Sunday, November 3, 2024

అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక

- Advertisement -
- Advertisement -
Huzurabad By-Election To Be Held On October 30
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల, 8వరకు నామినేషన్లు, పరిశీలన 11, ఉపసంహరణ గడువు 13, నవంబర్ 2 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో.. తన ఎంఎల్‌ఎ పదవికి జూన్ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా అంటే డిసెంబర్ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో అమలులోకి ఎన్నికల కోడ్ : శశాంక్ గోయల్

హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు, బైక్ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. ఎన్నికల నియామవళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని శశాంక్ గోయల్ ఆదేశించారు.

ఇవిఎంలు పరిశీలించాం.. మొత్తం ఓటర్లు 2,36,430

అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఇవిఎంలను ఇప్పటికే పరిశీలించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. వయోవృద్ధులకు, వికలాంగులు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 1,17,552, మహిళ ఓటర్లు 1,18,716 మంది ఉన్నారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 147, ట్రాన్స్ జెండర్ ఒకరు ఉన్నారని పేర్కొన్నారు.

త్వరలోనే ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణ

హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుందని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. మిగత రాష్ట్రాల్లో కూడా ఎంఎల్‌సి ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
ఉప ఎన్నిక షెడ్యూల్ వివరాలు
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13
అక్టోబర్ 30వ తేదీన పోలింగ్
నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News