు- జీవ వైవిధ్యాన్ని తిరిగి నిర్మిద్దాం (ఫ్రమ్ అగ్రిమెంట్ టూ యాక్షన్- బిల్ బ్యాక్ బయోడైవర్సిటీ) అనే నినాదంతో ప్రపంచ దేశాలన్నీ ఈ అంతర్జాతీయ పండుగను జరుపనున్నాయి. ఈ సందర్భంగా యుఎన్‌ఒ ఆధ్వర్యంలో జపాన్‌లోని టోక్యోలో సింపోజియం జరుగనున్నది. గత సంవత్సరపు అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ఆమోదించిన ఒప్పందంలోని జీవసంరక్షణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలనే ఆలోచనను ఈ నినాదం ప్రోత్సహిస్తున్నది. భారత అధ్యక్షతన వచ్చే సెప్టెంబర్ 2023లో ‘వన్ ఎర్త్, -వన్ ఫ్యామిలీ, -వన్ ఫ్యూచర్’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలో జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశంలో గ్రీన్‌డెవెలప్‌మెంట్ , క్లైమేట్ ఫైనాన్స్, లైఫ్ స్టైల్స్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (లైఫ్) అనే జీవవైవిధ్య సంరక్షణ అంశాలు సమావేశపు ఎజెండా ప్రాధాన్యతా అంశాలుగా ఉండటం ఆహ్వానించదగిన పరిణామంగా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంక్షోభంలో జీవవైవిధ్యం: భూమిపై సుమారు 54 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కేంబ్రియన్ పేలుడు లేదా బయాలాజికల్ బిగ్ బ్యాంగ్ ద్వారా జీవవైవిధ్య వృద్ధిలో వేగవంతమైన పురోగతి మొదలైంది. ప్రస్తుతం భూమిపై సుమారు 1 కోటి 40 లక్షల జీవజాతులున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా. వీటిలో ఇప్పటి వరకు సుమారు 80 లక్షల జాతులు మాత్రమే గుర్తించారు. భూమిపై అసాధారణ వాతావరణ మార్పులు, వరదలు, తీవ్రమైన తుఫానులు, భూతాపం, పారిశ్రామికీకరణ, మైనింగ్, విచ్చలవిడిగా అడవుల నరికివేత, కొన్ని ప్రాంతాల్లో అతి చల్లదనం, అంటువ్యాధులు కృత్రిమ మేధలతో పాటు ఆవాస నష్టం, పరజాతుల దాడి, కాలుష్యం, అధిక జనాభా, అధిక సాగుబడి అను అంశాలు జీవవైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును. పలు కారణాల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం

10 వేల జీవజాతులు అంతరించిపోతున్నట్లు ప్రముఖ అమెరికన్ సోషియో బయాలజిస్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ ఓ విల్సన్ పేర్కొన్నారు.19వ శతాబ్దంతో పోలిస్తే ఒక్క 20 వ శతాబ్దంలోనే దాదాపు 543 సకశేరుక జాతులు కనుమరుగైనట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గత 50 ఏండ్ల కాలం నుండి సకశేరుకాలు సగటున 69% మేరకు తగ్గిపోయాయని, ప్రస్తుతం 35 వేల జాతులు అంతరించే దశలో ఉన్నాయని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ తన లివింగ్ ప్లానేట్ రిపోర్ట్- 2022లో తెలిపింది. మానవ చరిత్రలో అపూర్వమైన స్థాయిలో జీవవైవిధ్యం నాశనం చేయబడుతున్నదని ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ పేర్కొనడం గమనార్హం.
