పెళ్లిని లైసెన్సుగా భావించుకోవద్దు
చెన్నై : మహిళపై మానవ మృగంగా మారడానికి పెళ్లి అనేది ఓ లైసెన్స్ అనుకోరాదని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్తపై ఓ భార్య పెట్టిన అత్యాచార కేసు సముచితమే అని, చట్టం పరిధిలో దీనిపై తగు విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. భర్త తనను లైంగిక బానిసగా చూసుకుంటున్నాడని, తన కామకోరికలు తీర్చుకుంటున్నాడని భార్య పిటిషన్ వేసింది. మగవారు పెళ్లిని ఆధారంగా చేసుకుని లైంగిక అత్యాచారాలకు పాల్పడితే అది చట్టబద్ధం అన్పించుకోదు. ఇటువంటి పరిణామాలు తలెత్తరాదు, ఎవరైనా వివాహాన్ని నేరాలకు పాల్పడేందుకు సాధనం అని, లేదా చట్టం నుంచి తప్పించుకునే రక్షణ కవచం అని అనుకుంటే అది చట్టరీత్యా చెల్లనేరదని హైకోర్టు పేర్కొంది. భార్య సుముఖత లేకుండా భర్త లైంగిక చర్యకు పాల్పడితే అది దాంపత్య చర్య అన్పించుకోదు, అత్యాచార కాండనే అని ధర్మసనం తెలిపింది. బలవంతంగా భర్త తనను అనుభవించడం భార్యకు మానసికంగా శారీరంగా అంతులేని బాధను కల్గిస్తుంది, ఇటువంటి బాధలను ఆమె మౌనంగా భరించడం జరుగుతోంది. ఈ మౌనం వెనుక ఉన్న వేదనలను అర్థం చేసుకోవల్సి ఉందని హైకోర్టు తెలిపింది.