Wednesday, January 22, 2025

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

25,694 మంది పోలీసులతో భద్రత
125ప్లాటూన్లతో నిఘా
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 19కిలో మీటర్లు ఊరేగింపు
డ్రోన్లతో నిమజ్జనం ర్యాలీపై నిఘా
కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ
పలు ప్రాంతాల్లో పర్యటించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

మనతెలంగాణ, సిటిబ్యూరోః వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాన నిమజ్జన ర్యాలీ బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19కిలో మీటర్లు కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీ చాంద్రాయణగుట్ట, చార్మినార్, నయాపూల్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, పీపుల్స్ ప్లాజా వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ర్యాలీ ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని డిసిపిలను ఆదేశించారు. చార్మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ల సమీపంలో ర్యాలీకి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విగ్రహాల ఎత్తుకు సరిపడా కరెంట్ లైన్లు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించాలని కోరారు. వైర్లు కిందికి ఉన్న ప్రాంతాల్లో వెంటనే వాటిని సరిచేయాలని అన్నారు. నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో భారీ రద్దీ ఉంటుందని, దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని కోరారు.

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా 25,694మంది, 125 ప్లాటూన్లతో భారీ భద్రతను ఏర్పాటు చేశామని, పోలీసులు షిఫ్ట్ వారీగా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. 18 ముఖ్యమైన జంక్షన్లు ఉన్నాయని, ఎంజే మార్కెట్,అఫ్జల్‌గంజ్,అంబేద్కర్ విగ్రహం,ఎన్టిఆర్ మార్గ్ తదితర ప్రాంతాలు చాలా కీలకమైనవని తెలిపారు. మూడు ర్యాపిడ్ యాక్షన్ టీములు, పారామిలటరీ ఫోర్స్‌ను బందోబస్తుకు నియమిస్తున్నామని తెలిపారు. ఐదు డ్రోన్ల ద్వారా నిమజ్జనంపై నిఘా పెట్టామని తెలిపారు. నిమజ్జనం జరిగే రూట్లలో సిసి కెమెరాలతో నిఘా పెట్టామని తెలిపారు.

రంగంలోకి టీములు…
నిజ్జనం జరిగే రోజు ప్రధాన రోడ్లపైకి సాధారణ వాహనాలకు అనుమతిలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని పేర్కొన్నారు. నిమజ్జనం సందర్భంగా క్విక్ రెస్పాన్స్ టీములు, డాగ్ స్కాడ్, యాంటీ చైన్ స్నాచింగ్ టీములు, షీటీమ్స్ మోహరించామని తెలిపారు. కమాండ్ కంట్రోల్‌లో సీనియర్ అధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, ట్రాన్స్‌కో, వాటర్ వర్క్, ఆర్‌టిఏ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నిమజ్జనం విధుల్లో ఉంటారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News