Sunday, December 22, 2024

‘జ్ఞానాన్ని’ మత రహిత స్థాయికి తేవాలి!

- Advertisement -
- Advertisement -

మతం చుట్టూ తిరిగేదే ‘జ్ఞానం’ అనే ఆలోచన సమాజంలో బాగా నాటుకుపోయింది. ఏ దేశమైనా, ఏ మతమైనా ఇదే భావనని జనంలో స్థిరపరిచాయి. కాని, కాలం గడుస్తున్న కొద్దీ జ్ఞానానికీ, మతానికీ దూరం పెరుగుతూ వచ్చింది. జ్ఞానం ఏ మతం చుట్టూ ప్రదక్షిణలు చేయదని సర్వస్వతంత్రంగా ఎదుగుతుందని, తనను నమ్ముకొన్న జనం ఎదుగుదలకు తప్పక తోడ్పడుతుందని తేలింది. మనిషి, మనిషిగా మారడానికి మారి, నిలబడడానికీ నిలబడి ఎదగడానికీ జ్ఞానం.. అంటే విజ్ఞానం నిరంతరం కృషి చేస్తూనే వుంటుంది. అతణ్ణి ఈర్షాద్వేషాల నుంచి, అసూయ ప్రతీకారాల నుంచి, మూఢ నమ్మకాల నుంచి బయట పడేసి, నైతిక జీవిగా కొనసాగడానికి దోహదం చేస్తుంది. మా‘నవ’వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే వున్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి! ప్రాపంచిక దృక్పథంతో, విశాల భావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం అందించిన “జ్ఞానాన్ని” స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు. విజ్ఞాన శాస్త్రాన్ని తన సృజనాత్మకతతో సాంకేతిక శాస్త్రంగా తీర్చిదిద్దుకోగల సామర్థం కేవలం మనిషికే వుంది.

ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. మనిషిలోని స్వార్థం వెర్రి తలలు వేస్తే సాంకేతిక పరిజ్ఞానం మానవ వినాశనానికి దారి తీస్తుంది. ఆ విషయం కూడా గుర్తుంచుకోవడం మంచిది. ‘విజ్ఞానాన్ని మత రహిత స్థాయికి ఎందుకు తీసుకుపోవాలి? మతం వుంటే నష్టమేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు మనం ఈ విధానంగా సమాధానం ఇవ్వాల్సి వుంటుంది అబద్ధాలతో నిజాలు జత కట్టవు. వాస్తవాలు ఊహల్లో తేలిపోవు. ఊహల్లో తేలిపోతే తేలిపోవచ్చు కాని, అవి అప్పుడు వాస్తవాలుగా మిగలవు.మత గ్రంథాలలో వున్న స్వర్గ నరకాలకు అడ్రసులు లేవు. భూమి అడుగున వున్న పాతాళలోకానికి వెళ్ళే సొరంగ మార్గం ఎవరికీ తెలియదు. లోకాలన్నింటినీ మోసే ఆదిశేషు పరిమాణం ఎంతో తెలియదు. దాని మీద పవళించే విష్ణుమూర్తి అతాపతా తెలియదు. శిలు వెక్కిన ప్రభువు మొబైల్ నెంబరేమిటో తెలియదు. పరలోకం ఏ గుగూల్ మ్యాప్‌లోనూ దొరకదు. ఆకారమే లేని అల్లా కనీసం తన ఇ మెయిల్ ఐడి అయినా… ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదే శతాబ్దాలుగా భక్తులెవరూ తమ దేవీ దేవతల మొబైల్ నెంబర్స్ సంపాదించలేకపోయారు. గ్రహాలన్నీ దేవతలకు నివాసాలని అంటారు కదా? మరి, రాకెట్లలో గ్రహాంతర యానం చేసే మన ‘మానవ మాత్రులకు’ వారు ఎక్కడా కనపడరెందుకూ? అయినా, గతంలో విశ్వసించినట్టు గ్రహాలు దేవతల నిలయాలని ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు.

ఇక్కడ భూమి మీద సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్లనే కొద్ది మంది పరిపాలకులు కోట్ల మంది జనాన్ని అదుపులో పెట్ట గలుగుతున్నారు. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం దేవీ దేవతల మీద పని చేయడం లేదు. ఎందుకంటారా? వారు నిజంగా వుంటే పని చేసేది లేక వాళ్ళ మీద ఎలా పని చేస్తుంది చెప్పండి?అయితే, అందుకు కారణం కూడా వుంది. భ్రమ భ్రమలతో కలుస్తుంది. వాస్తవాలు వాస్తవాలతో మాత్రమే అతుకుతాయి. నిన్న రాత్రి నిద్రలో కన్న కలలు ఇవ్వాళ రాత్రి కూడా కను ప్రమాదం లేదు. కాని, పొద్దున వాస్తవంలో మోటారు సైకిల్‌పై వెళుతూ రాత్రి కన్న కలలు కంటానంటే ఏక్సిడెంట్ అవుతుంది. నువ్వు బతికి వుంటావో లేదో కూడా తెలియదు. ఒక వాస్తవాన్ని భ్రమలతో కలుపుతానంటే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి. వాస్తవాల ఆధారంగా బతికే వాడికే, తనకు జ్ఞానం వుందన్న స్పృహ వున్నవాడికే విజ్ఞానం అందుబాటులో కొస్తుంది. మతాల మాయలో పడితే తెలివి తేటలు కాదు గదా మూర్ఖత్వం అబ్బుతుంది! అప్పుడు అందుకు తగిన వేషం ఒకటి వేసుకొని ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు.

