సమగ్ర కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించిన సిఎం
స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రాష్ట్రంగా హైదరాబాద్
నగరాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్న మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రపంచ పురాతన ప్రఖ్యాత నగరాల్లో ముందువరసలో ఉన్న భాగ్యనగరం.. అద్భుతాలకు, ఆర్థికాభివృద్ధికి నిలయంగా భాసిల్లుతోంది. హరిత హైదరాబాద్గా అభివృద్ధి చెందే దిశగా గణనీయమైన పురోగతి కనబరుస్తూ.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ( ఇసిబిసి) ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాత్మక ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణ స్పృహతో పాటు పాటు ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందిస్తూ.. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపరిచే దిశగా ముందుకు వెళుతోంది.ఇంధన సామర్థ్యంలో మరింత దూసుకుపోయేలా సమగ్ర కార్యచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో.. ఎనర్జీ ఎఫిషియన్సీలో పెట్టుబడి దారులకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌ను నిలిపేందుకు అవసరమైన చర్యలకు ఎంఏ యూడీ సన్నద్ధమవుతోంది.
ప్రజానుకూల విధానం, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)ని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ తరుణంలో అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీని అవలంబించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం నిర్వహిస్తున్న కాస్మో పాలిటిన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిశోర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను భారతదేశంలోనే అత్యుత్తమంగా కాకుండా, ప్రపంచ వేదికపై ప్రముఖ ఉదాహరణగా నిలిపాలన్నది సిఎం లక్ష్యంగా భావిస్తున్నారని తెలిపారు. ఇందుకనుగుణంగా ఇంధన సామర్థ్యంలో గణనీయమైన పెట్టుబడులతో పెట్టుబడిదార్నులి ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. పర్యావరణ బాధ్యతతో ఎనర్జీ ఎఫిషియన్సీకి ప్రపంచ సురక్షిత పెట్టుబడుల నగరంగా హైదరాబాద్ త్వరలోనే రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణానికి అనుకూలమైన అభివృద్ధి, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, మొత్తం శ్రేయస్సుతో కూడిన సమాజానికి దాని వల్ల కలిగే అనేక ప్రయోజనాలను గుర్తించి, దాని ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి గుర్తిస్తున్నారని దానకిషోర్ అన్నారు. మూసీ నది పర్యావరణ వ్యవస్థకు ప్రణాళికాబద్ధమైన పునరుజ్జీవనం కూడా ఇందులో భాగమని స్పష్టం చేశారు.
బిఇఇతో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఉన్న విభిన్న పరిశ్రమలు, త్వరితగతిన పెరుగుతున్న ప్రధాన గ్లోబల్ కంపెనీల ఉనికితో ఆర్థికాభివృద్ధి, పర్యావరణ బాధ్యతల మధ్య సమన్వయాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ రెడ్కో),బిఇఇ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీడియా సలహాదారు భాగస్వామ్యంతో ఇందన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి.. పలు విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.