గొల్లపల్లిః మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచిన భర్త అనంతరం భయంతో ఉరేసుకుని బలవన్మరణం చెందిన సంఘటన గొల్లపల్లి మండలంలోని నల్లగుట్ట ప్రాంతంలో తీరని విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ పసుల దత్తాద్రి తెలిపిన కథనం మేరకు నల్లగుట్ట ప్రాంతంలో నిరుపేద కుటుంబానికి చెందిన అనంతుల రాకేష్ (35) అనే యువకుడు కూలీ నాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొతకాలం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లి ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చి కూలీనాలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నిరుపేద కుటుంబం దానికి తోడు ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా వెంబడిస్తుండడంతో మద్యానికి బానిసయ్యాడు.
దీంతో భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య భర్తలకు మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి మద్యం మత్తులో భార్య మమతను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. అనంతరం రాకేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.