నీట మునిగిన న్యూయార్క్, ఎమర్జెన్సీ ప్రకటన
ఏడుగురు మృతి
రైల్వే స్టేషన్లు, సబ్‌వేలలోకి వరద నీరు
న్యూజెర్సీలోనూ ఆత్మయిక స్థితి
న్యూయార్క్: ఇడా తుపానుతో అగ్రరాజ్యం అమెరికాలోని అనేక రాష్ట్రాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే లూసియనా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన తుపాను తాజాగా న్యూయార్క్‌పైనా తన ప్రతాపం చూపుతోంది. ఇడా కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు న్యూయార్క్ నీట మునిగింది. దీంతో ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. తుపాను కారణంగా ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. పొరుగున ఉన్న న్యూజెర్సీలో మరొకరు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒకే ఇంటిలో ఎవరూ సాయం అందించకపోవడంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యాభై ఏళ్ల వ్యక్తి, ఓ 48 ఏళ్ల మహిళ, రెండేళ్ల బాలుడు ఉన్నారు. అనూహ్య వరదలతో న్యూయార్క్‌లోని అనేక ప్రాంతాలు జలమయమైనాయి. అండర్‌పాస్ వంతెనలు, రైల్వే స్టేషన్లు, సబ్‌వేలలోకి భారీగా వరద నీరు చేరింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి మోకాలి లోతు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్టా పలు విమానాలు రద్దయ్యాయి. మెట్రో రవాణాను నిలిపి వేశారు. ఓ మెట్రో స్టేషన్‌లోకి వరద నీరు పోటెత్తిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ప్రాంతంలో కేవలం ఒక గంటలో 3.15 అంగుళాల వర్షపాతం నమోదైంది. గత ఆగస్టు 21న ట్రాపికల్ తుపాను హెన్రీ సమయంలో ఈ ప్రాంతంలో ఒక గంటలో 1.94 అంగుళాల వర్షపాతం నమోదైంది. ఇప్పటిదాకా అదే రికార్డు వర్షపాతం కాగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలయింది. తుపాను దృష్టా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ కేటీ హోచుల్ తెలిపారు.అటు పొరుగున ఉన్న న్యూజెర్సీలోను ఆత్యయిక స్థితి ప్రకటించారు. న్యూ జెర్సీలో అమెరికా పోస్టల్ సర్వీస్‌కు చెందిన భవనం పై కప్పు భారీ వర్షాలకు కూలి పోయింది. ప్రమాద సమయంలో భవనం లోపల జనం ఉన్నారు కానీ మరణాలకు సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు. సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.