పోలింగ్‌కు 72గంటల ముందే మైకులు బంద్
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార హోరుకు బుధవారం తెరపడనుంది. రాత్రి 7 గంటల వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉండడంతో అభ్యర్థులు చివరి రోజున పోటాపోటీగా ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభలు నిర్వహించుకోవడం, లౌడ్ స్పీకర్ల వినియోగం బుధవారం రాత్రి 7 తర్వాత నిషేధం. ఆ తర్వాత అంతర్గత ప్రచారానికి అభ్యర్థులు పరిమితం కావలసిందే. ప్రచారం గడువు ముగియగానే ఎక్కడికక్కడ ప్రచార రథాలన్నీ మూలకు చేరనున్నాయి. హోరెత్తించిన మైకుల చప్పుళ్లు మూగబోనున్నాయి. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేసినా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధమైంది.ఈనెల 30న జరిగే పోలింగ్‌కు అధికార యంత్రాంగ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 2వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈనెల 30న హుజురాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో దీనికి 72 గంటల ముందే ప్రచారం సమాప్తం చేయాల్సి ఉంది.