Monday, December 23, 2024

క్షుద్ర ఘాతుకం!

- Advertisement -
- Advertisement -

Human sacrifice in Kerala ఐశ్వర్యం మీద ఆశతో కేరళలో రెండు నరబలులిచ్చిన దారుణ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్‌లో కొద్ది మాసాల తేడాలోనే ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన అమానుష కాండకు సంబంధించి ముగ్గురిని అక్కడి పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఎర్నాకులానికి చెందిన రషీద్ అనే మొహమ్మద్ షఫీ కాగా, మిగతా ఇద్దరు ఎలంతూర్‌కు చెందిన దంపతులు భగవల్ సింగ్, లైలా. ఫేస్‌బుక్ ద్వారా ఈ దంపతులను పరిచయం చేసుకున్న షఫీ నర బలి ఇస్తే ధన రాశులు వచ్చిపడతాయని, ఉన్నట్టుండి ఐశ్వర్యవంతులైపోతారని వారికి ఆశజూపాడు. బలికి తానే మనిషిని సమకూరుస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం 50 ఏళ్ల రోస్లీని మాయ మాటలు చెప్పి గత జూన్‌లో వారి వద్దకు తీసుకొచ్చాడని, ఆమెను ఆ ముగ్గురు ఘాతుకంగా హతమార్చి బలి ఇచ్చారని పోలీసు దర్యాప్తులో బయటపడింది. ఆ బలితో తమ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనబడలేదని ఆ దంపతులు ఫిర్యాదు చేయడంతో పద్మం (52) అనే మరో మహిళను సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసి బలి ఇప్పించాడని తెలియవచ్చింది. ఈ ఇద్దరు మహిళల అంగాంగాలూ కోసుకొని తిన్నారని, సూప్ చేసుకొని ఆరగించారని వెల్లడైన కఠోర సమాచారం జుగుప్స కలిగిస్తున్నది. కనిపించకుండా పోయిన మహిళల గురించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు విషయాన్ని కనుగొన్నారు. శాస్త్ర విజ్ఞానం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ వర్ధిల్లుతున్న ఈ కాలంలో నాగరక సమాజంలోనే ఇటువంటి ఘాతుక ఘటనలు జరగడం ఆందోళనకరం. 92.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అత్యంత విద్యా చైతన్యం కలిగిన కేరళ వంటి రాష్ట్రంలో ఈ దారుణం సంభవించడం భయం గొల్పుతున్నది. ముందుకు పోతున్నామా, వెనుకకు నడుస్తున్నామా అనే అనుమానం కలుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో గత ఏడాది జనవరిలో 25, 22 ఏళ్ల కుమార్తెలు ఇద్దరిని ఉన్నత విద్యావంతులైన తలిదండ్రులే హతమార్చి వారు తిరిగి వస్తారని చెప్పి, తాము దేవుళ్లమంటూ పిచ్చిగా వ్యవహరించిన దురాగతం సంభవించింది.

చేతబడి, చిల్లంగి వంటి క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నారంటూ పల్లెల్లో అణగారిన వర్గాలకు చెందిన వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులను కబ్జా చేయడం గతంలో తరచూ జరుగుతూ వుండేవి. దుష్ట గ్రహం ఆవహించిందని రాత్రి పూట ఊరు ఖాళీ చేసి గ్రామస్థులంతా బయట నిద్ర పోయిన సందర్భాలనూ వార్తల్లో చదివాము. దెయ్యం పట్టిందని మనిషిని చితకబాదిన తర్వాత దానిని వదిలించి సీసాలో బంధించినట్టు చెప్పే భూతవైద్యుల గురించి కూడా విన్నాము. ఇప్పుడు అటువంటివి తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తుంటే క్షుద్ర శక్తులను ప్రసన్నం చేసుకునే సాకుతో నేరుగా నరబలులకే సాహసించడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. రోగగ్రస్థ మానసిక స్థితిలోనివారే ఇటువంటి అమానుషాలకు పాల్పడతారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఆయనే అన్నట్టు ఇది నాగరక సమాజానికి సవాలే. దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో క్షుద్ర విద్యల మీద పరిశోధనలు కూడా జరిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటివి చోటు చేసుకోడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదనిపిస్తుంది. దేశ పాలకులు ప్రజలను అంధకారంలోకి నడిపిస్తున్నప్పుడు, ఉన్నత విద్యా సంస్థల్లో శాస్త్రీయ పరిశోధనలను నిరుత్సాహ పరుస్తున్నప్పుడు ఇంకా ఎటువంటి ఘాతుకాలు జరుగుతాయోననే భయం కలగడం సహజం. టెస్టు ట్యూబ్ బేబీలు, ప్లాస్టిక్ సర్జరీల వంటివి పురాణాల్లోనే వున్నాయని చెబుతూ బిజెపి పాలకులు అశాస్త్రీయతను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

వారికి హేతుదృష్టి బొత్తిగా గిట్టదు. దేవతా విగ్రహాలను అవమానిస్తే ఎటువంటి ప్రమాదం జరగదని ప్రకటించినందుకు 2015లో కన్నడ మేధావి, రచయిత 77 సంవత్సరాల ఎంఎం కల్బుర్గిని తిరోగామి శక్తులు హతమార్చాయి. ఆయన చేసిన ప్రకటన హిందూ దేవతలకు వ్యతిరేకంగా వున్నందునే చంపేశామని హంతకుల్లో ఒకరైన 27 ఏళ్ల గణేశ్ మస్కిన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. హంతకులిద్దరూ హిందుత్వ సంస్థకు చెందిన వారని తెలిసింది. 2017లో ప్రఖ్యాత హేతువాది, లంకేశ్ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ను హతమార్చింది కూడా ఈ శక్తులేనని వెల్లడైంది. అలాగే మహారాష్ట్రలో మరో ప్రముఖ హేతువాది గోవింద్ పన్సారే హత్య వెనుక కూడా వీరి హస్తమే వున్నట్టు దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ మూడు ఘటనల్లోనూ ఒకే రకమైన నాటు పిస్తోలు వాడారు. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ, అంధ విద్యలు నేర్పుతున్న చోట శాస్త్రీయ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుంది? కేరళలో మాదిరిగా కేవలం అక్షరాస్యతను పరాకాష్ఠకు తీసుకెళ్లడం మీద మాత్రమే దృష్టి పెడితే చాలదు, హేతు దృక్పథాన్ని, శాస్త్రీయ అవగాహనను, మానవత్వాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడానికి గట్టి సంకల్పమే వహించవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News