కరోనా కట్టడికి నిఘా పెంచిన రాష్ట్ర పోలీసులు
మాస్క్ వేసుకోని 15వేల మందికి జరిమానా
విధించిన హైదరాబాద్ నగర పోలీసులు
రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లోనూ పరీక్షలు
రంగంలోకి పోలీసు కళాజాత బృందాలు
సిసిటివి కెమెరాలకు పెరిగిన ప్రాధాన్యం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌శాఖ మరోసారి అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ కేసులపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనలను పరిశీలిస్తున్న పోలీసుశాఖ వైరస్ వ్యాప్తి నియంత్రణ, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీసు శాఖ ఉన్నతాధికారులు మరోసారి అపరేషన్ మాస్క్‌కు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్, ప్రధాన రహదారులలో మాస్క్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించిన వారికి జ రిమానాలు విధించారు. ఈక్రమంలో జిహెచ్ఎ ంసి, ట్రాఫిక్ పోలీసులు మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝుళిపించారు. ఇందుకోసం సోమవారం నాటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కారులో ప్రయాణించే వారు కూడా విధిగా మాస్కు ధరి ంచాల్సిందేనని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు మాస్కు లేకుండా వాహనాలపై వెళ్తున్న వారి ఫోటోలు తీసి ఈ-చలాన్లను పంపించారు. గడచిన రెండు రోజులలో మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతూ వెళ్తున్న వారిపై 15 వేల కే సులు నమోదు చేశారు.
అలాగే పోలీస్‌శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కరోనా వైరస్‌పై అవగాహన, నియంత్రణ కోసం ఒక ప్రత్యేక పోలీస్‌అధికారిని నియమించింది. పట్టణాలు, గ్రామాలలో మత సంబంధమైన, రాజకీయ పరమైన సభలు, సమావేశాలు, వివాహాలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలు సైతం పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. ఇదిలావుండగా మాస్కులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించడానికి కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిపిటివి కెమెరాలు కీలకం కానున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఆగిన సమయంలో ఈ కెమెరాల నుంచి తప్పించుకొనే వీలు ఉండదని. ఈ దృశ్యాలు క్షణాల్లో నేరుగా ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుతాయి. ప్రధానంగా కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
రంగంలోకి పోలీసు కళాజాత బృందాలు ః
రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బినగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో కొత్తపేట కూడలి వద్ద పోలీసు కళాబృందంతో మంగళవారం నాడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 68 ప్రకారంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు ఉపయోగించి ఆరోగ్య నియమాలు పాటించి కరోనా ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా ఉంటే వచ్చే పరిణామాలను వాహనదారులకు అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించారు.
ఎపిలో సిఐకి మాస్క్ తొడిగిన ఎస్పి:
ఎపిలోనూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అర్బన్ పరిధిలోని లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి అమ్మిరెడ్డి మాస్కు ధరించకుండా విధులు నిర్వహిస్తున తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావును ప్రశ్నించారు. హడావుడిలో మాస్క్ మర్చిపోయానని సిఐ సమాధానమివ్వగా.. ఆయనకు జరిమానా విధించారు. అనంతరం ఎస్పి అమ్మిరెడ్డి స్వయంగా సిఐకి మాస్కు తొడిగారు. కొవిడ్ మరోసారి విజృంభిస్తున్న సమయంలో పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించని వాహనదారులను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు.
Hyd Police fined for not wearing mask