Thursday, January 30, 2025

హుస్సేన్‌సాగర్ అగ్రిప్రమాద ఘటనలో ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

హుస్సేన్‌సాగర్ బోట్ల అగ్నిప్రమాద సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఒకరు, సంఘటనలో మిస్సింగ్ అయిన మరో యువకుడు మృతిచెందారు. భరతమాతకు మహా హరతి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తర్వాత రెండు బోట్లలో హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిన యువకులు బాణాసంచా కాల్చడం ప్రారంభించారు. ఈ సమయంలో ఓ రాకెట్ తిరిగి బాణాసంచా ఉన్న

బోట్‌లో పడడంతో 11మందికి గాయాలు కాగా ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతి అనే యువకుడికి 80శాతం గాయాలయ్యాయి, వీరితో పాటు బోట్‌లో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి అజయ్ కన్పించకుండా పోయాడు. అజయ్‌ను వెతికేందుకు బృందాలను ఏర్పాటు చేయగా రెండు రోజుల నుంచి హుస్సేన్‌సాగర్‌లో వెతికారు. ఈ క్రమంలోనే అజయ్ మృతదేహాం లుంబినీ పార్క్ వద్ద ఉన్న జాతీయ పతాకం వద్ద లభించింది. అజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా వారు గాంధీ, యశోద, సరోజినీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జరిగింది ఇదీ…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భరత మాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో హుసేస్న్‌సాగర్‌లో రెండు బోట్లు ఉంచి బోట్లలో నుంచి టపాసులు పేల్చాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే టపాసులు పేలుస్తున్న సమయంలో టపాసులు దిశ మార్చుకుని నిల్వ ఉంచిన టపాసులపై పడటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో అవి పేలాయి. దీంతో రెండు బోట్లు దగ్ధమయ్యాయి. అదే సమయంలో బోట్లో ఉన్న వారంతా తమ ప్రాణాలను రక్షించుకోడానికి కిందకు దూకారు. అగ్నిప్రమాదం సమయంలో బోట్లలోనే ఉన్న గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గణపతి క్రాకర్స్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

క్రాకర్స్ పేలుస్తున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో గణపతికి 80 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాగారానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి బాణాసంచా కాల్చేందుకు స్నేహితులతో కలిసి బోట్‌లో హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లాడు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు స్నేహితులతోపాటు అజయ్ కూడా హుస్సేన్‌సాగర్‌లోకి దూకాడు. ఇద్దరు స్నేహితులు క్షేమంగా బయటికి రాగా అజయ్ మాత్రం రాలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు లేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అజయ్ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించారు.

అనుమతిలేదు….లైఫ్ జాకెట్లు లేవు…
హుస్సేన్‌సాగర్‌లో బాణాసంచా కాల్చే కార్యక్రమం నిర్వహించే వారు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత విషయం బయటికి వచ్చింది, తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్పడంతో తెలిసింది. అంతేకాకుండా బాణాసంచా కాల్చేందుకు వెళ్లిన వారు లైఫ్ జాకెట్లు ధరించనట్లు తెలిసింది. బాణాసంచా కాల్చేందుకు వెళ్లిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News