న్యూఢిల్లీ : యూపీ ఎన్నికల్లో ఒకే నియోజక వర్గంలో ఒకే పార్టీ నుంచి ఆలూమగలు పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. సరోజినీ నగర్ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాధ్ మంత్రివర్గం లోని స్వాతిసింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 2౩న నాలుగో దశలో ఈ నియోజక వర్గం ఎన్నిక జరుగుతుంది.
ఉమాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. స్వాతి సింగ్ ప్రస్తుతం అనేక శాఖల సహాయ మంత్రిగా , స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. 2016 లో పార్టీలో చేరిన స్వాతిసింగ్ 2017 లో సరోజినీ నగర్ నుంచి ఎమ్‌ఎల్‌సిగా ఎన్నికయ్యారు. ఓ పక్క భార్యాభర్తలు ఇద్దరూ సరోజినీనగర్‌లో హోర్గింగ్‌లతో హోరెత్తిస్తుంటే పార్టీ అధిష్ఠానం మూడో వ్యక్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి మహేంద్ర సింగ్, మాజీ సిఎం కల్యాణ్‌సింగ్ సన్నిహితుడు రాజేష్ సింగ్ చౌహాన్, మాజీ కౌన్సిలర్లు గోవింద్ పాండే, రామశంకర్ త్రిపాఠీలతోపాటు సౌరభ్ సింగ్, జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్‌కుమార్ సింగ్ చౌహాన్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.