కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములు
లేవు ఈ భూములపై హెచ్‌సియుకు
ఎలాంటి హక్కులు లేవు ఎవరూ
ఆందోళనకు గురికావొద్దు వర్శిటీ
విద్యార్థులు రాజకీయ పార్టీల చేతుల్లో
పావులు కావొద్దు సామాజిక మాధ్యమాల్లో
వాస్తవాలను వక్రీకరిస్తున్నారు
ఉద్దేశపూర్వకంగా బిజెపి, బిఆర్‌ఎస్
విషప్రచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని
భూములను కాపాడి ప్రజలకు సమకూర్చాం
మీడియా సమావేశంలో డిప్యూటీ సిఎం
భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు,
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టీకరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూములు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవేనని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బి జెపి రాజకీయపార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. ఆ యా పార్టీల చర్యలు రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకే రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. మంగళవారం సచివాలయం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్
యూనివర్సిటి(హెచ్‌సియూ) కి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు అని తెలిపారు. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎంతో కాలంగా కోరుతున్నప్పటికీ పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా కుట్రబుద్దితో పని గట్టుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాకా సరిదిద్దామని, తమ ప్రభుత్వం చట్టబద్ధంగానే ముందుకు వెళ్తుందని, తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళన కు గురి కావొద్దని వారు విజ్ఞప్తి చేశారు.
భట్టి, దుద్దిళ్ళ పూర్వ విద్యార్ధులు
హెచ్‌సియూ పూర్వ విద్యార్ధులుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులకు పూర్తి వివరాలు తెలుసునని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వారం రోజుల కిందట యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ తో ప్రత్యేకంగా సమావేశమై వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ప్రస్తతం అక్కడ ఉన్నటువంటి నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ళ స్పష్టం చేశారు. అక్కడ ఉన్న పకృతి సంపదను పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళున్నట్లు తెలిపారు.
ఆందోళనకు గురికావొద్దు
కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని ఉదయం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుని మీడియా ముందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న భూమిపై న్యాయస్థానాల్లో గట్టి వాదనలు వినిపించి వాటిని కాపాడి ప్రజలకు ఆస్తిగా సమకూర్చామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోబోదని, సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదని వారు వివరించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు ఈ భూమిని కాపాడే విషయాన్ని గాలికొదిలేశారు తెలిపారు. ప్రజలకు సంపద సృష్టించడానికి ఆ భూములను టీజీఐఐసీకి అప్పగించినట్లు చెప్పారు.
వాస్తవాలు ఇవి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2004 ఫిబ్రవరి 03న రెవిన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని మంత్రులు తెలిపారు. భూ బదలాయింపు జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు అనే వ్యక్తి ప్రాతినిథ్యం వహించిన ఐఎం జి ఫ్లోరిడాకు చెందిన ఐఎంజి భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజి భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజి భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో WP NO 24781 ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.
ఐఎంజి భారత్ వేసిన రిట్ పిటిషన్ పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు న్యాయస్థానంలో మంచి అడ్వకేట్లు నియమించి ప్రభుత్వపరంగా వాదనలు వినిపించారని వివరించారు. మన వనరులు మనకే కావాలని, ఆస్తిత్వం, ఆత్మగౌరవం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వానికి తీసుకువచ్చే విషయాన్ని పట్టించుకోకపోగా గాలికి వదిలేశారని విమర్శించారు. కోట్లాది విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరో రకంగా గత పాలకులు వారి చేతుల్లోకి తెచ్చుకోవాలనే కుట్రతోనే న్యాయస్థానంలో నిబద్దతతో కొట్లాడ లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమి రాష్ట్ర సంపద, ప్రజల ఆస్తిగా భావించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో సహా రాష్ట్ర మంత్రి మండలి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితిలో ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి పోనివ్వకుండా ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. మంచి న్యాయవాదులను నియామకం చేసి న్యాయస్థానంలో కొట్లాడి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్రానికి తీసుకొచ్చామని ఇది ప్రజల విజయమని అన్నారు.
ఉద్దేశ్యపూర్వకంగా నిందలు
ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రశంసించాల్సిన బిజెపి, బిఆర్‌ఎస్ ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రులు వ్యాఖ్యానించారు. గత పాలకుల మాదిరిగా ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన 400 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యి ఉండేది కాదా అని వారిని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తి నుంచి తీసుకువచ్చిన భూమిని రాష్ట్ర ప్రజలకు ఆస్తిగా సృష్టించాలని, లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీ కి అప్పగించామే తప్ప ఇందులో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ లో ఫేస్ 1, ఫేస్ 2కి పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపనీలు పెట్టడం వల్ల లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయని తద్వారా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందన్నారు.
అదే తరహాలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో సంపద సృష్టించడం యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో దాని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదని వివరించారు. టీజీఐఒసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్ లో ఈ భూముల్లో ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్, దాని లో భాగంగా మష్రూమ్ రాక్ ను కాపాడడానికి ప్రత్యేక చర్యలు గైకొనడంలో భాగంగా ఈ ప్రాంతాలను లే అవుట్ నుండి మినహాయించామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రైవేటు వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం కాకుండా పోరాటం చేసి కాపాడిన ఈ భూమిని ప్రజలకు ఆస్తిగా ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు.
కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టమని ప్రజల ఆస్తిని వారి చేతుల్లోకి పోనివ్వమన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నాకు వ్యక్తిగతంగా బాండింగ్ ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలని అందుకు కావలసిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అక్కడ చదివిన ప్రతి విద్యార్థికి బయటకు రాగానే ఉద్యోగాలు రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందని ముగ్గురు మంత్రులు వివరించారు.