Thursday, January 23, 2025

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఎకి బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)కి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే జాహేద్ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జాహేద్, మజ్ హాసన్ ఫరూఖ్, సమీయుద్దీన్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దసరా సందర్భంగా జాహేద్ ముఠా హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారు.

ఈ ముఠా పాకిస్థాన్, నేపాల్ మీదుగా మనోహరాబాద్‌కు పేలుడు పదర్థాలు (హ్యాండ్ గ్రనేడ్లు) తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించేలా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. వీరి కుట్రను భగ్నం చేసిన పోలీసులు గతేడాది జాహేద్, సమీయుద్దీన్, మజ్ హాసన్ ఫరూఖ్‌లను అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలు టార్గెట్‌గా ఈ ముఠా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, 15 ఏళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నింది తుడిగా ఉన్నాడు.

పాకిస్థాన్ నుంచి గ్రనైడ్‌లు.. హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర…

హైదరాబాద్‌పై దాడికి కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన సంస్థ ఈ దాడికి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ కుట్ర వెనకాల ఐఎస్‌ఐ,లష్కరేతోయిబా కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలతో అరెస్ట్ అయిన ఉగ్రవాది జాహేద్‌కు సంబంధాలున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పాక్ నుంచి అతడికి హ్యాండ్ గ్రనేడ్‌లు కూడా సప్లై చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది మరి కొందరిని రిక్రూట్ చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. ఏదైనా ర్యాలీని కానీ, జనం ఎక్కువగా ఉన్న పబ్లిక్ ప్లేస్‌లో కానీ దాడులు చేయాలని ముష్కరులు చూశారు. మత కల్లోలాలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాల్ని ఎన్‌ఐఎ అడ్డుకుంది. అరెస్ట్ అయిన ఉగ్రవాది నుంచి 2 హ్యాండ్ గ్రనేడ్స్‌తో పాటు రూ.4లక్షలు స్వాధీనం చేసు కున్నారు. గతంలోనూ జహీద్‌ను 2005లో అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి దాడి ఘటనలో అతని హస్తం ఉందని అదుపులోకి తీసుకున్నా సరైన ఆధా రాలు లభించకపోవడం వల్ల 2017లో విడుదల చేశారు. పాక్ నుంచి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పలు చోట్ల దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో జాహేద్ చెప్పాడు. బహిరంగ సభల్లో గ్రనేడ్‌లతో దాడులు చేయాలని కుట్ర చేయగా ఆ ప్లాన్ అమలు చేయకుండా అడ్డుకున్నారు.

ముంబయిలోనూ..

ముంబయిలో మరో ఉగ్రదాడికి కుట్ర జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎన్‌ఐఎకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే ముంబ యి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ దీనిపై విచారణ చేపడుతున్నాయి. ఎన్‌ఐఎ మెయిల్ ఐడికి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను ‘తాలిబన్‘గా చెప్పుకున్నాడు. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకు ముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. తాలిబన్ ఆర్గనైజేషన్‌లో కీలక వ్యక్తి సిరాజుద్దీన్. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని పోలీసులు విచారిస్తున్నారు. ముంబయిలోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ భద్రత పెంచారు.

అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్ హెడ్ సిరాజుద్దీన్‌ది చాలా పెద్ద నెట్‌వర్క్. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్ ఇతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడే కాదు. ముంబయికి ఇలాంటి బెదిరింపులు జనవరిలోనూ వచ్చాయి. కంట్రోల్ రూమ్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి సిటీలోని చాలా చోట్లు బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు. మరో రెండు నెలల్లో బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచే భద్రత పెంచిన పోలీసులు ప్రస్తుతం మరింత కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అప్రమత్తం అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి స్థలాన్ని పూర్తిగా పేల్చి వేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం సంచలనమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News