రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
కలెక్టర్లు, పోలీసుల అధికారులతో సిఇఒ వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక నిర్వహణకు 20 కేంద్ర బలగాలు రాబోతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికపై కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులతో శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల నియమావళి, కొవిడ్ మార్గదర్శకాలు,కేంద్ర బలగాల వినియోగం, ప్రచారాలకు సంబంధించిన వాటిపై సమావేశంలో చర్చించారు.
ప్రతి ఓటర్‌కు పోలింగ్ స్టేషన్‌లో కల్పించాల్సిన సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, వీల్ ఛైర్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమయంలో ఎన్నికల నియమావళి, నిబంధనలు, కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాలు, రోడ్ షోల నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని వివరించారు. వీధి సమావేశాల్లో 50 మందికి మించి ఉండరాదన్న నిబంధనలు ఉన్నాయని సిఇఒ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. ప్రచారం, డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ తదితర వాటిపై ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయా…తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 27న మరోసారి సమీక్ష నిర్వహిస్తామని సిఇఒ శశాంక్ గోయల్ తెలిపారు. సమావేశంలో కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు.