కథ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ జీవితంలోని సన్నివేశాన్ని లేదా సంఘటనలను మనోహరంగా చిత్రిస్తుంది. కథా రచయిత తన స్వానుభవాన్ని గాని, తాను చూసిన జీవితాలను గాని కథలో ప్రతిబింబిస్తాడు. యదార్ధ సంఘటనలకు కల్పనలు జోడించినా వాస్తవికత మాత్రం తప్పకుండా ఉంటుంది. కథ సందేశాత్మకమైనప్పుడు పాఠకులు ఆ కథలో తమను తాము దర్శించుకుంటారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులను అంతరిస్తున్న మానవ సంబంధాలను చక్కగా చిత్రిస్తూ సందర్భానుసారం తగిన పరిష్కారాలు సూచించే కథలు కలకాలం నిలుస్తాయి. ఈ కోవలోని కథలే కటుకోజ్వల మనోహరాచారి రాసిన సుదూర తీరాలు కథలు. మనోహరాచారి కథల కాణాచిగా పేరొందిన కరీంనగర్ నుంచి ఎదిగిన లబ్ద ప్రతిష్టుడైన కథా రచయిత. గతంలో నవ్వుతున్న నేలతల్లి కథా సంకలనంతో తెలుగు పాఠకులకు చిరపరిచితులు. నవ్వుతున్న నేల తల్లి కథా సంకలనంలో సామాజిక చిత్రణ అధికంగా కనిపిస్తుంది.
విశేషించి వలసలు, ప్రపంచీకరణ నేపథ్యంలో విధ్వంసం అవుతున్న గ్రామాలు, బొంబాయి దుబాయ్ ప్రాంతాలకు వెళ్లిన వలస జీవుల కష్టాలు మొదలైన సామాజిక జీవన పరిణామాలు మొదటి కథ సంకలనంలో చిత్రిస్తే రెండవ కథా సంకలనం వీలైనంతవరకు కుటుంబ సంబంధాలు మానవీయ బంధాలను చిత్రించింది. జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం పిల్లల పెంపకం పై మనకు తెలియకుండానే పడుతుందన్న అంశం ’కాంతి దూతలు’ కథలో రచయిత చక్కగా చిత్రించారు. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ, ’ అతి సౌకర్యం కల్పించడం కూడా తప్పేమో ’ అనే భావన, తల్లిదండ్రులు వారి వారి ఉద్యోగ జీవితాల్లో బిజీగా ఉండడం చేత పిల్లలకు నడవడిక నేర్పడంలో విఫలమవుతున్నామనే కథకుడి ఆలోచన వాస్తవ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.
నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన పిల్లలు క్రమశిక్షణతో సాంస్కృతిక విలువలతో ఒద్దికగా ఎదిగిన తీరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పెట్టి పిల్లలను అతిగారాబం చేసిన తల్లిదండ్రులకు చెంపపెట్టు లాంటి కథ ఇది. వృద్ధుల పట్ల సముచిత వైఖరి, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మొదలైన మానవీయ విలువలు ఇంటికి వచ్చిన అతిధుల పట్ల పిల్లలు ప్రవర్తించవలసిన తీరు వంటి సాంస్కృతిక విలువలు ఈ కథ అందిస్తుంది. ఎదుగుతున్న పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా తప్పక చదవవలసిన కథ.
పసి మనసులు కథ కూడా దాదాపు ఇటువంటి ఇతివృత్తాన్నే కలిగి ఉంటుంది. కార్పొరేట్ పాఠశాలలో ఖరీదైన చదువులు చదివించి సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసిన దంపతులు చివరికి మానసికమైన ప్రశాంతత లేకుండా అనాధాశ్రమాలకు పరిమితం కావడం, తల్లి అంత్యక్రియలు జరపడంలో కృత్రిమంగా తతంగాన్ని ముగించడం, భార్య కడచూపును కూడా వృద్ధాశ్రమంలో ఉన్న భర్త రామచంద్రరావు నోచుకోకపోవడం పాఠకుల మనసులను కలచివేస్తుంది. సైకాలజిస్టు మోహనరావు దంపతులు తన తండ్రికి చేస్తున్న సేవలు కథకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మోహన్ రావు పిల్లలు తల్లిదండ్రులతో తాతయ్యతో వ్యవహరిస్తున్న తీరు అబ్బురపరుస్తుంది.
ఈ కథ ద్వారా రచయిత విద్యా విధానంలో రావలసిన మార్పులను చర్చించారు. టెక్నో చదువుల పేరిట పిల్లల మానసిక ఒత్తిడిని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాల దశలో పిల్లలు తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞలోనే పెరగాలని, తల్లిదండ్రులకు అందుబాటులోనే చదువుకోవాలని, మనోవికారాలు అభివృద్ధి చెందుతున్న పసిదశలో అమ్మానాన్న అక్క తమ్ముడు తాతయ్య నానమ్మ వంటి అనుబంధాలకు దూరంగా ఉంచితే భవిష్యత్తులో వాళ్లకు అనుబంధాల మీద పెద్దగా పట్టింపు ఉండదని, యాంత్రికంగా పెరిగిన పిల్లలు ప్రతిస్పందనలు లేని యంత్రాలుగా తయారవుతున్నారని, పసి వయసులో మనం పిల్లలను దూరంగా పెడితే భవిష్యత్తులో వాళ్లు మనల్ని దూరంగా పెట్టడానికి వెనుకాడరన్న సత్యాన్ని కథ రచయిత ఆర్ద్రంగా చెప్పారు. ఉపాధ్యాయ రంగంలో ఉన్న మనోహరాచారి విశేషించి పాఠ్య పుస్తక రచయిత కూడా.
పిల్లల మనస్తత్వాన్ని తెలిసినవాడు కనుక ఇంతటి గొప్ప కథ రాయగలిగాడు అనిపించింది. పల్లెల్లో వస్తున్న మార్పులను వాస్తవిక దృష్టితో చిత్రించిన కథ పల్లెతనం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న దంపతులు తమ పిల్లలకు పల్లె వాతావరణన్ని దర్శింపజేయాలన్న లక్ష్యంతో ఎన్నో ఊహలతో పల్లెను చేరగా చేలు,చెరువు కట్టలు మామిడి తోటలు ఈతకొలను చేపల వేటలు ఎడ్ల బండ్లు కనుమరుగవుతున్న తీరును చూసి తీవ్ర నిరాశకు లోనైన వైనం ఈ కథలో కనిపిస్తుంది. పల్లెల్లో ఉండే ఆప్యాయతలు అనుబంధాలు కూడా తగ్గిపోతున్న వైనాన్ని కథకుడు గమనిస్తాడు. పొలాలన్నీ ప్లాట్లుగా మారిపోతున్న దురాక్రమణ సంస్కృతి, ధనార్జన ధ్యేయంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం వంటి విలువల పతనం పల్లెకు పాకడంతో కథకుడు ఆవేదనకు గురవుతాడు. ఊరి చుట్టూ ఉండాల్సిన గుట్టలన్నీ మాయమైపోయాయి. గుట్టలకు ఉండవలసిన రాళ్లను క్రషర్ మిషన్లు కరిగించి వేశాయి. మట్టిని ప్రోక్లైన్లు తోడి పోశాయి.
నానాటికి పల్లె ధ్వంసం అవుతున్నది. దీనికి కారణాలు అన్వేషించిన కథకుడికి చదువుకున్నవాళ్లంతా ఉరిడిసిపోతే ఊరు ఎట్లా బాగుపడుతుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. ‘ విద్యావంతులు మేధావులు చదువు ఉద్యోగాల పేరుతో బయటకు వెళ్ళిపోతే గ్రామాల్లో మునగ చెట్లే మహావృక్షాలుగా పాతుకు పోతాయి. ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నించే వాళ్ళు పరిష్కరించే వాళ్ళు రావాలి కదా‘ ( పుట 43 ) అనే కథకుడి మాటలు నేడు పల్లెల నుండి ఎదిగి పల్లె పాడవుతుంది అని ఆవేదన చెందే విద్యావంతులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేసే మరొక కథ ఆత్మీయులు. టీనేజీలో పిల్లల మనస్తత్వం, అర్థం చేసుకోవలసిన తల్లిదండ్రులు అదుపు ఆజ్ఞల పేరుతో నియంత్రించడం కొన్నిసార్లు విపరీత పరిణామాలకు దారితీస్తుంది అని ఈ కథ తెలియపరుస్తుంది. ఎదుగుతున్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి.