మన దేశంలో ఇప్పటి వరకు సుమారు 18 లక్షల జీవజాతులు గుర్తించబడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జీవవైవిధ్య సంపన్నత ఉన్న 35 గ్లోబల్ హాట్ స్పాట్లలో మన దేశంలో పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఇండో బర్మన్ ప్రాంతం, నికోబార్ దీవులు అను 4 హాట్ స్పాట్లు ఉన్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆదివాసులైన గిరిజనులు, కొండజాతి ప్రజలు ఎక్కువగా ఉన్న మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో జీవవైవిధ్యం ఎక్కువగా పదిలంగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జీవవైవిధ్యంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ -2021 నివేదిక ప్రకారం మన దేశంలో 1 లక్షకుపైగా జంతు జాతులు, 55 వేలకు పైగా మొక్కల జాతులు ఉన్నాయి . 70% చేపలు అంతరించే దశలో, 57% ఉభయ చరాలు కనుమరుయ్యే దశలో, 7% పక్షులు అంతరించే దశలో ఉన్నాయని,

ప్రతి ఏటా 1500 వృక్ష జాతులు పలు కారణాలతో చనిపోతున్నాయని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ పేర్కొంది. రెడ్ డాటా లిస్ట్ (ఇండియా) 2021- 22 ప్రకారం మన దేశంలో పులి, సింహం, చిరుత, ఒంటి కొమ్ము రైనో, గబ్బిలం, డోడో పక్షి, నెమలి, రివర్ డాల్ఫిన్, రెడ్‌పాండా, రాబందు, ఏనుగు, పిచ్చుక, రాక్ క్యాట్, ఎగిరే ఉడుత, సాలీడు, ఎలుగు బంటి, అడవి కోతి, గబ్బిలాలు తదితర జంతువులు, వేప సైకస్ క్లేవియర్, ఆర్కిడ్ చెట్లు తదితర జీవులు సమీప భవిష్యత్తులో అంతరించే దశలో ఉన్నాయి. భూమిపై తేనెటీ గల సంతతి కనుక అంతరించిపోతే, తర్వాత నాలుగేండ్లలో మానవ జాతి కనుమరుగవుతుంది అన్న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ మాటలు ఈ సందర్భంగా గమనించదగినవి.
భూమిపై విపరీతమైన అసాధారణ ఆకస్మిక వాతావరణ మార్పులు, భారీ అగ్నిపర్వతాల విస్పోటనం, భూమిని గ్రహ శకలాలు ఢీ కొట్టడం వంటి కారణాల వల్ల ఇప్పటికే భూమిపై 5 మహా జీవ అంతర్ధాన సంఘటనలు లేదా సామూహిక జీవ వినాశన ప్రక్రియలు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై మానవుడు ఆవిర్భవించక పూర్వమే ఈ 5 మహా సంఘటనలు జరిగాయి. ఆర్థోవిసియన్ -సైలూరియన్ అంతర్ధానం, లేట్ డీవోనియన్ అంతర్ధానం, పర్మియన్- ట్రయసిక్ అంతర్ధానం, జూరాసిక్ అంతర్ధానం, పేలియోజీన్ అంతర్ధానం అను 5 దఫాలుగా సుదీర్ఘ కాల వ్యవధులలో జరిగిన మహాప్రళయాలలో ప్రతిసారి భూమిపై గల జీవులలో మూడొంతులకు పైగా జీవులు పెద్ద ఎత్తున అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు మనం 6వ మహా అంతర్ధాన ప్రక్రియ అయిన హలోసీన్ అంతర్ధానం లేదా అంత్ర పోసీన్ అంతర్ధానంలో జీవిస్తున్నామని జీవవైవిధ్యంపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ కోవి

తాజాగా ‘సైన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రం- 2022లో పేర్కొన్నాడు. మనిషి మాత్రమే తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మార్చగలిగే స్థితిలో ఉన్నాడని, ఈ 6 వ మహాజీవ అంతర్ధాన ప్రక్రియ కేవలం మానవ కల్పితమేనని దానికి అప్పుడే నాందీ ప్రస్తావన పడిందని కూడా పేర్కొన్నాడు. ప్రకృతిలో వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం, జీవుల విలుప్తం అనేవి సహజ ప్రక్రియలేనని వాదన కూడా లేకపోలేదు. ఇది కొంత వరకు నిజమే కావొచ్చు. కానీ మొదటి 5 అంతర్ధాన ప్రక్రియలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న 6 వ అంతర్ధాన ప్రక్రియ మరింత వేగంగా సాగుతుండటమే ఆందోళనకరమైన విషయం. దీనికి మనిషి మతిమాలిన ప్రకృతి విరుద్ధ చర్యలే కారణం అవుతుండటం విషాదకరం. ఈ ఘోర కలిని ఆపగలిగే శక్తి కూడా మానవునికే ఉందన్న విషయం మనందరం గ్రహించాలి. అందుకే మానవుడు జీవ సంరక్షణకు ఆచరణాత్మక పురోగతితో ముందుకెళ్లాలి.
ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ కోసం రియోడిజనిరో సదస్సు -1992 మొదలు కున్మింగ్- మాంట్రియల్ సదస్సు- 2022 వరకు నిర్దేశించుకున్న కార్యాచరణ లక్ష్యాలలో ఏవీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. కనుక పాలకులు, ప్రజలు జీవవైవిధ్య సంరక్షణకు నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2030 నాటికి భూభాగం సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాలలో కనీసం 30 శాతాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు కాప్- 15 సదస్సులో ఆమోదించిన 30 బై 30 ప్రణాళికను ఖచ్చితంగా అమలు పరుచడానికి కార్యోన్ముఖులం కావాలి. 2024లో టర్కీలో జరుగబోయే అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు (కాప్-16) లో గత ఫ్రేమ్ వర్క్‌లోని లక్ష్యాల పురోగతిని అంచనా వేయడానికి అనుమతించాలి. అత్యధిక కర్బన ఉద్గారీత ధనిక దేశాలు పేదదేశాల అభ్యున్నతికిచ్చే లాస్ అండ్ డ్యామేజి ఫండ్ విడుదల, వినియోగంపై స్పష్టత ఎంతో అవసరం. భూమిపై 2030 నాటికి 300 కోట్ల లక్షలకుపైగా చెట్లను నాటాలన్న శాస్త్రజ్ఞుల సూచనలను పాటించాలి.

పులి, ఏనుగు వంటి అంబ్రెల్లా జాతులను సంరక్షించాలి. అంతరించే జాతులను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పునరుద్ధరించాలి. పురుగు మందుల వినియోగాన్ని 50% తగ్గించాలి. వన్యప్రాణి, పర్యావరణ, జీవవైవిధ్య రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. గ్రామ స్థాయి జీవవైవిధ్య నిర్వహణ కమిటీలను చైతన్యపరచాలి. వ్యవసాయం, వినియోగం, వ్యర్థాల్లో తగ్గింపులు, సహకార నీటి నిర్వహణతో సహ ప్రకృతిలోని సకల జీవుల సంరక్షణ యెడల మానవునిలో పరివర్తనాత్మక మార్పులు రావాలి. మనం ఇప్పుడు భూగ్రహంపై ‘కోడ్రెడ్’ స్థితిలో ఉన్నామన్న ప్రపంచ శాస్త్రవేత్తల బృందం తాజా హెచ్చరికల నేపధ్యంలో జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందాలను కార్యాచరణ దిశగా తీసుకెళ్ళడంతోనే ప్రమాదపు అంచులో ఉన్న జీవవైవిధ్య సంక్షోభాన్ని నివారించగలుగుతాము. ‘ఈ భూప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు, కానీ దురాశను మాత్రం కాదు’ అన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తితో మనం ప్రకృతితో సామరస్య జీవనాన్ని నిరంతరం కొనసాగించడం వల్ల భూమిపై సమృద్ధమైన జీవవైవిధ్య సంపన్నత పరిఢవిల్లుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News