Sunday, January 19, 2025

మంచిని పెంచే వర్తమాన కథలు

- Advertisement -
- Advertisement -

హుమాయూన్ సంఘీర్ యువ కథకుడు. సామాజిక నేపథ్య కథాంశాలతో ఆకట్టుకొనే రచనలు చేస్తున్నాడు. మన మధ్య ఉన్న వివిధ రకాల అంతరాలను ఎత్తి చూపుతూ కలిసి ఉంటే కలదు సుఖమని తన కథల ద్వారా సూచిస్తున్నాడు. గ్రామీణ తెలంగాణలోని మనుషులను, వారి మనస్వత్వాలను క్షుణ్ణంగా పరిశీలించిన సంఘీర్ సృష్టించిన కథల్లో స్థానికత, వాస్తవికత సహజంగా అల్లుకుపోతాయి. మధ్యతరగతిలోని జీవన ఘర్షణలను కొత్త కోణంలో అవి ఆవిష్కరిస్తాయి. స్థానిక యాసపై మంచి పట్టు ఉన్న ఈ రచయిత పల్లె పదాలతో కథలను మనసుకు మరింత చేరువ చేస్తాడు. కథల శీర్షికల విషయంలో, కథల్లోని పాత్రల పేర్ల విషయంలోనూ మట్టితనం ఉట్టి పడుతుంది. సంఘీర్ రాసిన 15 కథలతో మట్టి ప్రచురణలు ’కామునికంత’ అనే సంపుటిని తెచ్చింది. నల్గొండ జిల్లా ఆలగడప కేంద్రంగా మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు ఈ ప్రచురణల ద్వారా చేస్తున్న సాహితీ సేవ గురించి ఒక మాట చెప్పుకోవలసిందే. గ్రామీణ పేదలకు తోడుగా నిలుస్తూ బిజీగా ఉండే వేనేపల్లి గత ఇరువై ఐదు ఏళ్లుగా ప్రజా సాహిత్యాన్ని ముద్రిస్తున్నారు. ఇప్పటికి నలబై పుస్తకాలు మట్టి ముద్రణలు ప్రచురించింది. ఇందులో కొత్త రచయితలకు అందిస్తున్న తోడ్పాటే ఎక్కువ.

ఈ సంపుటిలో హుమాయూన్ సంఘీర్ తన ముప్పై ఏండ్ల జీవితంలో తాను భాగమై అనుభవించిన జీవితాన్ని, పొందిన భావోద్వేగాలను చిత్రించిన కథలు ఉన్నాయి. ఈ సమాజంలో వ్యక్తులు, సమూహాలు పడే బాధలకు, కష్టాలకు మూలమేమిటి, బయటపడే దారేమిటి అనే ఆలోచనల్లోంచి వచ్చిన అక్షరధారలివి. కోట్లాది మంది సగటు యువకుల్లాగే బతుకు పెనుగులాట కలవరింతలు, ఆ పరంపరలో తాను ఎంచుకొనే పరిష్కారాల వెతుకులాటలు, నిత్యం నిరంతరం ఎడతెగని లొల్లిలో హుమాయూన్ సంఘీర్ సతమతమవుతూ రాసిన కథలివి.’కామునికంత’ నిరంతరం భూమి కోసం పరితపించే మనిషి కథ. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన రైతు ఉద్యమ ప్రస్తావన ఇందులో ఉంది. ఎదురొస్తున్న ఉద్యమ రైతులపై తన కారును పోనిమ్మని డ్రైవర్ ను ఉసిగొల్పిన వాస్తవ సంఘటన ఈ కథలో భాగమైంది. తండ్రి చివరి ఆకాంక్షల మేరకు కోల్పోయిన భూమిని కొడుకు కొని సాగు కొనసాగిస్తాడు. ’రంగు’ కథ శంషాబాద్ లో నలుగురు యువకులు దిశ అనే అమ్మాయిని కిరాతకంగా చెరిచి చంపిన ఘటన గురించి రాసింది. నేరం మీద కులం, మతం రంగు అద్దడంపై చర్చ, నిందితుల్లో ఒకరు ముస్లిం యువకుడు ఉండడంతో బాధ్యత గల ప్రజాప్రతినిధి మతోన్మాదిగా మాట్లడడం కథలో కనబడుతుంది.

