బెంగాల్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు : ఎస్‌ఇసి ప్రకటన
మమతా బెనర్జీకి ఊరట, ఒడిశాలోని పిప్లి స్థానానికీ పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. హుజురాబాద్ ఎన్నికపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఎపి ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నెల 1న 12 రాష్ట్రాల సిఎస్‌లతో సమావేశమైంది.
మమతకు కీలకంగా భవానీపూర్
కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువరించింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక్కస్థానానికి బైపోల్ జరుగుతుంది. బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు, అక్కడ ఉప ఎన్నికకు వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిస్తూ వచ్చారు. దీనిని మన్నించిన ఎన్నికల సంఘం తాము ప్రకటించిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో భవానీపూర్‌ను ప్రధానంగా తెలిపింది ఈ నెల 30వ తేదీననే ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం వెలువరించిన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇక ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3వ తేదీన నిర్వహిస్తారు. మమత బెనర్జీ ముఖ్యమంత్రి పదవిలో నిలవాలంటే ఈ ఉప ఎన్నికల్లో గెలిచితీరాల్సి ఉంటుంది. తన చిరకాలపు స్థానం అయిన భవానీపూర్‌ను వదిలేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమత బెనర్జీ నందిగ్రామ్ స్థానంలో పోటీ చేశారు. అయితే అక్కడ బిజెపి అభ్యర్థిగా నిలిచిన సువేంధు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు తిరిగి పాత స్థానం నుంచి పోటీ చేసి ఆమె అసెంబ్లీ సభ్యురాలు కావల్సి ఉంది. భవానీపూర్ , సంసేర్‌గంజ్, జాంగిర్‌పూర్ స్థానాలకు బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయని, ఇక ఒడిశాలోని పిప్లి స్థానం కూడా పోటీ జాబితాలో ఉంది. బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు, ఒడిశాలో ప్రభుత్వంలో ఉన్న బిజెడికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి.బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వాధినేత అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉందని, వెంటనే భవానీపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరిపించాలని రాష్ట్ర అధికార యంత్రాంగం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు ఇసి సానుకూలంగా స్పందించింది. ఇక దేశంలో మరో 31 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటరీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పుడు ఎన్నికలు జరగని స్థానాలలో తెలంగాణకు చెందిన హుజురాబాద్ కూడా ఉంది. ఇక ఎపికి సంబంధించి బద్వేలు ఉప ఎన్నిక కూడా ఇప్పుడు జరగదు. ప్రత్యేక రాజ్యాంగ అత్యవసర పరిస్థితితోనే ఇప్పుడు మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల నిర్వహణ నిర్ణయం తీసుకున్నారని ఎన్నికల సంఘం తమ ప్రకటనలో తెలిపింది.