పాపన్నపేట: కుటుంబ కలహాలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన భార్యను కాపాడేందుకు బావిలోకి దిగి భార్యతోపాటు భర్త కూడా మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పాపన్నపేట మండలంలోని నార్సింగి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన దారబోయిన నగేష్(35), స్వరూప(32)వ్యవసాయంతో పాటు ఇటీవల గ్రామ శివారులో ఉన్న ఓ ఫామ్‌హౌస్ వద్ద ఉన్న పశువుల కాపరులుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా నగేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
Also Read: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు
బుధవారం ఇద్దరు కలిసి పని నిమిత్తం ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ మళ్లీ సంసార విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో అదే ఆవేశంలో స్వరూప అక్కడే ఉన్న బావిలో దూకింది. భార్యను కాపాడే ప్రయత్నంలో నగేష్ తన దుస్తులు, ఫోన్ ఒడ్డున పెట్టిబావిలోకి దిగాడు. నీటిలో భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. సాధ్యం కాకపోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఫామ్ హౌస్ వద్దకు వచ్చి వెతుకుతుండగా బావివద్ద నగేష్ చెప్పులు, బట్టలు కనిపించాయి. రాత్రి కావడంతో ఉదయం గాలిస్తుండగా బావిలో ఇద్దరు మృతదేహాలు పైకి తేలియాడాయి.
పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నగేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.