కెసిఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయం : ఎర్రబెల్లి
హైదరాబాద్ : అభివృద్ధిలో హైదరాబాద్, అమెరికాతో పోటీ పడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తానాలో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిందన్నారు. తెలుగు వాళ్లమంతా అమెరికాలో కలవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కొడుకు, కూతుర్లు ఊరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదన్నారు. కానీ తెలంగాణ వచ్చాక వద్దన్నా మనవండ్లు, మనవరాళ్లు వస్తున్నారన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు, మంచినీళ్లు రావడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన పచ్చటి బయళ్లతో కళకళాడుతున్నాయన్నారు.తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. మాకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మనమంతా కలిసి జరుపు కుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ తానా మహాసభలన్నారు. ఈ పండుగ కోసం మీరంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారన్నారు. మనం ఎక్కడ ఉన్నా మన దేశభక్తిని, కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చాటే సందర్భమన్నారు. ఉన్న ఊరును కూడా మరవని మన విశ్వసనీయతకు గుర్తు ఈ మహాసభలన్నారు.