Monday, December 23, 2024

ఆకలి సూచీలో దిగజారుడు

- Advertisement -
- Advertisement -

India ranks 94th in World Hunger Index report

మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్ సింగ్ పాలనలో మన దేశ పరువు ప్రతిష్ఠలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ వాటిని తిరిగి ప్రతిష్ఠించారని, లోకమంతా మన వైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా? మన ఆర్ధికరంగ వృద్ధి తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా? ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా! దాన్ని మేము ఏల చూడవలె!! హతవిధీ అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు.

Global Hunger Report

మయసభలో దుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. అక్టోబరు 9వ తేదీన ‘భారత ఆర్ధిక వేళ’ అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర, శనివారాల్లో మన దేశంలోని అనేక టివిలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు. మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్ర మోడీకి గౌరవప్రదమా? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా? మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలు చేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్ సర్జన్లు ఉండి ఉండాలని మోడీయే చెప్పారు. ఇక ఇంధనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి, క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢ విశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా! పాములనాడించేవారు పొట్టకూటి కోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం.

మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ధి ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశా రు.కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ గో మాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.

ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగా మాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్ఠను పెంచేవా? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రూ. 500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు.

అంతేకాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కేన్సర్‌ను మాయం చేసినట్లు బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే. పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్ఠను తెచ్చేదిగా ఉందా? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించే వారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్ధితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది.

మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు? 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9 వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు. ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చకూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.

మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం. 2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్, బంగ్లాదేశ్ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన అఫ్ఘానిస్తాన్ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్ 99, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్ర మోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్ఠలను పెంచేదా? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడి చమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్ర మోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్ధాంతం అవసరమా?

జిడిపిలో 5 స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒకనాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి?ఐరోపావారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు.

నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో, ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయపడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు? దేశంలో ఆవు దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News