కూకట్‌పల్లి: భార్య మెడలో తాళి దొంగతనం చేసి దొంగోడు వచ్చి తెంచుకొని పోయాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో భర్తే దొంగతనం చేసి నాటకమాడని తేలింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కెపిహెచ్‌బి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెదక్ జిల్లా వల్లూరుకు చెందిన ఆంజనేయులు-భాగ్యమ్మ అనే దంపతులు గత కొంతకాలంగా కెపిహెచ్‌బిలోని వసంత్‌నగర్ రోడ్డు నంబర్ 6లో నివసిస్తున్నారు.ఓ ఆపార్ట్‌మెంట్ లో ఆంజనేయులు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
మంగళవారం ఉదయం భాగ్యమ్మ మెడలొంచి తాళి దొంగ ఎత్తుకెళ్లాడని భర్త కేకలు వేయడంతో ఆపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఎక్కడా దొంగ వచ్చిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆంజనేయులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చేశానని ఒప్పుకున్నాడు. డబ్బు అవసరం కోసం భార్య తాళిని దొంగతనం చేశానని నిజాలు ఒప్పుకున్నాడు. ఆంజనేయులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.