నగరంలోని చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ
చేసిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. బ్రకీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నగరంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జంతువులను తరలిస్తున్న వారి వద్ద అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గురువారం రాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. జంతువులను తీసుకుని వెళ్తున్న వారి వద్ద పత్రాలను తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల్లో రిజిస్ట్రర్లను పరిశీలించారు. అనుమతి లేని వారు చెక్‌పోస్టుల పరిసరాల్లోకి రావద్దని అన్నారు. పశువులను తరలిస్తున్న వారి వద్ద పశువుల వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరగాలని అన్నారు. చెక్‌పోస్టుల్లో ఉన్న వారు వారికి సమాచారం వచ్చిన వెంటనే మిగతా వారితో పంచుకోవాలని కోరారు. చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించే అధికారి తనకు అవసరమైన సిబ్బందిని కలిగి ఉండాలని అన్నారు. లేకుంటే వెంటనే సీనియర్ అధికారులను సంప్రదించాలని, ఎలాంటి అక్రమ వ్యవహారం జరిగినా వెంటనే తెలుపాలని అన్నారు. ఇన్స్‌స్పెక్టర్లు, డిసిపి తమ పరిధిలోని చెక్‌పోస్టులను తనిఖీ చేయాలని కోరారు.