Sunday, December 22, 2024

భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పరిగి : మతి స్థిమితంలేని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని సుల్తాన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు పరిగి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ పంచాయితీకి చెందిన కావలి భీమయ్య (48) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నాడు. ఈయనకు గ్రామంలో ఒక ఎకరం వ్యవసాయ పొలం ఉంది. రోజువారి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించే భీమయ్య ఏదో కారణం వలన మతి స్థిమితం కోల్పోయాడు. తన ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య పెంటమ్మను గొడ్డలితో తలపై నరికి హత్య చేశాడు.

అనంతరం భీమయ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 8గంటల వరకు కూడా ఇంట్లో నుంచి ఎవ్వరు రాకపోవడంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు భీమయ్య ఇంటి తలుపులు తెరిచి చూడగా భార్య భర్తలిద్దరు మృతి చెంది ఉన్నారు. ఇది చూసి భయాందోళనకు గురైన స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం అందించారు. పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి, సిఐ రామ వెంకట్ రామయ్య తమ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన విషయాలను తెలుసుకున్నారు. ఇంట్లో రక్తపు మడుగులతో ఉన్న పెంటమ్మతో పాటు ఉరి వేసుకొని ఉన్న భీమయ్య మృత దేహాలను పరిశీలించారు. పక్కనే ఓ గొడ్డలి, కత్తి ఉన్నట్లు గమనించారు. మృతుని తమ్ముడు కావలి శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News