లేకుంటే ఐపిఎల్‌ను అడ్డుకుంటాం
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపిఎల్ మినీ వేలం పాటలో హైదరాబాద్ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లపై సన్‌రైజర్స్ యాజమాన్యం చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. ఇక ఇప్పటికైన హైదరాబాద్ క్రికెటర్లకు సన్‌రైజర్స్ జట్టులో చోటు కల్పించాలని, లేకుంటే ఇక్కడ జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదని, అయినా వీరిపై చిన్నచూపు చూడడం శోచనీయమని ఆరోపించారు.
మరోవైపు బిజెపి శాససభ్యుడు రాజా సింగ్ సయితం ఇలాంటి హెచ్చరికనే చేశారు. స్థానిక క్రికెటర్లను తీసుకోకపోతే ఈసారి హైదరాబాద్‌లో ఐపిఎల్‌ను జరగనివ్వమని స్పష్టం చేశారు. ఇదిలావుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆరంభం నుంచి స్థానిక క్రికెటర్లపై చిన్నచూపు చూడడం అనవాయితీగా వస్తోంది. పేరుకే హైదరాబాద్ జట్టుగా ఉన్న సన్‌రైజర్స్‌లో స్థానిక క్రికెటర్లపై ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ వంటి ప్రతిభావంతుడిని సయితం సన్‌రైజర్స్ చిన్నచూపు చూసింది. అయితే సిరాజ్ ప్రతిభను గుర్తించిన బెంగళూరు యాజమాన్యం అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ ఏకంగా టీమిండియాకే ప్రధాన అస్త్రంగా మారిపోయాడు.