Wednesday, November 6, 2024

నల్లమలలో అటవీ జంతువుల వేట

- Advertisement -
- Advertisement -

విచ్ఛలవిడిగా వన్యప్రాణుల వేట
కృష్ణాతీరం వెంట వేటగాళ్ళ తిష్ఠ
తుపాకులు…వలలతో అడవిజంతువుల సంహారం
బృందాలుగా ఏర్పడి అడవి జంతువుల కోసం అన్వేషణ
వేసవిలో నీటి వనరులు ఉన్న చోట జంతువుల వేట
రాష్ట్రాల్లో సరిహద్దుల్లో యధేచ్ఛగా వేటగాళ్ళ ఆట
లాక్‌డౌన్‌లో నిఘా లోపం…వేటగాళ్ళకు కలిసొచ్చిన లాక్‌డౌన్
అటవీ శాఖ అధికారుల కళ్ళుగప్పి అడవుల్లోకి
మూడు నెలల్లో అనేక ఘటనలు.. వెలుగు చూడనివి ఎన్నో
వేటగాళ్ళకు కృష్ణాతీరంలోని జాలర్ల సహకారం
ట్రాప్ కెమెరాలు, అటవీశాఖ నిఘా ఉన్నా జడవని వైనం
వేటగాళ్ల ఆటకట్టుతోనే నల్లమలలో అటవీ జంతువులకు రక్షణ
వేటగాళ్ళకు అడ్డాగా మారిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు


మనతెలంగాణ/నాగర్‌కర్నూల్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని నల్లమల అటవీ ప్రాంతం అటవీ జంతువుల వేటగాళ్ళకు పెట్టనికోటగా మారింది. ఇరు రాష్ట్రాలకు చెందిన అనేక మంది వన్యప్రాణుల వేటగాళ్ళు అటవీ శాఖ, పోలిసు శాఖ కళ్లుగప్పి నిత్యం వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఏకంగా తుపాకులు, అధునాతనమైన వలలు విల్లంబులతో యధేచ్చగా వేట సాగిస్తున్నారంటే వేటగాళ్ళకు నల్లమల అటవీ ప్రాంతం ఆదాయమార్గంగా మారిందని చెప్పవచ్చు. నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అరుదైన జాతికి చెందిన వన్యప్రాణులతో పాటు పెద్దపులులు,చిరుతపులులు, సాంబర్లు, కృష్ణజింకలు, తెల్లమచ్చల జింకలు, కొండగొర్రెలు, కుందేళ్ళు, మనుబోతులు , అడవి పందులు, కొండముచ్చులు, వివిధ రకాల కోతులు వంటి జీవజాతులు వేలసంఖ్యలో జీవనం సాగిస్తున్నాయి. దీనికి తోడు జాతీయ పక్షి నెమలి, అడవి కోళ్ళు, కంజులు, బురుకపిట్టలు వంటి అనేక జాతుల పక్షులు అమ్రాబాద్ టైగర్‌రిజర్వులో మనుగడను సాగిస్తున్నాయి.

ప్రధానంగా అంతరించిపోతున్న ముషిక జింకలను నల్లమలలో సంరక్షిస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సుమారు 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అటవిప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పాటు అడవి మధ్యలో కృష్ణానది పారుతుండడం వన్యప్రాణుల మనుగడకు ఈ అడవులు కేంద్రబిందువుగా మారాయి. గత మూడు నెలల్లో అనేక వన్యప్రాణుల వేటను సాగించిన సంఘటనలు వెలుగు చూడగా గతంలో ఎన్నడు లేని విధంగా తుపాకులతో వేట సాగించిన విషయాలు బయటపడడం అటవీ శాఖ అధికారులను విస్మయపరిచిందని చెప్పవచ్చు.

దీనికి తోడు ఆంధ్రరాష్ట్రానికి చెందిన వ్యక్తులు బృందాలుగా ఏర్పడి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో కృష్ణానది సరిహద్దులో వన్యప్రాణులను వేటాడి ఫారెస్టు అధికారులకు చిక్కడం వారి నుండి జింకల కళేబరాలను స్వాధీన పరచుకోవడం సంచలనంగా మరిందని చెప్పవచ్చు. వేటగాళ్లకు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని జాలర్లు సహకారం అందిస్తున్నారని అటవీ శాఖ అధికారుల విచారణలో తేలింది. కృష్ణాపరివాహక ప్రాంతంలో చేపలు పట్టేవారు విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వీరి సహకారంతో వన్యప్రాణుల వేటగాళ్ళు తమ వేటను యధేచ్ఛగా సాగిస్తూ ఇరు రాష్ట్రాలలో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఈ ప్రాంతాలలోనే వేటగాళ్ళ ఆటలు

నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం కొల్లంపెంట, కొమ్మొని పెంట, తాటిగుండాల, వటవర్లపల్లి, మల్లెలతీర్థం, దోమలపెంట, మన్ననూర్, పరిసర అటవీ ప్రాంతాలు, ఇతర చెంచు పెంటలు, గిరిజన గూడాలు, పదర మండలంలోని మద్దిమడుగు, గీసగండి, పెట్రాల్ చేను, పల్లెరూటి పెంట, బల్మూర్ మండలంలోని రసూల్ చెరువు, లింగాల మండలం, కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, మల్లేశ్వరం, మంచాల కట్ట, అమరగిరి ప్రాంతాలతో పాటు ఆంధ్రసరిహద్దు ప్రాంతమైన ఆత్మకూర్‌కు చెందిన అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటగాళ్ళ ఆటలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటివరకు వేటగాళ్ళు వన్యప్రాణులను వేటాడిన ప్రాంతాలు ఇవే కావడంతో ప్రధానంగా అటవిశాఖ పోలిసు శాఖ అధికారులు నిఘా పెట్టిన విస్తారంగా ఉన్న నల్లమల అటవి ప్రాంతంలోకి ఏదో ఒక చోటు నుంచి వేటగాళ్లు అడవుల్లోకి ప్రవేశించి జంతువుల వేటను సాగిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రాంతం నుంచి తెలంగాణ అడవుల్లోకి

ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేక మంది వేటగాళ్ళు నల్లమల సరిహద్దులోని కృష్ణాతీరం వెంట తెలంగాణ అడవుల్లోకి వచ్చి వేటను సాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గత మే నెలలో ఆంధ్రప్రాంతానికి చెందిన వేటగాళ్ళు నాగార్జున సాగర్‌ప్రాంతంలోని టైగర్ రిజర్వు నుంచి మద్దిమడుగు వైపుకు అడవిలోకి వచ్చి జింకలను వేటాడి పట్టుబడిన విషయం విధితమే. దీనికి తోడు అదే నెలలో కొందరు వేటగాళ్ళు కృష్ణానదిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారుల కంట్లో పడగా వారిని వెంబడించిన అటవీ సిబ్బందికి వారు వేటాడిన కొండ ముచ్చు కళైబరం స్వాధీనం చేసుకున్నారు. తుపాకితో దానిని వేటాడిన ఆనవాళ్లను గుర్తించారు. ప్రధానంగా వీరు తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నా గుంటూరు, ప్రకాశం, కర్నూల్ జిల్లాల సరిహద్దు గ్రామాలతో పాటు నల్గొండ జిల్లా గుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోకి వేటకోసం వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యుత్ ఉన్న చోట వన్యప్రాణుల కోసం వేట

విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వేటగాళ్ళు ఒకడుగు ముందుకు వేసి విద్యుత్ తీగలను అమర్చి అటవీ జంతువులను వేటాడతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో రైతులు తమ పంట పొలాలకు అడవిపందుల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెలు వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల అమ్రాబాద్ మండలం బికె లక్ష్మాపూర్ తండా సమీపంలో వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి చెంచు యువకుడితో పాటు అతని ఆవు, కుక్క మృతిచెందిన విషయం విధితమే.

 ట్రాప్ కెమెరాలలో చిక్కిన వన్యప్రాణి వేటగాళ్ళు

నల్లమల అటవి ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వచ్చిన వారి చిత్రాలు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన విషయం విధితమే. మే 3వ తేదిన మధ్య రాత్రి, మే 7వ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో దుప్పిని వేటాడి చంపి మంసాన్ని తీసుకెళ్తుండగా అటవీ ప్రాంతంలో అమర్చిన వారి ఛాయచిత్రాలు చిక్కడంతో అచ్చంపేట ఎస్సై ప్రదీప్ విచారణ జరపగా అచ్చంపేట పరిధిలోని గుంపన్‌పల్లి గ్రామానికి చెందిన పది మంది వేటగాళ్లు నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా జూన్ 10వ తేదిన అమ్రాబాద్ మండలంలోని అటవీ ప్రాంతంలో వటవర్లపల్లికి చెందిన గోపాల్, మన్ననూర్‌కు చెందిన నేనావథ్ గోపాల్, ఆలేటి శివ ఉడుమును వేటాడి చంపారు. వేటాడిన ఉడుమును ఆటోలో తరలిస్తుండగా మన్ననూర్ దుర్వాసుల చెక్‌పోస్టు వద్ద అటవీ అధికారులు పట్టుకున్నారు. నిందితులకు కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం విధితమే. దీంతో పాటు లింగాల మండలం ఔసలికుంట గ్రామసమీపంలో మృతి చెందిన జింక కుక్కల పాలైంది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ కంచెకు చుక్కల దుప్పి బలైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ ఘాతం తరువాత జింక గ్రామపరిసరాల్లోకి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అటవీ శాఖ అధికారులు అటవీ చుట్టూ నిఘా ఏర్పాటు చేసిన నల్లమల అటవీ ప్రాంతంలో ఏదో ఒక చోట వేట కొనసాగుతుంది. అధికారులు కళ్ళు గప్పి మరెన్నో వన్యప్రాణుల వేట సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లాక్‌డౌన్‌తో కలిసొచ్చిన వేట

లాక్‌డౌన్ కారణంగా అటవీ ప్రాంత సరిహద్దు ప్రాంతాలలో పనిపాట లేని కొందరు వ్యక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటను యధేచ్ఛగా సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుందేళ్ళ వేట నుంచి జింకలు, దుప్పిలు, అడవి పందుల వేట కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో తమ గుడాచారా వ్యవస్థను పటిష్టపరిచి అడవిలోకి ఎవరు వెళ్తున్నారు, వేట సాగించి ఎక్కడ విక్రయిస్తున్నారు అనే అంశాల పై దృష్టి పెడితే వన్యప్రాణులను కాపాడడంలో సఫలీకృతులవుతారని వన్యప్రాణి ప్రేమికులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News