రాహుల్ గాంధీ కుటుంబానిది మహా సంగ్రామం నుంచి వచ్చిన చరిత్ర
కేంద్రమంత్రి బండి సంజయ్ అవగాహన పెంచుకొని మాట్లాడాలి
సోనియా గాంధీ ఏ మతం అని అడగడం విడ్డూరంగా ఉంది
రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదు
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాహుల్ గాంధీ కుటుంబానిది మహా సంగ్రామం నుంచి వచ్చిన చరిత్ర అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆయనకు అవగాహన ఉండి మాట్లాడారో లేకుండా మాట్లాడారో తెలియడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. జగ్గారెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని, వాళ్లు హిందువులని, బ్రాహ్మణులు హిందువులు కారా..? నీకేమైనా అనుమానం ఉందా..? అని బండి సంజయ్‌ను జగ్గారెడ్డి ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదని, సోనియా గాంధీ ఏ మతం అని అడగడం విడ్డూరంగా ఉందని సంజయ్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెడ్డి అని తన భార్య గౌడ్ అని ఇప్పుడు మా ఆవిడని రెడ్డి అనే పిలుస్తారని ఆయన తెలిపారు. సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడని, కాబట్టి సోనియా గాంధీ బ్రాహ్మణ కుటుంబమే అవుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. భర్తది ఏ కులం అయితే అదే కులం భార్యకు వర్తిస్తుందని, ఇలాంటి విషయాలపై సంజయ్ అవగాహన పెంచుకోవాలని జగ్గారెడ్డి చురకలు అంటించారు.
గాంధీల కుటుంబం కులమతాలకు అతీతంగా ఉంది
ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ గాండీ అని, స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆయన పేరు ఫిరోజ్ గాండీ నుంచి గాంధీగా ప్రజలు మార్చారని ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ జంధ్యం వేసుకునే వాళ్లని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే ఆయన కూడా జంధ్యం వేసుకుంటారని, మేనకా గాంధీ సిక్కు అని సంజయ్ గాంధీని చేసుకున్నాక మేనకా గాంధీగా మార్చుకున్నారని ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ స్వాతంత్ర ఉద్యమ కారుడని, స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లాడని ఆయన తెలిపారు.
ఫిరోజ్ హిందూ మతంలోకి మారి ఇందిరా గాంధీని పెళ్లి చేసుకున్నారన్నారు. వాజ్‌పేయి తరవాత ప్రధాని కావాల్సింది అద్వానీ అని, కానీ, ఆయన్ను మోడీ పక్కన పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ది ఏ కులం, ఏ మతమో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఆయన తగదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీల కుటుంబం కులమతాలకు అతీతంగా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదన్నారు. దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం భర్తది ఏ కులమైతే భార్యది అదే కులం అవుతుందని ఆయన వెల్లడించారు. హిందూ ధర్మంపై రాజకీయం చేసి ఓట్లు అడిగే బండి సంజయ్‌కు ఇది కూడా తెలియకపోతే ఎలా అని జగ్గారెడ్డి నిలదీశారు.