Thursday, January 23, 2025

మానవ హక్కుల బోనులో భారత్!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతగా మరోసారి ఓ అనధికార సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ప్రపంచ సంపాదనలో మూడింట రెండు వంతులకు పైగా ఉన్న జి 20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తూ ఉండడంతో అంతర్జాతీయంగా నేడు మోడీ నాయకత్వ స్థానంలో ఉన్నట్లు ఆయన మద్దతుదారులు సంబరపడుతున్నారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా భారత్ మెరుగైన స్ధితిలోనే ఉందని, ప్రపంచానికి దిక్సూచీలా భారత్ ఉంటుందని ఐఎంఎఫ్ గుర్తించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అన్నీ కీలక అంశాలపై భారత్ వైపు చూస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా మన దేశ ప్రతిష్ట పెరిగినదని ప్రధాని మోడీ తరచూ పేర్కొంటున్నారు.

విదేశాంగ విధానాన్ని స్వదేశీ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడంలో ఇప్పటి వరకు మోడీ వంటి నేత మనకు తారసపడలేదు. అయితే కీలకమైన పలు అంశాలలో భారత్ ప్రపంచ దేశాల దృష్టిలో దోషిగా నిలబడవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్యం, కీలక సంస్థల పని తీరు విషయాలలో ప్రపంచం ముందు ‘అపరాధి’గా ఉండవలసి వస్తున్నది. ప్రజాస్వామ్యానికే పుట్టినిల్లు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకునే మాటలకు ప్రపంచ దేశాలలో విలువ ఉండటం లేదు. మానవ హక్కుల విషయంలో ప్రపంచ దేశాల ముందు ‘సంజాయిషీ’ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కొద్దీ నెలల వ్యవధిలో రెండు సార్లు ఎదురవ్వడం గమనార్హం.

మొదటిగా, నవంబర్ 10న జెనీవాలో ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలిలో ‘సార్వత్రిక నియమిత కాల సమీక్ష’ (యుపిఆర్) సందర్భంగా అనేక దేశంలో మన దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆందోళనను వ్యక్తం చేశాయి.ఇక్కడ ప్రతి నాలుగున్నర ఏళ్లకు ఒకసారి ప్రతి దేశంలోని మానవ హక్కుల పరిస్థితుల గురించి అంతర్జాతీయ సమీక్ష జరుగుతుంది. నాలుగోసారి భారత దేశం గురించి జరిగిన సమీక్షలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి సంపన్న దేశాల నుండి కొరియా, స్లోవేకియా వంటి చిన్న దేశాల వరకు మన దేశంలో మానవ హక్కుల పరిస్థితులను మెరుగు పరచుకోవలసిన అవసరం ప్రస్తావిస్తూ అనేక సిఫార్సులు చేశాయి.

భారత దేశం పట్ల మానవ హక్కులకు సంబంధించి వ్యక్తమైన ఆందోళనలు, వివిధ దేశాలు చేసిన సిఫార్సులను గమనిస్తే గత మూడు సమీక్షలతో సహితం దాదాపు అటువంటి అంశాలే ప్రస్తావనకు వచ్చిన్నట్లు గమనించవచ్చు. అంటే, అంతర్జాతీయంగా ఇస్తున్న హామీల అమలు పట్ల భారత్ ఆసక్తి చూపడం లేదని భావించవలసి వస్తుంది. మరోవంక జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు గల అక్రిడేషన్ పునరుద్ధరణ గురించి వచ్చే ఏడాది మార్చిలో జరిగే సమీక్షలో సహితం మన దేశంలోని మానవ హక్కుల పరిస్థితులపై ప్రపంచ దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది. భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక పరిమితుల దృష్ట్యా పాకిస్తాన్ మాదిరిగా భారత్‌లో మానవ హక్కులు అధ్వానంగా ఉన్నాయని పరుషంగా మాట్లాడకపోయినా దాదాపు ప్రతి దేశం స్పష్టమైన పదాలతో మన దేశంలో నెలకొన్న తీవ్రమైన హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావిస్తున్నది.

భారత్‌లో ఇటీవల కాలంలో శాంతియుతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న లేదా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు, పాత్రికేయులు, రచయితలు, రాజకీయ కలాపాలు సాగించే వారిని నిరంకుశ చట్టాల కింద ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసి, దీర్ఘకాలం జైలులో ఉంచడం పట్ల మొన్న జెనీవాలో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భావప్రకటన స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడం కోసం ఉగ్రవాద కట్టడి చట్టాలను సమీక్షించాలని పలు దేశాలు సూచించాయి. ఆ చట్టాల పేరుతో మానవ హక్కుల కార్యకర్తలు, శాంతియుతంగా నిరసన తెలిపేవారిని, రచయితలు, పాత్రికేయులను అణచివేతకు గురి చేస్తున్నారని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. న్యాయపరమైన రక్షణలు ఉన్నప్పటికీ లింగ, మాత సంబంధం వివక్ష, హింస కొనసాగుతున్నదని అమెరికా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేసింది.

