30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్, 2న ఫలితం
ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
30 ఉ॥ 7గం॥ నుంచి సాయంత్రం 7వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, 47కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువమంది ఓటర్లు, మొత్తం ఓటర్లు 2,37,036 మంది
మహిళలు 1,19,102, పురుషులు 1,17,993 మంది
బరిలో 30 మంది అభ్యర్థులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులు,వికలాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,17,933, మహిళ ఓటర్లు 1,19,102 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 149 ఓట్లు ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా, రెండు ఇవిఎంలు ఉండనున్నాయి.
ఈ నెల 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో గురువారం రాత్రి 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి 7 గంటల వరకు, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలలో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి, అనుమానితుల కోసం పిపిఇ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
ముగిసిన ప్రచారం
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. బుధవారం రాత్రి 7 గంటలకు హుజురాబాద్‌లో మైక్‌లు మూగబోయాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేశారు. ఈ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్,బిజెపి, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌లు ప్రచారంలో నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడ్డారు.ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రచారం నిర్వహించారు. మూడు ప్రధాన పార్టీల తరపున ప్రచారం హోరాహోరీగా సాగింది. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. టిఆర్‌ఎస్ తరఫున మంత్రి హరీష్‌రావు ప్రచార బాధ్యతను తన భుజాన మోశారు.
మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేశారు. బిజెపి తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానందరాయ్, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ముగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్, సిఎల్‌పి నేత భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.బుధవారం మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పలు విధాలుగా రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.