86% పైగా పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్, 2న ఓట్ల లెక్కింపు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హుషారుగా పాల్గొన్న ఓటర్లు
ఉదయం 7నుంచి రాత్రి 9వరకు సాగిన పోలింగ్
చెదురుమదురుగా ఘర్షణలు, వాగ్వాదాలు
బరిలో 30మంది అభ్యర్థులు
ఈటలపై సైబర్‌క్రైమ్ పోలీసులకు టిఆర్‌ఎస్ ఫిర్యాదు
మన తెలంగాణ/ హైదరాబాద్, హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్‌లో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. టిఆర్‌ఎస్, బిజెపి శ్రేణుల మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగింది. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావుతో పాటు మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టిఆర్‌ఎస్ వర్సెస్ బిజెపిలా నడించింది. దీంతో పలుచోట్ల టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇరు పార్టీల నేతల మధ్య గొడవలు…- ఘర్షణలు… తోపులాటలు… ఉద్రిక్తతల మధ్య బైపోల్ హీట్ రాజేసింది. కాగా పలుచోట్ల రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలీసులు సకాలంలో చేరుకుని ఇరువర్గాలకు చెదరగొట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా 2018లో పోలిం గ్ శాతం 84.50శాతం నమోదు కాగా… ప్రస్తుతం 86.33 శాతం పోలింగ్ జరిగింది. దీంతో గత ఎన్నికంటే ఈ సారి 1.83శాతం పోలింగ్ అధికంగా జరిగింది.
ప్రధానంగా నియోజకవర్గంలోని వీణవంక మండలం, జమ్మికుంట, శ్రీరాములపల్లితో పాటు పలుచోట్ల అధికార టిఆర్, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. ఆ పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పోటీగా టిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తగు చర్యలు తీసుకుని పరిస్థితిని తిరిగి అదుపులోకి తీసుకొచ్చారు. కాగా నంబర్ ప్లేట్, ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో బిజెపి అభ్యర్ధి ఈటల వెంట తిరుగుతున్న వాహనాన్ని, అందులో ప్రయాణిస్తున్న ఆయన పిఆర్‌ఒ చైతన్యను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
హుజూరాబాద్‌లో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం నుంచే పోలింగ్ శాతం ఒక రేంజ్‌లో పరుగులు పెట్టింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే సీన్. కొన్నిచోట్ల అయితే రాత్రి 7 దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూల్లో నిల్చున్నారు. గంట గంటకూ ఓటింగ్ శాతం పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటల వరకే 76.26 శాతం పోలింగ్ నమోకుకావడం విశేషం. రాత్రి వరకూ ఇదే కంటిన్యూ అయింది. ప్రతి గంటకు దాదాపు 8 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకే 10.50 శాతం ఓటింగ్ జరిగగా, 11 గంటల వరకు 33 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 45 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు ్ల 61.66 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్ శాతం నమోదు అయ్యింది.
పోలింగ్ ముగిసే సమయానికి ఎనభై ఆరు శాతం దాటింది. కాగా కమలాపూర్ మండలం ఉప్పల్లో పోలింగ్ కేంద్రం 295లో ఇవిఎం మొరాయించింది. దీంతో వెంటనే దానికి మరమ్మత్తు చేశారు. దీంతో ఇక్కడ కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కాగాపోలింగ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తో పాటు సోలార్ దీపాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 1715 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం306 కేంద్రాల్లో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు…ఆ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మొత్తం 3,865 మంది పోలీసులు, 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 1,471 మంది ఇతర జిల్లాల పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
ధర్మమే గెలుస్తుంది : ఈటల
కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన సతీమణి జమున ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ వారిచే విచ్చలవిడిగా డబ్బులు పంచుకున్నారని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని రూ.వందల కోట్లు పంపిణీ చేశారని ఈటల అన్నారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ పంతం పట్టినట్లున్నారని, అందుకే అధికార యంత్రాంగం సాయంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆరోపించారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉంటారని, డబ్బుకు ప్రలోభాలకు లొంగరన్నారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని, ఆత్మగౌరవం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటెల పిలుపునిచ్చారు. అంతేకాకుండా సాధుకున్నా మీరే, చంపుకున్నా మీరే. మీప్రేమ అభిమానం ముందు డబ్బులు, మద్యం పనిచేయవు. పోలింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే మంచికి సంకేతం. ఈరోజు వారి ఆత్మను ఆవిష్కరించి గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానాన్ని, ప్రేమను ఆవిష్కరిస్తున్నారు. 90 శాతం పోలింగ్ అవుతుందని అనుకుంటున్నానని ఈటల అన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో శనివారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమునారెడ్డిలు, వీణవంక మం డలం హిమ్మత్‌నగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు, హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు, కుటుంబ సభ్యులు, హుజూరాబాద్ పట్టణంలో బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు దంపతులు తమ ఓటును హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికలలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
పోలింగ్ ప్రశాంతం: శశాంక్ గోయల్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ హుజూరాబాద్‌లో పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడక కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందన్నారు. పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ప్రధానంగా 88 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని అన్నారు.డబ్బు పంపిణీపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విచారణలో నిజాలు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా ఇతర ప్రాంతాలవారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిలో కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డబ్బుల పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గొప్ప విజయం సాధిస్తా: గెల్లు
మన తెలంగాణ /కరీంనగర్: హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓటర్లు చైతన్యాన్ని చాటా రని టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొ న్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత 4 నెలలుగా పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డా రు, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మార్గదర్శకం తో, హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదం తో గొప్ప విజయం సాధించబోతున్నామన్నారు..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహక రించిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపా రు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా శనివారం జరిగిన పోలింగ్ ప్రశాం తంగా జరిగేందుకు కృషిచేసిన ఓటర్లకు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపి పిలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, మున్సిపల్ ఛైర్మన్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు, కౌన్సి లర్లు, కోఆప్షన్ సభ్యులు, సింగిల్విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, కృతజ్ఞతాభివందనలు తెలిపారు.