పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో రైల్‌లో గత వారం రోజుల నుంచి ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. గ్రేటర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి చేరువలో ఉండటంతో ద్విచక్ర వాహనదారులు మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. సొంత వాహనాలకు పెట్టే ఖర్చుతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో కార్యాలయాలకు చేరుకుంటున్నట్లు పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ హయాంలో పెరగని విధంగా చమురు ధరలు పెంచి మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సంపాదించుకుందని మండిపడుతున్నారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పేదలపై పగపట్టి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధర పెంచి సమస్యల వలయంలోని నెట్టుతుందని ఆరోపిస్తున్నారు. నగర ప్రజలు ఎక్కువ మంది సొంత వాహనాలు ఇంటికి పరిమితం చేసి దూరం ప్రాంతాలకు వెళ్లాలంటే మెట్రో రైల్ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రోజుకు సుమారు 2లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో సిబ్బంది వెల్లడిస్తున్నారు. మెట్రో ప్రారంభించినప్పటి నుంచి కొవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మెట్రో ప్రయాణం సేఫ్‌గా ఉంటుందని చెబుతున్నారు. మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 360 ట్రిప్పులు సర్వీసు తిరగడంతో స్టేషన్‌కు వెళ్లగానే రైల్ అందుబాటులో ఉండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రారంభంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రైన్లు నడిచేవి, మార్చి నుంచి రైళ్ల వేళ్లలో మార్పులు చేస్తూ ఉదయం 6 గంటలకు మొదటి రైలు ప్రారంభించి రాత్రి 10 గంటలకు చివరి రైల్ బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు రాత్రి 11గంటలకు చేరుకునేలా పొడిగింపు చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మార్పుతో మరో 10 వేలమంది ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య రెట్టింపుతో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఎల్బీనగర్, చైతన్యపురి, మలక్‌పేట, ఎంజిబిఎస్, మెడికల్ కాలేజీ, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్, నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, యూసుప్‌గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ స్టేషన్లు నుంచి ప్రయానిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఆదాయ వనరులు పెరిగేందుకు మరికొన్ని నూతన ఆఫర్లు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు, సొంత వాహనాలకంటే మెట్రో ప్రయాణం సుఖదాయకమని, గ్రేటర్ ప్రజలు మెట్రోను ఆదరించాలని మెట్రో ఉన్నతాధికారులు కోరుతున్నారు.