సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన రూ.4,09,23,217లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ నేరాల్లో బాధితుల నుంచి సైబర్ నేరస్థులు డబ్బులు కొట్టేశారు. దీంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సైబర్ క్రైం పోలీసులు వివిధ బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బులను ఫ్రీజ్ చేశారు. వాటిని తిరిగి బాధితులకు ఇచ్చేందుకు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు నుంచి అనుమతి రాగానే పోలీసులు సైబర్ బాధితులకు ఇవ్వనున్నారు.
సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని, ఫెడెక్స్ పేరుతో ఫోన్ చేసే వారిని నమ్మవద్దని అన్నారు. ఎలాంటి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, పార్ట్‌టైం జాబ్‌ల పేరు చెప్పే వారిని నమ్మవద్దని అన్నారు.