Friday, January 3, 2025

భార్యకు భరణం భర్త బాధ్యత: అలహాబాద్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

అలహాబాద్ : భర్తకు ఆదాయం లేకున్నా విడిగా ఉంటున్న భార్యకు నెలసరి పోషక భరణం ఇవ్వాల్సిందే, ఇది ఖచ్చితంగా మగాడి బాధ్యత, పాటించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తనతో విడిపోయి ఉంటున్న భార్యకు భర్త నుంచి నెలవారిగా రూ 2000 అందాల్సి ఉంటుందని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఓ వ్యక్తి హైకోర్టులోసవాలు చేశారు. తనకే ఎటువంటి పనిలేదని, తాను భరణం ఇచ్చుకోలేనని ఈ దూరం అయిన భర్త కోర్టులో విన్నవించుకున్నారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను పునః సమీక్షించి తనపై భారం పడకుండా చూడాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ వాదనను జస్టిస్ రేణూ అగర్వాల్‌తో కూడిన హైకోర్టు లక్నో బెంచ్ పరిశీలించి కొట్టివేసింది. తనకు సరైన జాబ్ లేదా ఎటువంటి పనిలేదని ఈ పిటిషనర్ తెలియచేసుకున్నాడు.

అయితే ఎటువంటి ఆమ్దాని లేకపోయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని, ఏ కూలీపని చేసినా రోజుకు కనీసం 3 లేదా నాలుగు వందల వరకూ సంపాదించి అయినా ఈ భరణం ఇవ్వాల్సిందేనని పేర్కొంటూ కోర్టు రూలింగ్ వెలువరించింది. ఈ భర్త పిటిషన్ చెల్లనేరదని తోసిపుచ్చింది. ఈ వ్యక్తి నుంచి ఆమెకు సరైన రీతిలో భరణం డబ్బులు అందేలా చూడాల్సి ఉందని జస్టిస్ అగర్వాల్ ఈ దశలో ట్రయల్ కోర్టుకు సూచించారు. భార్యకు పోషణ వ్యయం ఇవ్వాల్సిందేనని దిగువ కోర్టు కూడా గతంలో తెలిపింది. తాను భరణం చెల్లించలేనని, ఈ భారం నుంచి విముక్తి కల్పించాలని గత ఏడాది ఫిబ్రవరి 21న భర్త హైకోర్టులో రివిజన్ పిటిషన్‌కు దిగారు. ఈ వ్యక్తి భరణం చెల్లింపుల గురించి అంతకు ముందు దిగువ కోర్టు క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లోని 125వ నిబంధనల మేరకు తీర్పు వెలువరించింది. ఈ ఘటన గురించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2015లో వివాహం తరువాత ఏడాదికే భార్య తన భర్త అత్తింటివారు అధిక కట్నం కోసం వేధిస్తున్నారని కేసు పెట్టింది.

ఈ క్రమంలో భర్తను వీడి పుట్టింటికి చేరుకుంది. కేసు విచారణ క్రమంలో ఈ భర్త తన బాధ తెలియచేసుకున్నాడు. విడిపోయి ఉంటున్న భార్య గ్రాడ్యుయెట్ అని, నెలకు రూ 10000 వరకూ ట్యూషన్లు చెప్పి సంపాదిస్తోందని , తనకైతే ఎటువంటి పనీపాటా లేదని వాపోయ్యాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని , కనికరించాలని వేడుకున్నాడు. తాను కూలీపనిచేస్తూ చిన్నగదిలో ఉంటూ తల్లిదండ్రులు, చెల్లెళ్లను చూసుకోవల్సి వస్తోందన్నారు. రోజూ కూలీపని దొరికే అవకాశం కూడా ఉండదని తెలిపారు. అయితే ఈ కేసు పూర్వాపరాలు, భర్త వాదనలోని నిజానిజాలను , సాక్షాధారాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మహిళా న్యాయమూర్తి భరణం తప్పనిసరి అని తేల్చివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News