Monday, December 23, 2024

రంగురాళ్ల వేటను నియంత్రించాలి

- Advertisement -
- Advertisement -

వర్షాల రాకతో మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రంగురాళ్ల వేట మొదలవుతుంది. ఈ నేలలపై వర్షం నీటి వరదకు పొడిమట్టి కొట్టుకుపోయి మిలమిల మెరిసే రాళ్లు పైకి వస్తాయి. దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంతంలోని పర్వత ప్రాంతమైన పన్నా జిల్లాలోని అడవుల్లో వ్యవసాయ, ప్రభుత్వ భూముల్లో వజ్రాలు అధికంగా లభిస్తున్నాయి. వజ్రాల వేటకై ప్రభుత్వ అటవీ భూములను అక్కడ లీజుకు కూడా ఇస్తున్నారు. ఇదంతా జాతీయ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతోంది. వ్యవసాయ భూముల్లో దొరికిన ముతక వజ్రాలు దొరికిన వారి సొంతమవుతాయి. ఒక్కో రోజు రూ. కోటి విలువైన రాళ్లు కూడా దొరికిన సందర్భాలున్నాయి. అయితే అన్ని రోజులు, అందరి చేతులు ఒకేలా ఉండవు. దొరికిన విలువైన రాళ్లను జిల్లా కోర్టులో డిపాజిట్ చేయడం తప్పనిసరి. అవి మేజిస్ట్రేట్ నియంత్రణలో వేలం వేయబడి ప్రభుత్వానికి రావాల్సిన పన్ను, రాయల్టీని మినహాయించి సొంతదారుకు మిగతా సొమ్ము చెల్లించబడుతుంది. ప్రతి యేడు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ వేట కొనసాగుతుంది. పరిసరాల వారే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి రంగురాళ్ల వెతుకులాట మొదలెడతారు. దూరం నుంచి వచ్చినవారు ఆ భూముల్లోనే గుడారాలు వేసుకొని పొద్దున ఆరింటి నుంచి పొద్దు గుంకే దాకా కళ్లు నేలకేసి, నడుం వంచి, కాళ్లపై కూచొని అదే పనిగా ఆడా మగా తేడా లేకుండా అన్ని వయసులవారు భూమిలో వేళ్ళు జొప్పించి చేతికందిన రాయిని పరీక్షగా చూస్తుంటారు. మెరిసిందంటే దాచి పెట్టుకుంటారు. ఆ రాయి వజ్రమని తేలిందంటే ఒకే సారి జీవితకాల పంట పండినట్లే. రెండు వేళ్ళ మధ్య అమిరే రంగు రాయి వారికి లక్షలను తెచ్చిపెడుతుంది.
దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ వర్షాకాలం వజ్రాల వేట సాగుతుంది. అనంతపురం లోని వజ్రకరూరు, కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర, మహానంది చుట్టు పక్కల నేలలు చినుకు పడగానే వజ్రాల వేటకు ఆహ్వానం పలుకుతాయి. పోయిన నెల మద్దికెరకు చెందిన రైతుకు రూ. 2 కోట్ల విలువైన వజ్రం లభించిన విషయం ప్రముఖ వార్త అయింది. రెండేళ్ల క్రితం జొన్నగిరిలో ఒకరికి కోటిన్నర విలువైన వజ్రం దొరికిందని వార్త నోటి మాటగా బయటికొచ్చింది. అప్పటికే ఆ సొమ్ములోంచి కొంత పోలీసు, రెవెన్యూ వారికి ఇవ్వక తప్పలేదని, బయట పడితే మరింత నష్టం జరిగే అవకాశముందని తన పేరు, వివరాలు రాయొద్దని ఆయన పత్రికల వారిని కోరాడు. దాంతో ఆ వివరాలు బయటకు రాలేదు. పోయినేడు జులై లో జొన్నగిరి లో ముగ్గురికి విలువైన రాళ్లు దొరికినట్లు సమాచారం. వాటిలో ఒకటి రూ. 1.2 కోట్ల ధర కాగా, మిగితా రెండు 70, 50 లక్షల విలువైనవని తేలింది. ఇలా ప్రతి యేడు సుమారు 5 కోట్ల విలువైన రంగు రాళ్లు మద్దికెర, తుగ్గలి మండలాల్లోనే దొరుకుంటున్నాయట.
