ఎపిలోని విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న అనూష, జ్ఞానేశ్వర్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య పెళ్లైన నాటి నుంచే గొడవలు జరుగుతున్నాయి. అనూష గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచి జ్ఞానేశ్వర్ గొడవ పడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య మాటా మాటా పెరిగి, గొడవ తీవ్రతరమైంది. ఆగ్రహంతో జ్ఞానేశ్వర్ 9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా గొంతు నులిమి హత్య చేశాడు. ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి, తన భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.
కాగాఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితులు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి ఆరోగ్యం బాగోలేక మూడేళ్లగా కోమాలో ఉందన్నారు. జ్ఞానేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. భార్యను బయటకు ఎక్కడికి తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదు. జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు. గతంలో కూడా పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు.. ఫలుదాలో ఓసారి టాబ్లెట్స్ కలిపి చంపాలి అనుకున్నాడు. డెలివరీ ఉందని ఆదివారం ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసింది. రాత్రికి రాత్రి చున్నీతో గొంతు బిగించి చంపేశాడు. భర్త జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రక్కేసిన ఆనవాలు ఉన్నాయని బాధితురాలి స్నేహితులు వెల్లడించారు.