సిగ్గూ ఎగ్గూ, నైతికత అన్ని వదిలేసిన వాడు ఇక ఏం చేస్తాడూ? తోడి మనుషుల్ని మోసం చేస్తాడు. అన్ని మతాల గురువులు, ప్రబోధకులు, ముల్లాలు, ఫాస్టర్లు, పురోహితులు, ప్రవచన కారులు చేస్తున్న పని ఇదే!పాకే జంతువు నుంచి పక్షి రావడం, వానరం నుంచి మనిషి రావడం అనేది వీరు తెలుసుకోరు. తెలుసుకున్నా అర్థం చేసుకోరు. ఆత్మ, జన్మ, పునర్జన్మల గూర్చిన పరిజ్ఞానమే ‘జ్ఞానం’ అని అనుకొంటూ వుంటారు. మనిషి గుండెలో అంగుష్ఠ దేహం వుంటుందనీ, మరణించినప్పుడు అది బ్రహ్మ రంధ్రం గుండా బయటికి పోతుందని నమ్మే వీరు, మనిషి కర్మానుసారం అతని చావు పట్టుక లుంటాయని విశ్వసిస్తారు. అంతేకాదు, గత జన్మలో వారు చేసిన మంచీ చెడ్డల పర్యవసానంగానే వారి తల్లీదండ్రుల నిర్థారణ జరుగుతుందని విశ్వసిస్తారు. ఆధునిక జన్యుశాస్త్రం చెప్పే వంశపాపంపర్య లక్షణాలు వీరికి విచిత్రంగా తోస్తాయి. ఒక రకంగా అలాంటి విషయాలు నమ్మాలంటేనే వీరికి ఇబ్బందిగా వుంటుంది. విస్కీ తాగడం అలవాటైన వాడికి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెపితే వింటాడా? ఇలాంటి వారి వితండ వాదనలు చిత్ర విచిత్రాలుగా వుంటాయి. గతంలో బ్రాహ్మణార్యులు జనాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు వర్ణాలుగా విభజించారు.

మానవ జాతి అంతా ఒకటే అయినప్పుడు ఈ విభజనలు ఎందుకూ? అని మనమంటాం. అందుకు “మనుషుల్లో రక్తం గ్రూపులు నాలుగు లేవా? అవి ఒక దానితో ఒకటి కలుస్తాయా?” అని ఎదురు ప్రశ్న వేస్తారు. నిజమే! ఆ అతి తెలివి ప్రశ్నకు సంతోషించాలో లేక ఏడవాలో అర్థం కాదు. ఇది ఒక తప్పు ప్రశ్న. ఎందుకంటే, రక్తం నాలుగు గ్రూపులు మనువాదులు విభజించిన ఆ నాలుగు వర్ణాల వారిలో కూడా వున్నాయి. అత్యవసర పరిస్థితిలో శూద్రుడి రక్తం బ్రాహ్మణుడికి ఇవ్వొచ్చు. క్షత్రియుడి రక్తం వైశ్యుడికీ ఇవ్వొచ్చు. ఎవరి రక్తం ఎవరికైనా ఇవ్వొచ్చు. కేవలం ఆ రక్తం గ్రూపు కలవాలి అంతే! అంటే ఏమిటీ? మనుషుల రక్తమంతా ఒక్కటే అని కదా? కుల మతాలకు, లింగ భేదాలకు అతీతంగా రక్తం ఒకరిది ఒకరికి ఇవ్వడం జరుగుతున్నప్పుడు మనుషుల్లో భేదం ఎక్కడుందీ? రక్త మార్పిడి ఖండాంతరంగా జరపొచ్చు. ఖండాంతర వివాహాలు చూస్తూనే వున్నాం. ఆ రకంగా జనులందరినీ విశ్వ జనులుగానే పరిగణించాలి.ఇటీవలి వంద, రెండు వందల సంవత్సరాల చరిత్ర చూసుకొని మాది గొప్ప వంశం మా కులం గొప్పది మా మతం గొప్పది అని విర్ర వీగడం హాస్యాస్పదమైన విషయం. ఇంకా వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎక్కడ వుండేవారో, ఎలా వుండేవారో, ఎటు నుంచి ఎటు వలస వెళ్ళారో, వారి మత విశ్వాసాలేవో, ఎవరు ఎవరిని పెండ్లి చేసుకున్నారో ఎవరికి తెలుసు? అందువల్ల ఏదో రెండు, మూడు తరాల వంశ చరిత్ర చూసుకొని విర్ర వీగడం మూర్ఖత్వం అవుతుంది.

