ఓ 36 ఏళ్ల టెకీ తన భార్యను రాతకంగా చంపేసిన ఘటన బెంగళూరులోని దొడ్డకన్నహల్లీ ప్రాంతంలో జరిగింది. వివరాలలోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్ ,ఆమె భర్త రాకేశ్ రాజేంద్ర ఖేడేకర్ ఇద్దరు మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చి ఒక సంవత్సరం నుంచి ఉంటున్నారు. బుధవారం ఇద్దరు భార్యభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో గౌరీ కోపంతో భర్త మీదికి కత్తి విసిరింది. గాయపడిన భర్త అదే కత్తితో ఆమెపై దాడిచేసి ఆమెను చంపేశాడు. మెడ మీద, పొత్తి కడుపులో అనేకసార్లు కత్తితో పొడవడంతో ఆమె చనిపోయింది.
ఆ తర్వాత ఆమె శరీరాన్ని ఎనిమిది లేక పది ముక్కలు చేసి ఓ సూట్ కేసులో కుక్కి అతడు పారిపోయాడు. ఆ తర్వాత గౌరీ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తాను ఆమెను చంపేశాడని తెలిపాడు. వారు వెంటనే మహారాష్ట్ర పోలీసులకు తెలిపారు. కాగా మహారాష్ట్ర పోలీసులు తర్వాత విషయాన్ని బెంగళూరు పోలీసులకు తెలిపారు. నేరం చేశాక రాకేశ్ బెంగళూరు నుంచి పుణే పారిపోయాడు. అక్కడ అతడు ఆత్మహత్య ప్రయత్నంలో విషం తాగాడు. పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న రాకేశ్ ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రాకేశ్ ఖేడేకర్ చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకున్నాక బెంగళూరు తీసుకొచ్చి విచారించినున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.