వ్యవసాయంతో సతమతమయ్యే గ్రామీణ జీవితాలతో ముడిపడి ఉన్న కథలు శ్రేయోభిలాషి, పచ్చ శీర, పచ్చటి సంబురం. గ్రామాల్లోని చేతివృత్తుల వారి దయనీయ బతుకు గురించిన కథ చిమ్ని. శవాన్ని కప్పెట్టే బొందలు తవ్వే జీవితాలపై వచ్చిన కథ ఇది. తన భార్య వైద్యం ఖర్చుల కోసం ఒకరి చావుకై వేచి చూసే దౌర్బాగ్యము ఈ కథలో చూడవచ్చు. ప్రతి కథలోనూ సామాన్యుల జీవితాల చిత్రణ, వారి సమస్యల చర్చ, చివరకు సుఖదుఃఖాలు కలగలిసిన ముగింపు కనబడతాయి. నాలుగు కథలు మహిళల సమస్యలపై రాసినవి. ’తోడు బతుకమ్మ’ తాగుబోతు భర్త ఆగడాలు, అనారోగ్యం భరించలేక చనిపోయిన అక్క పిల్లల కోసం బావను కట్టుకొన్న సావిత్రి కథ ఇది. సావిత్రి పాత్రను రచయిత ఎంతో ఉద్విగ్నంగా చిత్రించాడు. ’పవిత్రం’లో పోర్న్ సీట్లకు అలవాటు పడిన తండ్రిని భరించలేక మేనమామకు పెళ్లి చేసుకొని పోతుంది సైవలి. ’పంచుకొనే మనసుంటే..’ ఇద్దరు మిత్రురాళ్ల అపార్థాల కథ. ఒకరు ప్రేమిస్తున్న యువకుడు చెడ్డవాడని నిరూపించడానికి అదే యువకుడితో ప్రేమగా నటించి అపార్థాలు పాలవుతుంది. ’బక్క’ ఓ మనసున్న అనాకారి కథ. ఎంతో బుద్ధిమంతురాలైన ఆమెను వదిలించుకున్న భర్త కరోనా బారిన పడి హాస్పిటల్లో బక్క కంటపడి తిరిగి ఆమె సేవల ద్వారా బతికి బయటపడి బక్కను అర్థం చేసుకొనే క్రమంలో కథ సుఖాంతం అవుతుంది.

మతం నేపథ్యంలో రాసిన కథలు రెండు. హరమ్ కథ సామాజిక సంస్కరణవాదాన్ని సూచిస్తుంది. ముస్లిం కుటుంబంలో తల్లి, కొడుకు, కోడలు మధ్యన జరిగిన సంఘర్షణ ఇది. వ్యవసాయ కూలీగా పనిచేసి కుటుంబాన్ని ఒంటి చేత్తో సాకిన తల్లికి తెల్ల కల్లు తాగడం ఓ అలవాటు. ముస్లిం ఆచారాల ప్రకారం కల్లు తాగడం నిషేధం. మతాచారం కన్నా తల్లి అలవాటును తృప్తి పరచడం తన కర్తవ్యంగా భావించిన కొడుకు రోజు తల్లికి కల్లు తెచ్చి ఇస్తుంటాడు. ఆయన భార్య ఆ పనిని వ్యతిరేకిస్తుంది. అయినా తల్లి కోరికే ప్రధానంగా కొడుకు హరమ్ కు సిద్ధపడతాడు. ’పరువు’ భిన్న మతాల పిల్లలు పెళ్లి కథ. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొనే హిందూ అబ్బాయి ’ఆమె పేరు మార్చుడు, మతం మార్చుడు ఉండేది. నమాజ్ సదువుకున్న, బురఖా ఏసుకున్న తనిష్టమే, పిల్లల ప్లానింగ్ కూడా చేసుకుంటా’ అనడం పరువు కథలోని సుగంధం. ’మూడు తరాలు’ నేటి భూమి ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబాల మధ్య వచ్చే గొడవలు, సంబంధాల విచ్చిన్నత తెలిపేది. ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఈ కథలపై దారులు అనే చక్కని విశ్లేషణాత్మక ముందుమాటను అందించారు. 2024కి ఇచ్చే శ్రీమతి కొలకలూరి భగీరథీ కథానికా పురస్కారంలో తొలి స్థానం ’కామునికంత’కు లభించింది. రచయితకు అభినందనలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News