Monday, December 23, 2024

‘నిర్భయ’లకు రక్షణ కల్పించలేమా?

- Advertisement -
- Advertisement -

ప్రకృతిలో స్త్రీ, పురుషులు సర్వసమాన భాగాలే అయినప్పటికీ స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరులుగా లింగ వివక్షతో అణచివేస్తూ, వారి పట్ల చులకన భావనలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణ, రేప్‌లు, భ్రూణ హత్యలు, గృహ హింసలు, బాలకార్మికులు అన్ని దేశాల్లో సర్వసాధారణ సమస్యలుగానే కనబడుతున్నాయి. ప్రపం చ వ్యాప్తంగా 35% మహిళలు తమ జీవిత కాలంలో ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులను అనుభవిస్తున్నారని, వీరిలో 40% అబలలు వేధింపుల నుండి సహాయాన్ని కోరుతున్నారని, 10% స్త్రీలు మాత్రమే న్యాయం కోసం చట్టాన్ని ఆశ్రయిస్తున్నారని తేలింది. మహిళలపై అత్యాచారాలు జరిగినపుడు జనావేశం క్షణాల్లో పొంగడం, వ్యతిరేక గళాలు మిన్నంటడం రెండు రోజుల తరువాత అన్ని మరిచి పాత కథలు పునరావృతం కావడం సర్వసాధారణం అయింది. ప్రతి రోజు ఏదో ఒక మూలన మహిళ మానభంగ మౌన రోధన గొంతు దాటడం లేదు. విని స్పందించేందుకు బదులు ఎగతాళి, ప్రతి దశలో అవమానాలు, చిన్నచూపు చూసే సమాజం మనది.
ఐరాస వివరాల ప్రకారం మానవ అక్రమ రవాణాలో 71% మహిళలు, బాలికలే ఉన్నారని అంచనా. వివాహిత మహిళల్లో 52% మాత్రమే కొంత స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక రేప్ కేసులు నమోదైన దేశాల జాబితాలో (లక్ష మందిలో) దక్షిణ ఆఫ్రికా (132.4), బోత్సవానా (92.9), స్వీడెన్ (63.5), గ్రనెడా (30.6), అమెరికాలో (27.3) లాంటి దేశాలు అగ్రభాగాన వున్నాయి. అమెరికాలో 9% రేపిస్టులపై విచారణలు జరుగగా 3% మాత్రమే శిక్షలు అనుభవిస్తూ, 97% రేపిస్టులు స్వేచ్ఛగా బయట హీరోల్లా తిరుగుతున్నారు. వాస్తవానికి మహిళలపై జరిగే అధిక అత్యాచార కేసులు బయటపడడం లేదు. సమాజ చులకన భావం ఎదుర్కోవలసి వస్తుందని, మహిళ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందనే కారణాలతో, వారికి జరిగిన అన్యాయాన్ని సహిస్తూ దుర్భర బతుకులు ఈడ్చుతున్నారు. కోవిడ్- 19 విజృంభణ తరువాత వచ్చిన సామాజిక మార్పుల కారణంగా కూడా మహిళలపై గృహ హింస, వేధింపులు కూడా పెరిగాయని తేలింది. ప్రపంచ మహిళాలోకంపై జరుగుతున్న అత్యాచారాలు, హింసాత్మక పోకడలను గమనించిన ఐరాస సభ్యదేశాలు 2000 నుంచి ప్రతి యేటా 25 నవంబర్ రోజున ‘అంతర్జాతీయ మహిళా అత్యాచార వ్యతిరేక దినం’ పాటించుట జరుగుతోంది. 25 నవంబర్ 1960న డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన ముగ్గురు బిరాబల్ సిస్టర్స్ హత్యకు నిరసనగా ఈ రోజును పాటిస్తున్నారు. మహిళా హింసకు ‘నో’ చెబుదాం అంటుంది యునెస్కో. ఐక్యతతో మహిళా హింసను అడ్డుకోవాలనే లక్ష్యంతో 25 నవంబర్ నుండి 10 డిసెంబర్ వరకు లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యక్రమాలను ఐరాస చేపడుతున్నది.