ఇంకా కొంచెం వెనక్కి వెళితే, అందరమూ ఆ మహా మిశ్రమ మానవ జాతి నుంచి వచ్చిన వాళ్లమేనని తెలుసుకుంటాం! మానవ వాదులుగా మారడానికి తెలుసుకోవాల్సిన మొదటి అంశం జ్ఞాన గుళిక ఇదే! ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకు చెప్పుకొంటున్నామంటే, తాము విశ్వ జనులమని భావించుకునే కొందరైనా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారేమోనని..! మనుషులు ఇలా విభజింపబడి వుండాల్సిందేనని గట్టిగా విశ్వసించే వారిని, అంధ విశ్వాసాల్లోనే వెలుగులున్నాయని భ్రమించే వారిని మనం ఉన్నఫళంగా ఏమీ చేయలేం. ఆలోచించుకోవడానికి వారికి కొంత సమయం ఇవ్వాల్సి వుంటుంది.శుభ్రత కావాలనుకొనే వారికి శుభ్రతను ఇవ్వగలం. బురదలో దొర్లే వారిని ఏం చేయగలం? ఆ కంపు ఆ బురద సౌఖ్యంగా వుందనుకొనే వారికి ఏమని చెప్పగలం? మార్పు అంతర్గతంగా వారిలోంచే రావాలి. వారు తమ వివేకాన్ని కొద్ది కొద్దిగా ఉపయోగిస్తూ వుంటే, తప్పకుండా మార్పు వస్తుంది. దేని వల్ల ఈ సమాజం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందో ముందు గ్రహించుకోవాలి. దేవుడు, దయ్యం, ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత, ధాన్యాల వల్ల రాలేదు.

కేవలం వైజ్ఞానిక స్పృహతోనే, వైజ్ఞానిక పరిశోధనలతోనే వచ్చింది. ఇవే మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయి. మనిషి తను కష్టపడే తత్వాన్ని, నిజాయితీని, నైతికతను వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదాలు చాలా వున్నాయి. వదిలేయకుండా వుండగలగడమే జ్ఞానం! పొరపాటున జనం పెత్తందారీ వ్యవస్థకు లొంగిపోతే గనక, తీరని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మరొక పెద్ద ప్రమాదం పొంచి వుంది పెత్తందారీ సంస్కృతి గనక సాంకేతిక శాస్త్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే, అది మావన స్వేచ్ఛనే హరిస్తుంది.అంతేకాదు, మానవ జాతిని తుదముట్టించే ప్రమాదం కూడా వుంది. పరిస్థితులు అంతగా విషమిస్తే వాటిని అదుపులోకి తేవడానికి అసలు మనిషే వుండదు కదా! విజ్ఞాన శాస్త్రం రెండంచుల కత్తి లాంటిది. ఎటు వాడుతున్నాం? ఎంత వాడుతున్నాం? ఎలా వాడుతున్నాం? వంటివి తెలియాలి. విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం. దీని మీద మత ఆధిపత్యం వుండకూడదు. ఎందుకంటే, గతంలో ముక్కు మూసుకొని చేసిన తపస్సుల వల్ల ఎవరూ ఏమీ సాధించలేదు. ఇక ముందు కూడా సాధించలేరు. సాధించారని చెప్పుకొనే మహిమలు కేవలం అసత్యాలు మాత్రమే! ఆ పద్ధతులు మానేసి మనిషి తనలోని స్వార్థాన్ని,

కుత్సిత బుద్ధిని తగ్గించుకుంటే సత్వరం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ధి గల యువతీ, యువకులు హేతువాదులైతే, నిరీశ్వర వాదులైతే, సైన్సు కార్యకర్తలయితే వారు రాజకీయంగా ఎదిగి అధికారం చేపట్ట గలిగితే ఈ ప్రపంచం రూపురేఖలు మారతాయి. అప్పుడే మానవత్వం వెల్లివిరుస్తుంది. మతాల పరిధిలో ‘జ్ఞానాన్ని’ గిరికీలు కొట్టిస్తున్న కుట్రను బద్దలుకొట్టి పైకి ఎదిగితేనే ఎవరికైనా “జ్ఞానం అంటే ఏమిటి?” అనే జ్ఞానోదయం అవుతుంది.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News