ఇదంతా ఒక ఎత్తయితే ఈ రంగు రాళ్ల వేట మరో రూపంలో పంటలు తీసే రైతులకు శాపంగా మారిందనవచ్చు. రైతులు కాపలా లేని సమయాల్లో రాళ్ల వేటగాళ్లు నేలంతా తిరుగుతూ, తవ్వుతూ పంటను నాశనం చేస్తున్నారని, వారిని తరిమేందుకు కర్రలు పట్టుకుని కాపలా ఉండాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వర్షాకాలం మొదలవగానే తమ పంట చేలల్లో రాళ్ల వెదుకులాట చేపట్టవద్దని భూమి సరిహద్దుల్లో కొందరు బ్యాన ర్లు కడుతున్నారు. కొందరు పోలీసుల సాయాన్ని కోరుతున్నారు. ఇలా వద్దన్న వారి చేలల్లో బయటివారు అడుగు పెట్టకుండా పోలీసుల పహారా సాగుతోంది. పంటలేసిన నేలల్లో ప్రవేశించవద్దని పోలీసులు బహిరంగ హెచ్చరికల ప్రచారం కూడా చేపడుతున్నారు. ప్రతి యేడు రాయలసీమ జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాల నేల ఇలా తవ్వకాలను గురవుతోంది. దీని వల్ల ఆ ప్రాంతాల్లో పండించే వేరుశనగ, పత్తి, కంది, టమాటా సేద్యానికి ఆటంకం కలుగుతోందని రైతుల ఆవేదన పడుతున్నారు. తమ అనుమతి లేకుండా భూముల్లో అడుగుపెట్టిన వారిని రైతులు పోలీసులకు అప్పగిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
మన దేశంలో రంగురాళ్లు దొరికే ప్రాంతాల్లో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు కూడా అడుగుపెట్టాయి. అయితే ఫలితాలు గిట్టుబాటుగా లేనందున అవి తిరిగి వెళ్లిపోయాయి. ప్రతి వర్షాకాలంలో ముంబై, చెన్నై, సూరత్ నగరాల నుంచి వజ్రాల వర్తకులు వచ్చి సమీప పట్టణాల్లోని లాడ్జిల్లో ఉండి రాళ్లను కొంటుంటారు. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో ఏటా 50 వరకు విలువైన రాళ్లు దొరుకుతుంటాయి. ఈ రాళ్ల వేటపై ఏ రాష్ట్రంలోనైనా పోలీసు, రెవెన్యూ అజమాయిషీ ఉండకపోవడానికి మన చట్టాలే కారణమని చెప్పాలి. అవి రాష్ట్ర సొత్తు అని ఏ చట్టాల్లోనూ లేదు. నేలలో ఉండే అన్ని రకాల ఖనిజాలు భూమి సొంతదారుకే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సముద్రంలోని ఖనిజాలు మాత్రం ప్రభుత్వానికే చెందుతాయి. ఎవరి ఇంట్లోనైనా, భూముల్లోనైనా గుప్తధనం ఏ రూపంలో లభించినా దానిని ప్రభుత్వానికి అప్పగించాలని చట్టం ఉంది. అమెరికాలో మాత్రం రంగురాళ్ల లభ్యమయ్యే ప్రాంతాల్లో డైమండ్ పార్కులను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రవేశ రుసుము చెల్లించి ఎవరైనా వజ్రాలను వెతుక్కుంటూ ఒక రోజూ గడపవచ్చు. దొరికిన రాయి వజ్రమా కాదా అని చెప్పే నిపుణుల సదుపాయం కూడా అక్కడే ఉంటుంది. 37 ఎకరాల విస్తీర్ణం ఉన్న అర్కాన్సాస్ స్టేట్ డైమండ్ పార్కులో ఇప్పటికీ 35 వేల మెరుపు రాళ్లు సందర్శకుల సొంతమయ్యాయి. మన దేశంలోనూ ఎన్నో ఏళ్లుగా ప్రతి వర్షాకాలం కొనసాగుతున్న ఈ రంగురాళ్ల వేటపై కూడా ప్రభుత్వ విధానపర నిర్ణయం అవసరం అనిపిస్తోంది. సాగు రైతులకు ఇబ్బంది కలగకుండా, రాళ్లు దొరికే వారికి రక్షణ ఇచ్చేలా, వారి ఆదాయంపై కొంత పన్ను వేసేలా, మరీ ముఖ్యంగా వజ్రాల కొనుగోలు చాటుమాటుగా కాకుండా వజ్రాల వ్యాపారి నుండి రాయి మెరుపుకు తగ్గ విలువ సొంతదారుకు దక్కేలా చూడాలి.

-బి.నర్సన్, 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News