Wednesday, January 22, 2025

లాటరీ కొట్టింది..భర్తను మార్చేసింది !

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ధనమేరా అన్నిటికి మూలం..అంటూ తత్వం ఆలస్యంగా బోధపడి పాడుకుంటున్నాడో అభాగ్య భర్త.. చేసిన అప్పులను తీర్చడానికి దేశం కాని దేశానికి వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తే ఆ డబ్బుతో జల్సాలు చేసిన భార్య లాటరీలో రూ. 2.9 కోట్లు రావడంతో కట్టుకున్న భర్తకు చెప్పాపెట్టకుండా వేరే వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అసలు భర్త తనను మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది థాయ్‌ల్యాండ్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటన.

నరీన్ అనే 47 ఏళ్ల థాయ్ జాతీయుడికి 20 ఏళ్ల క్రితం చావీవాన్ అనే మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చడానికి వేరే మార్గం లేక నరీన్ 2014లో దక్షిణ కొరియాకు వలస పోయాడు. తనతోపాటే భార్య, పిల్లలను కూడా తీసుకుపోయాడు. అయితే కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత పిల్లలతోసహా అతని భార్య థాయ్‌కు తిరిగి వెళ్లిపోయింది. నరీన్ మాత్రం ప్రతినెలా కుటుంబ ఖర్చుల కోసం ఇంటికి డబ్బు పంపేవాడు. అయితే తన భార్యకు లాటరీలో రూ. 2.9 కోట్లు వచ్చిందని, ఆ విషయాన్ని తన దగ్గర దాచిపెట్టిందన్న విషయం నరీన్‌కు తెలిసింది.

తన ఫోన్ కాల్స్‌కు ఆమె స్పందించడం మానివేయడంతో మార్చి 3వ తేదీన నరీన్ థాయ్‌ల్యాండ్ చేరుకున్నాడు. అయితే తన భార్య ఫిబ్రవరి 25న ఒక పోలీసు అధికారిని పెళ్లి చేసుకుందన్న విషయం అక్కడకు వెళ్లాకే అతనికి తెలిసింది. తనతో 20 ఏళ్లు కాపురం చేసిన భార్య ఇలా చెప్పా పెట్టకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను సంపాదించిన డబ్బంతా ఆమెకే పంపించి వేశానని, ఇప్పుడు తన దగ్గర పైసా మిగల్లేదని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లాం పోతే పోయింది..కనీసం తాను పంపించిన డబ్బయినా తనకు ఇప్పించి న్యాయం చేయండంటూ అతడు పోలీసులను ప్రాదేయపడుతున్నాడు. అతని పరిస్థితిని చూసి పోలీసులు కూడా జాలిపడుతున్నారు. అతనికి ఎలాగైనా న్యాయం చేయాలన్న పట్టుదలతో వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News