Thursday, November 21, 2024

టాక్సిక్ సినిమా సెట్స్ కోసం అటవీ భూమిలో చెట్ల నరికివేత

- Advertisement -
- Advertisement -

కెజిఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌కు సంబంధించిన సెట్స్ వేయడానికి అటవీ భూమిలోని చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎంటికి చెందిన భూమిలోకి మంత్రి ఈశ్వర్ ఖండే అక్రమంగా ప్రవేశించారంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం ఆరోపించడంతో సినిమా షూటింగ్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. బుధవారం నాడిక్కడ కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ హెచ్‌ఎంటికి చెందిన భూమిలోకి మంత్రి ఖండ్రే అక్రమంగా ప్రవేశించారని, ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుపై ఇదివరకే తాము కోర్టులో కేసు వేశామని, కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా..బెంగళూరులోని పీన్య ప్లాంటేషన్ 1, ప్లాంటేషన్ 2లోని రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 599 ఎకరాలు అటవీ భూములని, 1960 దశకంలో వీటిని డి నోటిఫై చేయకుండా హెచ్‌ఎంటికి అక్రమంగా అప్పగించారని అటవీ శాఖ మంత్రి ఖండ్రే మంగళవారం అటవీ, పర్యావరణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి రాసిన నోట్‌లో పేర్కొన్నారు. 2002లోనే కెనరా బ్యాంకుకు అప్పగించిన హెచ్‌ఎంటి భూములను మంగళవారం ఖండ్రే సందర్శించి టాక్సిక్ చిత్రం షూటింగ్ కోసం సెట్స్ వేసేందుకు అటవీ భూమిలోని చెట్లను నరికివేసిన విషయాన్ని గుర్తించారు. అయితే ఆ భూములను కెనరా బ్యాంకుకు లీజుకు ఇవ్వలేదని, వాటిని బ్యాంకుకు అమ్మివేయడం జరిగిందని కుమారసామి తెలిపారు. హెచ్‌ఎంటి భూములపై గందరగోళాన్ని సృష్టించడానికి మంత్రి ఖండ్రే ప్రయత్నించడానికి వ్యతిరేకంగా ఒకటి రెండు రోజుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని వాస్తవాలు వెల్లడిస్తానని కుమారస్వామి చెప్పారు. హెచ్‌ఎంటికి చెందిన భూములను కెనరా బ్యాంకు ఏనాడో జప్తు చేసుకుందని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News