1000 మంది రైతులతో నామినేషన్లు
కోయంబత్తూర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడులోని తిరుపూర్ జిల్లా కంగేయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వందలాది మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పరంబికుళం-అలియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలన్న తమ డిమాండును ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలలో వందలాదిగా పోటీచేసి తమ నిరసన తెలియచేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈరోడ్ జిల్లాలోని మొదకురిచి నియోజకవర్గంలో 25 ఏళ్ల క్రితం ఇదే తరహా పరిస్థితిని సృష్టించిన రైతులను ఆదర్శంగా తీసుకుని తిరుపూర్ జిల్లా రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెల్లకోయిల్ బ్రాంచ్ కెనాల్ నీటి పరిరక్షణ కమిటీకి చెందిన రైతులు గత జనవరిలోఅలియార్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోసం ఐదురోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం తమ దీక్షలను వారు విరమించారు. అయితే ఇప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో కంగేయం నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఇప్పటికే తమ కమిటీ సభ్యులలో ఒకరు నామినేషన్ దాఖలు చేశారని కమిటీ వర్గాలు తెలిపాయి. కమిటీకి ఇప్పటివరకు 100 నామినేషన్లు వరకు అందాయని, గురు, శుక్రవారాలలో వెయ్యిమందికి పైగా రైతులు తమ నామినేషన్లు దాఖలు చేస్తారని వర్గాలు తెలిపాయి. 1996లో కూడా ఇటువంటి పరిస్థితే మొదకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్పన్నమైంది. మొత్తం 1033 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల నిర్వహణ చేతకాక నెలరోజుల పాటు ఎన్నికలను ఎన్నికల కమిషన్ అప్పట్లో వాయిదా వేసింది.