పోలీసుల రిమాండ్ రిపోర్ట్ కీలక విషయాలు వెలుగులోకి
నిందితుల జాబితాలో 24 మంది, సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ప్రస్తావన
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిందితుడు వెంకటరత్నాకర్ రెడ్డిపై 25కు పైగా కేసులు
వెంకట రత్నాకర్‌రెడ్డి వద్ద నుంచి 18 మంది డ్రగ్స్ కొనుగోలు
ఆ 18 మందిని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం
పరారీలో నలుగురు డ్రగ్స్ విక్రయదారులు
సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌లకు వెంకటరత్నాకర్ రెడ్డి టోకరా, రూ.30 లక్షలు వసూలు
మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్ కథా చిత్రంలో మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 24 మందిని నిందితుల జాబితాలో చేర్చారు. రిమాండ్ రిపో ర్టులో చిత్రపరిశ్రమకు చెందిన పలువురి ప్రముఖుల పేర్లను సైతం ప్రస్తావించారు. గతంలో వినిపించినా వారి పేర్లను కూడా ఇందులో జోడిం చారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి బాలాజీ, వెంకటరత్నాకర్‌రెడ్డి విక్రయాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు సినిమా ఫైనాన్షియర్ వెంకటరత్నాకర్‌రెడ్డి డ్రగ్స్ వినియోగించాడని, గతంలో అతనిపై నేర చరిత్ర ఉందని వెల్లడించారు. నిందితుడు వెంకటరత్నాకర్‌రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 25కుపైగా కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో నలుగురు డ్రగ్స్ విక్రయదారులు పరారీలో ఉన్నారని, వైజాగ్ చెందిన రామ్ సహా ముగ్గురు నైజీరియన్స్ పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు వెంకట రత్నాకర్‌రెడ్డి వద్ద నుంచి 18 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసి వారే సేవిస్తున్నారా? ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఆ 18 మందిని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. 18 మందిలో పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల పేర్లు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. డ్రగ్స్ సేవించిన వారి లిస్టులో పలువురు సెలబ్రిటీస్, ఈవెంట్ మేనేజర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. రామ్ చంద్, కలహర్ రెడ్డి, సుశాంత్ రెడ్డి, రవి ఉప్పలపాటీ, శ్వేత, రామ్ కుమార్, కార్తిక్, సూర్య, ఇంద్ర తేజ, హిటాచి, నర్సింగ్, అజీమ్, అహ్మద్ ఈ కేసులో ఉన్నారని పోలీసులు తెలిపారు. వైజాగ్‌కు చెందిన రామ్ నుంచి బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేశారని, గతంలోనూ కలహర్ రెడ్డి, సుశాంత్ రెడ్డి, రవి ఉప్పలపాటీ, శ్వేత, ఇంద్ర తేజా పేర్లు వినిపించాయి. ఈ కేసులో పట్టుబడిన వెంకట రత్నాకర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి.
వెంకట రత్నాకర్‌రెడ్డి లీలలు చూసి కంగుతింటున్న పోలీసులు
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వెంకట రత్నాకర్‌రెడ్డి లీలలు చూసి పోలీసులు కంగుతింటున్నారు. సినిమాలో అవకాశాల పేరుతో యువతులకు నిందితుడు వల వేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు విచారణలో గుర్తించారు. ఐఆర్‌ఎస్ అధికారిగా చెప్పుకుంటూ వెంకట్ రత్నాకర్‌రెడ్డి మోసాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది.
సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రమేష్ ల నుండి కూడా ఐఆర్‌ఎస్ అధికారిగా చెప్పుకొని వెంకట్ రూ.30 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఐఆర్‌ఎస్ అధికారిగా చెప్పుకుంటూ పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను కూడా మోసం చేసినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయని సమాచారం. ఎపికి చెందిన ఓ ఎంపి పేరు చెప్పి వెంకటరత్నాకర్ రెడ్డి డబ్బులు వసూలు చేశారని కూడా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మరో వైపు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని మహిళలకు ఆశచూపి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా కూడా పోలీసులు తమ విచారణలో తేల్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వీకేండ్ పార్టీలు నిర్వహిస్తూ వారిని బురిడీ కొట్టించినట్టుగా విచారణలో తేల్చారు. గతంలో కూడ వెంకట్ పై వ్యభిచారం నిర్వహించారనే కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు.