Saturday, December 21, 2024

మానవ హక్కులకు 75 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. ఇవీ కులం, మతం, జాతి, లింగం, జాతీయత, భాషతో సంబం ధం లేకుండా అందరికీ సమానంగా కల్పించబడేటివి. పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించి, ఆత్మగౌరవ జీవనానికి ఆయువు లాంటివి. ఇందులో జీవించే హక్కు, స్వేచ్ఛ, బానిసత్వం, హింస నుంచి విముక్తిని కలిగి ఉండడం మొదలుకొని… అభిప్రాయం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పని, విద్య హక్కు వంటివి మరెన్నో వున్నాయి. వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హక్కులకు అర్హులు. మానవ హక్కుల రక్షణకు 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి సార్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. వీటి పట్ల అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నారు.
ఈ ఏడాది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే ఇతివృత్తంతో ఈ రోజును నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనకు 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకొన్నది. వ్యక్తి స్వేచ్ఛ- హక్కులపై జారీ చేయబడిన మాగ్నాకార్టా 1215 తరువాత విశ్వమానవ హక్కుల ప్రకటనే కీలకమైనది. ఐక్యరాజ్యసమితి సాధించిన గొప్ప విజయాలలో సమగ్ర మానవ హక్కుల ప్రకటన ఒకటి. వీటిని అన్ని దేశాల ప్రజలు కోరుకున్నారు.

హక్కులను ప్రోత్సహించి, రక్షించడానికి పలు దేశాల రాజ్యాంగాలలో పొందుపరిచారు. ఐరాస మానవ హక్కుల ప్రకటన భారత్‌తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తోంది. ఐరాస సభ్యదేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా నిలిచింది.
మనిషి మనిషిగా జీవించడానికి హక్కులు అత్యవసరం. కానీ అనేక సందర్భాల్లో అవి ఉల్లంఘనలకు గురికావడం ఆందోళన కలిగిస్తున్నది. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో ఇంకా జాతి, భాష, కుల, మతాల జాడ్యం వీడలేదు. అధికులమనే దురహంకారం, సంకుచిత భావజాలాల వలన మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది. భారత దేశంలో అనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనంతో బడుగు, బలహీన వర్గాలు వివక్షకు గురైనారు. వీరంతా రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు సమానత్వానికి ఆమడ దూరంలోనే ఉన్నారు. వీరి విముక్తి కోసం భారత దేశంలో బి. అర్. అంబేడ్కర్, జ్యోతిభా ఫూలేలు అలుపెరగన పోరాటం చేశారు. అయినప్పటికీ నేటికీ పట్టణాల్లో దళితులు ఇల్లు అద్దెకు అడిగితే కులమడుగుతున్నారు.

పారిశుద్ధ కార్మిక వృత్తిలో సైతం వారే కొనసాగుతున్నారు. అనగా కులం పేరుతో మానవ హక్కుల ఉల్లంఘనలు ఏ మేరకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. స్త్రీలు, బాలికల, వృద్ధులపై హింస పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది. లాకప్ మరణాలు మానవ హక్కులకు తీవ్ర వివాదం కలిగిస్తున్నాయి. మరో వైపు గోవధ పేరుతో దాడులు, మతం పేరుతో అల్లర్లకు దారి తీస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక కాలం చెల్లిన చట్టాల వల్లే కాదు.. చీకటి చట్టాల వల్ల కూడా మానవ హక్కులు ప్రమాదంలో పడిన ఉదంతాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 కింద అపరిమిత అధికారాల వల్ల సైన్యం హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మణిపూర్‌లోని ఈరోన షర్మిల పోరాటంతో ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. ప్రభుత్వం చేసిన చట్టాలలో సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 66-ఎ కింద సామాజిక మాధ్యమాల ద్వారా హానికర /అసభ్యకరమైన సందేశం పంపించడాన్ని నేరంగా పరిగణిస్తూ.. ఈ సెక్షన్ వీలు కల్పిస్తుంది. అయితే, సెక్షన్ 66-ఎ పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తుందని పేర్కొంటూ.. 2015లో ఎట్టికేలకు సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది.

మరో వైపు దేశద్రోహం పేరుతో ఐపిసి సెక్షన్ 124 కింద పౌరులపై ఇష్టారీతిన కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని పునః సమీక్షించాలని కేంద్రానికి సూచించింది. ఇటీవల మణిపూర్‌లోని రెండు తెగల మధ్య ఘర్షణలు అమానవీయమైన సంఘటనలకు దారితీశాయి. దీంతో అక్కడ తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీసిన సంగతి మనకు తెలిసిందే. దేశాల్లో యుద్ధాలు, తీవ్రవాదం వలన ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది. ఇటీవల రష్యా -ఉక్రెయిన్, ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య యుద్ధాల వలన లక్షలాది మంది శరణార్థులుగా మారారు. ఈ యుద్ధ వాతావరణం ప్రజల హక్కులను తీవ్రంగా హరించింది. అంతర్జాతీయ సంస్థలకు తలొగ్గి ప్రభుత్వాలు చేసుకునే వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు సైతం ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి.

హక్కులకు అడ్డంకులు తొలగించాలి…

మానవ హక్కులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు సంబంధించిన అంశమే కాదు.. అనేవి సార్వత్రిక, సమ సమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ క్రమంలో భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణకు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. కాలం చెల్లిన చీకటి చట్టాలు,సెక్షన్ల వలన ప్రజల వాక్ స్వాతంత్య్రం.. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు తీవ్ర విఘాతం ఏర్పడుతున్నది. వీటిని సమీక్షించి రద్దు చేయాలి. భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు సంబంధించి ఎన్నో విషయాలను పొందుపరిచారు. ఇందులోని శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పని చేస్తే సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవించి హక్కులు పరిరక్షించబడతాయి. కానీ ఇవి జవాబుదారీతనంగా వ్యవహరించకపోవడంతో సమాజంలో వివక్ష, అణచివేత, అసమానత, హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ‘

రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల పేరు తో వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక రక్షణ, భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు హక్కుల పట్ల ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. నిరంకుశ పాలకులు, ప్రభుత్వాల వలన కూడా ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. కావున ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. న్యాయస్థానాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల హక్కుల సంరక్షణలో కీలక భూమిక పోషించాలి. యుద్ధాలు, ఘర్షణలు లేకుండా ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా ఐక్యరాజ్యసమితి చొరవ చూపాలి. అప్పుడే మానవ హక్కుల భంగం కలగకుండా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News