ఆ ప్రేమ కరువైనప్పుడే ఇతరుల పట్ల ఆకర్షితులు కావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఇలా కాకుండా పిల్లల ఆరోగ్యం కోసం భద్రత కోసం తల్లిదండ్రులు చేసే నియంత్రణ పిల్లలు ప్రేమ రహిత్యంగా భావించే ప్రమాదం ఉంది బయట వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమ కానుకగా భావిస్తే నిండు జీవితం బండ పాలవుతుంది ( పుట 52) అనిఆత్మీయులు కథ తెలుపుతున్నది. ఈ సంపుటిలో వైవిద్య భరితమైన కథ కావ్య కన్యక. దీనిని చారిత్రక కథ అనవచ్చు. అష్టదిగ్గజ కవీంద్రులలో ఒకరైన నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధ రచనకు హేతువైన సన్నివేశాన్ని మనోహరాచారి కళాత్మకంగా ఈ కథలో చిత్రించారు. అరణపు కవి అయిన నంది తిమ్మన తిరుమల దేవి దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు సత్యభామల అలక సన్నివేశాన్ని ఇతివృత్తంగా పారిజాతాపహరణం గ్రంథం రాయడం ఈ కథలో ఇతివృత్తం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని ఈ కథలో చిత్రించారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన పిల్లలను దండించడమే కానీ వారి వెనుక ఉండే దయనీయమైన కారణాలు తెలుసుకోలేని ఓ ఉపాధ్యాయుడి పశ్చాత్తాపమే బడిబాట కథ.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు పిల్లల నేపథ్యాన్ని తెలుసుకున్నప్పుడే వారి పట్ల ఒక సానుకూల వైఖరిని అలవర్చుకోవడానికి వీలవుతుందని ఈ కథ నిరూపిస్తున్నది. తండ్రి లేని ఆ నిరుపేద కుటుంబంలో పిచ్చిది అయిన తల్లి, పసికూనలు అయిన చెల్లెళ్లు ఇంటి బాధ్యత తనపై వేసుకున్న తొమ్మిదవ తరగతి అమ్మాయి రాజేశ్వరి దీన గాధ ఇది.’ చదువు చెప్పడంతో పాటు సమాజంలో వాళ్లు బతికీడుస్తున్న విధానాలని చదవాలని, చదువుతోపాటు ప్రభుత్వ పరంగా వాళ్లకు అందాల్సిన పథకాల గురించి చెప్పాలని ( పుట 66) కథకుడు భావించడం సమంజసమైన ఆలోచన. మానవ బంధాలను హృద్యంగా ఆవిష్కరించిన మరొక కథ పరిత్యాగి. కొడుకుకు ఉద్యోగం లేదని, ఎదిగిన కూతురుకు వివాహం చేయడం ఎలాగో తెలియక తనకు వచ్చిన జబ్బును లక్షల డబ్బుతో చికిత్స చేయించుకోలేక తాను చనిపోతే తన కొడుకుకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో మరణించిన త్యాగమూర్తి రామ్మోహన్ కథ ఇది. తనకు చికిత్స చేసిన డాక్టరే అతని త్యాగగుణానికి అబ్బురపడి తన కుమార్తెను వివాహం చేసుకోవడం కథలో మరో మలుపు. కథ ఆసక్తిగా చదివించగలిగింది. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలను కళ్లకు కట్టింది.
సొంత ఇల్లు లేని నిజాయితీపరుడైన ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే గుమస్తా ఆకస్మికంగా గుండెపోటుతో మరణిస్తే తాను నివసించే అద్దె ఇంటికి శవాన్ని తీసుకురానివ్వకపోవడం అనే దయనీయ స్థితిని చిత్రించిన కథ చేయూత. ఇంటి ఓనర్ తిరస్కరించాడు అంటే అది పరాయి వాడు కావడం అనుకోవచ్చు. కానీ ఊర్లో ఉన్న చిన్నాన్న, మేనత్తలు కూడా శవాన్ని తీసుకురావద్దు అనడం అడుగంటుతున్న మానవీయ విలువలకు పరాకాష్ట. నేటి రక్త సంబంధాలు సైతం ఆర్థిక సంబంధాలుగా మారుతున్న వైనానికి ప్రతీక. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ వసతి గృహంలో అంత్యక్రియలు నిర్వహించడానికి గణేష్ అనే ఒక సామాజిక సేవకుడు ముందుకు రావడం కాస్తంత ఊరట కలిగిస్తుంది. ఈ కథ మంట కలుస్తున్న మానవత్వాన్ని హృద్యంగా ఆవిష్కరించింది. ప్రేమ ఆకర్షణల మధ్య వ్యత్యాసాన్ని తెలియజెప్పిన కథ ప్రేమ పాశం.
ఇట్లా సుదూర తీరాలు కథలన్నీ మానవ సంబంధాలను చిత్రించడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తాయి. ఒక అంశాన్ని ముక్కు సూటిగా చెప్పవలసి వచ్చినప్పుడు మనోహరా చారి ఉత్తమ పురుష కథనాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సంపుటిలోని పదునాలుగు కథల్లో ఐదు కథలు ఉత్తమ పురుష కథనంలో ఉండడం గమనార్హం. మనోహరాచారి కథను చెప్పడంలో తనదైన శైలిని కలిగి ఉన్నారు. ఒక విషయం పట్ల మంచి చెడులను చర్చించవలసి వచ్చినప్పుడు ఆ విషయంలో చెడు ఫలితాలను పొందిన పాత్రలను సత్ఫలితాలను పొందిన పాత్రలను సమన్వయంతో కథకు అనుగుణంగా నడిపించి తులనాత్మకంగా పాఠకుడు సందేశాన్ని గ్రహించే విధంగా కథను ముగిస్తారు. శాస్త్ర సాంకేతికత పెరిగి ఆధునికత కారణంగా ఉరుకులు పరుగుల జీవితంలో గడుపుతున్న మనుషులకు మానవ సంబంధాలను గుర్తుచేసే కథలివి. తప్పకుండా చదివి తీరవలసిన కథలు.
సాగర్ల సత్తయ్య
7989117415