నాగపూర్: అదనపు కట్నం కోసం 33 ఏళ్ల తన భార్యను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆమె స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించిన ఆమె భర్తతోపాటు అతని తల్లిదండ్రులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని వాషింలో ఈ సంఘటన చోటుచేసుకుంది.మన్కాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. 2008లో బాధితురాలికి పెళ్లయింది. ఆమెకు కవల పిల్లలు పుట్టారు. అయితే భర్త పెట్టే హింస భరించలేక ఆమె తన పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అతడికి విడాకులు ఇచ్చేసింది.ఆ తర్వాత..షాదీ.కాం అనే వెబ్‌సైట్‌లో ఒక వ్యాపారి సంబంధం చూసి అతడిని 2019 నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. వివాహం సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రూ. 34 లక్షలు విలువైన నగలు కట్నంగా ఇచ్చారు.
ఆమె పిల్లలను తన తల్లిదండ్రుల వద్దే వదిలి రెండవ భర్తతో కలసి వాషింలో ఉంటోంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమె భర్త, అత్తమామల నుంచి రూ. 10 లక్షల కట్నం పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమెకు గర్భస్రావం అయింది. రెండవసారి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అదనపు కట్నం కోసం ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె భర్త ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. దీన్ని చూపెట్టి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఈ వేధింపులను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి భర్తతోపాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.