ముంబై : మారుతున్న కాలంతో పాటు మనం మారాల్సిందే. ఇంటిపని భారాన్ని బాద్యతను భార్యాభర్తలు ఇరువురూ సమానంగా చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి ఆధునిక జీవన పరిస్థితుల నేపథ్యంలో బొంబాయి హైకోర్టు తీర్పుగా వెలువరించింది. భర్తను కాబట్టి ఇంటిపని చేయకూడదని భార్యనే ఇంటి పనికి ఉందని భావించి అధికారం చెలాయించే రోజులు కావివి అని న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే , షర్మిల దేశ్‌ముఖ్ ఇటీవల ఓ భర్త దాఖలు చేసుకున్న విడాకుల అర్జీ విచారణ దశలో తెలిపారు. భార్య ఇంటిపని చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని భర్త తెలిపారు. భార్య తరచూ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుందని, తాను ఏం పని చెప్పినా చేయదని,
ఈ విధంగా ఆమె తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని భర్త చేసిన వాదనను విడాకుల అభ్యర్థనను 2018లోనే ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. కాగా దీనిని ఈ భర్త బొంబాయి కోర్టులో సవాలు చేశారు. భార్య క్రూరత్వం నుంచి తనకు న్యాయం కల్పించాలని కోరారు. అయితే ఆమె ఏం క్రూరం చేసిందనేది ఆయన నిరూపించలేదని , పైగా ఇంటిపని దంపతుల ఇద్దరి పని అని కోర్టు తెలిపింది. పైగా ఆమె ఉద్యోగం చేస్తోంది. తను ఇంటికి వచ్చిన తరువాత కూడా ఇంటిపని చేస్తానని, చేయకపోతే ఆయన తనను శారీరకంగా హింసించారని భార్య తెలియచేసుకుంది. ఉద్యోగిని అయిన భార్య ఇంటిపని అంతా ఆమెనే చేయాలనే పద్ధతి సరికాదని తెలిపిన హైకోర్టు సదరు వ్యక్తి విడాకులు కుదరవని స్పష్టం చేసింది.