లక్షిత మతపర లక్షిత దాడులను కట్టడి చేయడం కోసం ఓ కొత్త చట్టం తీసుకు రావాలని స్విట్జర్లాండ్ చెప్పింది. నిర్బంధంలో ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు అందరినీ విడుదల చేయాలని పలు దేశాలు కోరగా, విదేశీ విరాళాల స్వీకరణను నియంత్రించే ఎఫ్‌సి ఆర్‌ఎ అనుమతులు ఇవ్వడం పారదర్శకంగా లేదని విమర్శించారు. పౌర సమాజ కార్యకర్తలకు సురక్షిత, సానుకూల వాతావరణం కల్పించాలని, భావప్రకటన స్వతంత్రం, మీడియా స్వతంత్రంల ఉల్లంఘనలలో పారదర్శకత పాటించాలని ఇటలీ సూచించింది. ఇక మహిళలు, అణగారిన వర్గాలు, మైనారిటీలపై పెరుగుతున్న హింసాయుత దాడులు, వివక్ష వాటిని అంశాలను దాదాపు ప్రతి దేశం ప్రస్తావించింది. చిత్రహింసలు, ఇతర క్రూరమైన, అమానుషమైన లేదా కించపరిచే ప్రవర్తన లేదా శిక్షల నిరోధానికి సంబంధించిన ఐచ్ఛిక ప్రోటోకాల్‌పై యుఎన్ కన్వెన్షన్‌ను ఆమోదించాలని భారత దేశాన్ని 29 దేశాలు కోరాయి. ఇటువంటి అనేక అంతర్జాతీయ ఒడంబడికలపై సంతకం చేసి కూడా భారత్ ఇంకా ఆమోదించడం గురించి ప్రశ్నించారు.

పౌష్టికాహార లోపం, ఆహార భద్రతలకు సంబంధించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలు దేశాలు సూచించాయి. పేదరిక నిర్మూలనకు సంబంధించిన కృషిని కొనసాగిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, బాలలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని రష్యా సూచించింది.

ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపును జిడిపిలో 2.5 శాతానికి పెంచాలని, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు హామీ ఇస్తూ చట్టం తీసుకు రావాలని స్విట్జర్లాండ్ కోరింది. ఈజిప్ట్‌తో సహా పలు దేశాలు ఆరోగ్యంపై నిధుల కేటాయింపు పెరగాలని పేర్కొన్నాయి. మహిళలు, బాలికలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు మెరుగు పరచే విధంగా చర్యలు చేపట్టాలని రష్యా, డెన్మార్క్, వియత్నాం, చైనాలతో సహా పలు దేశాలు సూచించాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల అమలును మెరుగు పరచాలని కెనడా పేర్కొన్నది. లైంగిక హింసను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయి చట్టం అవసరమని నార్వే చెప్పింది. మహిళలు, బాలలు, మైనారిటీలపై హింస, వివక్షలను ఎదుర్కొనే ప్రయత్నాలు పెరగాలని నేపాల్ తెలిపింది.

ఆస్ట్రేలియా నుండి ఐర్లాండ్, చిలీ వరకు 17 దేశాలు మరణ శిక్షను ఉపయోగించడంపై అధికారికంగా మారటోరియం విధించాలని భారత దేశాన్ని కోరాయి. మెక్సికో వంటి వారిలో చాలా మంది, మరణ శిక్షను రద్దు చేసే లక్ష్యంతో పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికకు రెండవ ఐచ్ఛిక ప్రోటోకాల్‌పై సంతకం చేయాలని భారత దేశాన్ని కోరారు. నమీబియా, బెనిన్, ఫ్రాన్స్ మహిళలకు వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షల నిర్మూలనపై యుఎన్ కన్వెన్షన్‌కు ఐచ్ఛిక ప్రోటో కాల్‌కు భారత దేశాన్ని అంగీకరించాలని పిలుపు నిచ్చాయి. దీనికి భారత దేశం ఆమోదం తెలిపినా ఇప్పటి వరకు ఐచ్ఛిక ప్రోటోకాల్‌పై సంతకం చేయలేదు. భారత్ సంతకం చేస్తే మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ వ్యక్తుల నుండి ఫిర్యాదులను స్వీకరించే అవకాశం కలుగుతుంది.

మూడు ఆఫ్రికా దేశాలు – సియెర్రా లియోన్, ఇథియోపియా, కామెరూన్‌లతో పాటు పసిఫిక్ దేశం, మార్షల్ దీవులు, కుల ఆధారిత వివక్షను అంతం చేయడం గురించి ప్రస్తావించారు. భారత ప్రతినిధి వర్గానికి నేతృత్వం వహించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనదైన రీతిలో మానవ హక్కుల కార్యకర్తల స్వేచ్ఛకు భారత్‌లో భంగం లేదని అంటూనే చట్ట పరిధిలో పని చేయాలి అంటూ చెప్పారు. విచక్షణారహితంగా జరుగుతున్న అరెస్ట్‌ల గురించి వ్యక్తమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ అటువంటి వారు కోర్టులకు వెళ్ళవచ్చు గదా అంటూ సలహా ఇచ్చారు.

ఆయన వాదనలలో సహేతుకత వ్యక్తం కాలేదు. న్యాయబద్ధత, అంతర్జాతీయ ప్రమాణాలకు హామీ ఇస్తామని ఒక్క మాట కూడా పేర్కొనక పోవడం గమనార్హం. జాతీయ భద్రత, ఉగ్రవాద ముప్పు వంటి పడిగట్టు పదాలను యధేచ్ఛగా ఉపయోగించారు. కానీ శాంతియుత నిరసనలు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలు, ప్రదర్శనలు జరుపుకొనే వెసులుబాటు గురించి ఎటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడుల కారణంగా మానవ హక్కుల పట్ల భారత ప్రభుత్వం ‘మొసలి కన్నీరు’ కారుస్తుంది గాని, ఎటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ లేదని భారత ప్రతినిధుల సమాధానాలు విన్నవారికి స్పష్టం అవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News