ప్రపంచ వ్యాప్తంగా మానభంగాల రేటులో 120 దేశాల్లో భారత్ 95వ స్థానంలో ఉంది. భారత్‌లో నిర్భయలు, దిశలు, హత్రాస్‌లు ఎన్ని జరిగినా, ప్రభుత్య యంత్రాంగం హడావుడీ, ప్రజల క్షణికావేశాలు ప్రదర్శించడం తప్ప ఊహించిన సమూలమార్పులు రావడం లేదు. ఇండియాలో రేప్‌ల రేటు 4.2% (ఒక లక్షలో) ఉండగా, చండీగఢ్ 20.7%, రాజస్థాన్ 15.9%, ఢిల్లీ 13.5%, కేరళ 11.1%, హర్యానా 10.9 %, అసోం 10.5 %, హిమాచల్ ప్రదేశ్ 10.0 శాతంతో ముందు ఉండగా, గుజరాత్ 1.6%, కర్నాటక 1.6%, తమిళనాడు 1.0%, నాగాలాండ్ 0.8 శాతంతో చివరన ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ 4.7%, ఆంధ్రప్రదేశ్ 4.2% రేప్ రేటు నమోదు అయ్యాయి. మన దేశం లో ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్ కేసు బయట పడడం అత్యంత అవమానకరం. 2019లో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 1,253 కేసుల సంఖ్య, జైపూర్‌లో అధిక రేప్ రేటు నమోదైనాయి. గత పది సంవత్సరాల్లో దేశంలోని 66% రేప్ కేసులు రాజస్థాన్, ఎంపి, కేరళ, యుపి, మహారాష్ట్ర, అసోం, హర్యానా, జార్ఖండ్, ఒడిసా, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగాయి. ఈ రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో రేప్ కేసులు రెట్టింపు కాగా, మిగిలిన 26 రాష్ట్రాల్లో మానభంగ కేసులు పెరగలేదని తేలింది. ఈ రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో రేప్ కేసులు నాలుగు రెట్లు పెరగడం విచారకరం. 2019లో జరిగిన రేప్ కేసుల్లో 16.2% దళిత మహిళలు, 83.8 శాతం ఇతర వర్గాల మహిళలు ఉన్నారని తెలుస్తున్నది.
‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి యేటా భారత్‌లో 7,200 మైనర్ బాలికలు (ఒక లక్షలో 1.6) రేప్‌కు గురికావడం జాతికి సిగ్గు చేటుగా గమనించాలి. మైనర్ బాలికల రేప్ కేసుల తరువాత వారిని అక్రమ మానవ రవాణా ద్వారా జీవిత కాలం వ్యభిచార నరక కూపంలోకి నెట్టబడడం కూడా జరుగుతున్నది. భారత దేశంలో నమోదైన రేప్ కేసులలో 27.8% (నలుగురు రేపిస్టుల్లో ఒక్కరు) నిందితులకు మాత్రమే ఆలస్యంగానైనా శిక్షలు పడుతున్నాయి. దేశ జనావేశం కట్టలు తెంచుకున్న ఢిల్లీ నిర్భయ కేసులోనే నిందితులకు శిక్షపడడానికి ఆరు సంవత్సరాలకు పైగా సమయం పట్టడం దురదృష్టకరం. ఈ ఆలస్యానికి కారణం పోలీస్ యంత్రాంగమని న్యాయ వ్యవస్థ వేలు చూపితే, న్యాయ వ్యవస్థ, నిందితులు, బాధితులే ఆలస్యానికి బాధ్యులని పోలీసులు అనడం సర్వసాధారణం అయింది.
న్యాయం ఆలస్యంగా అందితే న్యాయం అందనట్లే అని అందరం భావించాలి. 16 నుంచి 24 ఏండ్ల యువతులు అధిక శాతం మానభంగానికి గురి అవుతున్నట్లు తేలింది. రేప్ చేసిన మానవ మృగాల్లలో 70% బాధితురాలికి తెలిసిన వారే వున్నారని గమనించాలి. విద్యావంతులు, నాగరికత తెలిసిన పెద్దలు ఎక్కువగా ఉన్న ఢిల్లీ, చండీగఢ్ మహా నగరాల్లో మానభంగాలు ఎక్కువగా నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రేపిస్టులకు వెంటనే శిక్షలు పడేలా న్యాయ, పోలీస్ వ్యవస్థలు కాల పరిధిలో చర్యలు తీసుకోవాలి. మానభంగం తరువాత హత్య చేయడం పరిపాటి అయింది. ఇలాంటి క్రూరులకు వెంటనే ఉరి శిక్ష పడడమే ఏకైక మార్గం.
నేటి తలిదండ్రులు తమ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేయాలి. యూనివర్శిటీల డిగ్రీల కన్న మానవీయ విలువలే ప్రధానమని, చదువు కన్నా సంస్కారమే మిన్నయని గుర్తించాల్సిన సమయమిది. ప్రతి అమ్మాయి భారతమాత ముద్దు బిడ్డగా పూజించబడాలి. నేటి అమ్మాయిలు అవసరమైతే సబలలుగా మారి మృగాళ్లమదాన్ని అణచే అపరకాళిగా గర్జించాలి. స్త్రీలో ఐశ్వర్య లక్ష్మిని, చదువుల తల్లి సరస్వతిని, ధైర్య ప్రతీక దుర్గలను దర్శించే నాగరిక భారత సమాజాన్ని నిర్మించే మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములం అవుదాం. భరతమాతకు, మాతృ సమాన మహిళకు ప్రణమిల్లుదాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News