Saturday, November 16, 2024

సాగర తీరానికి మరిన్ని సొబుగులు

- Advertisement -
- Advertisement -

దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చుకునేలా సుందరీకరణ పనులు
1300 మీటర్ల విస్తీర్ణం… రూ.15 కోట్ల అంచనాతో
నైట్‌బజార్
అర్ధరాత్రి వరకు షాపింగ్ చేసుకునేలా
150 నుంచి -200 దుకాణాలకు అనుమతి
పర్యాటకుల భద్రత కోసం సాగర్ చుట్టూ సిసి కెమెరాలు
త్వరలోనే పూర్తికానున్న అభివృద్ధి పనులు

Hussain sagar beautifull
మనతెలంగాణ/హైదరాబాద్:  చారిత్రక హుస్సేన్ సాగర్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. అందులో భాగంగా సాగరతీరం మరిన్ని సొబుగులను అద్దుకుంటోంది. దీనికోసం మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) చర్యలను వేగవంతం చేసింది. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చుకునేలా సుందరీకరణ పనులను చేపడుతోంది. నెక్లెస్‌రోడ్ తరహాలోనే పర్యాటకులను ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్‌కు హెచ్‌ఎండిఏ మరిన్ని అందాలను సమకూర్చుతోంది. ఇప్పటికే నెక్లెస్‌రోడ్‌లో వీడిసిసి రోడ్డు నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్‌లు నిర్మించి ముస్తాబు చేయగా ప్రత్యేక ఆకర్షణగా ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ లైటింగ్‌ను ఏర్పాటుతో పాటు పర్యాటకానికి మరింత వన్నె తెస్తూ నైట్ బజార్ ఏర్పాటుకు హెచ్‌ఎండిఏ సిద్ధమవుతోంది. ఇప్పటికే హెచ్‌ఎండిఏ చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆదివారం సాయంత్ర నుంచి రాత్రి వరకు సందర్శకులను ఆకట్టుకునేలా హెచ్‌ఎండిఏ ఏర్పాట్లు చేస్తున్న విఫయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఏదో ఒక కొత్తదనాన్ని పర్యాటకుల అందించడానికి హెచ్‌ఎండిఏ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అంతరించిపోతున్న కళలను నేటి తరానికి తెలియచేసేలా పలు కార్యక్రమాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శనలు ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ సాగర్ చుట్టూ దాదాపు లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం విశేషమని అధికారులు పేర్కొంటున్నారు.
చార్మినార్ చుడీబజార్ తరహాలో నైట్‌బజార్
పర్యాటకానికి మరింత వన్నెను తీసుకొస్తూ హెచ్‌ఎండిఏ ‘నైట్‌బజార్’ను ఏర్పాటు చేయబోతుంది. పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచనల మేరకు సంజీవయ్యపార్కు నుంచి బుద్ధభవన్ వరకు సాగర్ తీరం వెంబడి ఈ నైట్‌బజార్‌ను అభివృద్ధి చేయనున్నారు. 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.15 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. చార్మినార్ చుడీబజార్ తరహాలో ఈ నైట్‌బజార్ ఉండబోతుంది. 150 నుంచి -200 దుకాణాల్లో గార్మెంట్స్, ఇయర్ రింగ్స్, జుంకీలు, గాజులు, వెడ్డింగ్ మెటీరియల్‌కు సంబంధించిన షాపింగ్ చేసుకునేందుకు అర్ధరాత్రి వరకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆదివారం సాయంత్ర జరిగే సండే ఫండే కార్యక్రమంలో భాగంగా ట్యాంక్‌బండ్ వద్ద షాపింగ్‌లను ఏర్పాటు చేసుకునే వారి నుంచి దరఖాస్తులను హెచ్‌ఎండిఏ ఆహ్వానించింది.
రూ.60 కోట్లతో పనులు
హుస్సేన్‌సాగర్‌లోని నీటి నాణ్యత మెరుగుకు ఆధునిక సాంకేతిక విధానాలు అమలు చేయడంతో పాటు మొత్తంగా అదనపు హంగులు జోడిస్తూ దాదాపు రూ.60 కోట్ల మేర పనులను హెచ్‌ఎండిఏ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది. సందర్శకులను ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్‌కు అధికారులు సకల హంగులు అద్దుతున్నారు. ఫుట్‌పాత్‌ల ఆధునీకరణ, చూడముచ్చటగొలిపే రెయిలింగ్, లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాకర్స్, పాదచారులు, పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు, లైటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం రూ.14.50 కోట్లు ఖర్చు చేశారు. ఇక రూ.12.50 కోట్లతో చేపడుతున్న స్ట్రీట్ లైట్, సీఐ రెయిలింగ్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సుమారు 15 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ సందర్శకులకు ప్రత్యేక ఆర్షణగా నిలుస్తోంది. పావురాల అడ్డా కబుతర్ ఖానాను మరింత అందంగా తీర్చిదిద్దారు.
నీటి నాణ్యతకు బయో రెమిడేషన్ విధానం..
హుస్సేన్‌సాగర్‌లో నీటి నాణ్యత మెరుగుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కంపు నివారణకు బయో రెమిడేషన్ విధానాన్ని ఆమలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, ఓయూ, బిట్స్ పిలానీ తదితర విద్యాసంస్థలు, ప్రముఖ పరిశోధనలకు చెందిన నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రతి సంస్థ సమర్పించిన ఆర్పీఎఫ్‌పై అధ్యయనం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News